Asia cup 2022: ఆసియా కప్‌ను భారత్-పాక్ పోరులా కాకుండా గెలుపు కోసం చూడండి: గంగూలీ
17 August 2022, 8:40 IST
- ఆసియా కప్ ఈ నెల 28 నుంచి జరగనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీని భారత్-పాక్ పోరు వలే కాకుంండా టోర్నీలో గెలుపుపై దృష్టి పెట్టాలని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సూచించారు.
సౌరవ్ గంగూలీ
ఈ నెలాఖరు నుంచి ఆసియా కప్ 2022 జరగనున్న విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ ఈ సారి టీ20 ఫార్మాట్‌లో జరగనుంది. అక్టోబరులో టీ20 ప్రపంచకప్ రానున్న తరుణంలో పొట్టి ఫార్మాట్‌లో నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ టోర్నీ కోసం అభిమానులు కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కారణం.. ఇండియా-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లు జరగని తరుణంలో ఐసీసీ టోర్నీల్లోనే ఇరుజట్లు తలపడనున్నాయి. గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో జరిగిన పరాభావానికి పాక్‌పై ప్రతీకారం తీర్చుకోవాలి భారత అభిమానులు ఆసియా కప్‌లో ఈ మ్యాచ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ అంశంపై బీసీసీఐ అధ్యక్షడు సౌరవ్ గంగూలీ స్పందించారు. ఆసియా కప్‌ను భారత్-పాక్ మ్యాచ్ వలే కాకుండా టోర్నీలో విజయం కోసం చూడాలని స్పష్టం చేశారు.
"నేను ఈ టోర్నీని ఆసియా కప్ వలే చూస్తున్నా. భారత్-పాక్ మ్యాచ్ వలే చూడట్లేదు. నేను ఆడే రోజుల్లో భారత్-పాక్ అంటే అది నాకు మరో మ్యాచ్ మాత్రమే. నేను టోర్నీలో గెలవలానే చూస్తాను. భారత్ మెరుగైన జట్టు. ఇటీవల కాలంలో చాలా బాగా రాణిస్తున్నారు. ఆసియా కప్‌లోనూ మా జట్టు మంచి ప్రదర్శన ఇస్తుందని ఆశిస్తున్నా" అని గంగూలీ స్పష్టం చేశారు.
గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై పాక్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇప్పుడు అదే వేదికపై ఆసియా కప్ ఓపెనింగ్ మ్యాచ్ జరగనుంది. దీంతో ఆ మ్యాచ్‌లో ఎలాగైనా చిరకాల ప్రత్యర్థిపై ప్రతీకారం తీర్చుకోవాలి టీమిండియాతో పాటు అభిమానులు కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయంపైనే గంగూలీ క్లారిటీ ఇచ్చారు. ప్రతీకారం కోసం కాకుండా విజయం కోసం ఆడాలని పిలుపునిచ్చారు.
ఆసియా కప్ తర్వాత టీమిండియా అక్టోబరులో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో పాల్గొననుంది. అక్కడ కూడా భారత్-పాక్ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాబర్ ఆజం నేతృత్వంలోని పాక్ జట్టును మరోసారి ఓడించాలని భావిస్తున్నారు.
ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 11 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఈ 15వ ఎడిషన్ టోర్నమెంట్ యూఏఈ వేదికగా ఆరుజట్లతో జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా ఇప్పటివరకు అత్యధిక సార్లు ఆసియా కప్ గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఏడు సార్లు ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. గత ఎడిషన్‌ను వన్డే ఫార్మాట్‌లో నిర్వహించగా.. ఈ సారి మాత్రం టీ20 ఫార్మాట్‌లో జరగనుంది.
టాపిక్