Sourav Ganguly on his future: ఈసారి మరింత పెద్దది చేయబోతున్నాను: గంగూలీ
13 October 2022, 15:36 IST
- Sourav Ganguly on his future: ఈసారి మరింత పెద్దది చేయబోతున్నానని అన్నారు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ. అక్టోబర్ 18న ఆయన స్థానంలో బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలను మరో మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ చేపట్టనున్న విషయం తెలిసిందే.
బంధన్ బ్యాంక్ ఈవెంట్ లో సౌరవ్ గంగూలీ
Sourav Ganguly on his future: ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఓ ప్రత్యేక పేజీని సొంతం చేసుకున్న వ్యక్తి సౌరవ్ గంగూలీ. ప్లేయర్‌గా, కెప్టెన్‌గా, ఆ తర్వాత పరిపాలనలో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్, బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ఎప్పుడూ అందరి కంటే పైనే ఉన్నారు. ఇక ఇప్పుడు బీసీసీఐలో ఆయన శకం ముగియబోతోంది. మరోసారి అధ్యక్ష పదవిలో కొనసాగాలని దాదా భావించినా.. ఆయనకు సభ్యుల నుంచి మద్దతు లభించలేదు.
దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పదవి నుంచి దిగిపోనున్నారు. ఈ పదవి కోసం నామినేషన్ వేసిన ఏకైక వ్యక్తి రోజర్ బిన్నీ.. అక్టోబర్ 18న జరగబోయే బోర్డు ఏజీఎంలో అధ్యక్షుడు కానున్నారు. ఈ నేపథ్యంలో తన భవిష్యత్తు ప్రణాళికలపై గంగూలీ స్పందించారు. బంధన్ బ్యాంక్ ఈవెంట్‌లో పాల్గొన్న దాదా.. భవిష్యత్తులో మరింత పెద్ద పని చేయబోతున్నట్లు చెప్పారు.
అడ్మినిస్ట్రేటర్‌గా చాలా కాలం కొనసాగానని, ఇక ఇప్పుడు కొత్తగా మరేదైనా చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. "నేను చాలా కాలంగా అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్నాను. ఇక ఇప్పుడు మరేదైనా చేస్తాను. జీవితంలో ఏం చేసినా సరే ఇండియాకు ఆడిన రోజులే అత్యుత్తమం. బీసీసీఐకి అధ్యక్షుడిగా ఉన్నాను. ఇక ఇప్పుడు మరింత పెద్దది చేయబోతున్నాను. ఎప్పటికీ ప్లేయర్‌గా ఉండలేరు, ఎప్పటికీ అడ్మినిస్ట్రేటర్‌గా ఉండలేరు. ఇవి రెండూ చేయడం గొప్ప అనుభూతినిచ్చింది" అని గంగూలీ అన్నారు.
"నేనెప్పుడూ చరిత్రను పట్టించుకోలేదు. కానీ ఆ స్థాయిలో ఆడే నైపుణ్యం ఈస్ట్‌లో లేదు అన్న ఫీలింగ్ ఉండేది. ఒక్కరోజులోనే ఎవరూ అంబానీ లేదా మోదీ అయిపోరు. దానికి కొన్ని నెలలు, సంవత్సరాల కృషి అవసరం" అని గంగూలీ చెప్పారు. ఇక తన కెప్టెన్సీ రోజుల గురించి కూడా దాదా స్పందించారు.
"ఆరుగురు కెప్టెన్లు టీమ్‌ను లీడ్ చేసేవాళ్లు. వన్డే టీమ్ నుంచి రాహుల్ ద్రవిడ్‌ను తప్పించబోతే నేను అడ్డుపడ్డాను. టీమ్ ఎంపికలో నేను వాళ్ల సలహాలు తీసుకున్నాను. ఓ టీమ్ వాతావరణంలో ఇలాంటివి గుర్తించకుండా ఉండలేరు. నేను కేవలం రన్స్ మాత్రమే చేయలేదు. వ్యక్తులు ఇతర విషయాలు కూడా గుర్తుంచుకుంటారు. ఓ లీడర్‌గా వాళ్లకేం చేశావన్నది గుర్తు పెట్టుకుంటారు" అని గంగూలీ అన్నారు.
టాపిక్