Gill vs Rahul: ఒక్క స్పాట్ కోసం ఇద్దరు.. గిల్ vs రాహుల్.. తుది జట్టులో ఛాన్స్ ఎవరికో?
28 February 2023, 6:43 IST
- Gill vs Rahul: టీమిండియా ఆటగాళ్లు శుబ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేశారు. తుది జట్టులో ఓపెనర్ స్థానం కోసం వీరిద్దరూ తీవ్రంగా కృషి చేస్తున్నారు. మరి వీరిద్దరిలో చివరికి ఎవరికి ఛాన్స్ లభిస్తుందో ఆసక్తికరంగా మారింది.
నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న కేఎల్ రాహుల్-శుబ్ మన్ గిల్
Gill vs Rahul: ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకు టీమిండియా సన్నద్ధమవుతోంది. ఇండోర్ వేదికగా బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ కోసం భారత ఆటగాళ్లు తీవ్రంగా సాధన చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అందరి చూపు కేఎల్ రాహుల్‌పైనే ఉంది. గత రెండు టెస్టుల్లో విఫలమైన అతడి స్థానంలో శుబ్‌మన్ గిల్‌ను ఆడించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. టెస్టు సిరీస్ ప్రారంభం నుంచి గిల్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని వాదనలు పెరుగుతున్నప్పటికీ జట్టు యాజమాన్యం మాత్రం రాహుల్ వైపే మొగ్గుచూపింది. అయితే రెండు టెస్టుల్లోనూ బ్యాట్‌తో ఘోరంగా విఫలం కావడంతో మూడో మ్యాచ్‌కు గిల్‌ను తీసుకుంటారనే అభిమానులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే సోమవారం నాడు ప్రాక్టీస్‌లో గిల్-రాహుల్ ఇద్దరూ తీవ్రంగా ప్రాక్టీస్ చేశారు.
ఫైనల్ ట్రైనింగ్ సెషన్‌లో ఇరువురు ఆటగాళ్లు మిగిలిన వారి కంటే కాస్త ఎక్కువగానే చెమటలు చిందించారు. కేఎల్ రాహుల్ ప్రధానంగా డిఫెన్స్‌పై దృష్టి పెట్టగా.. శుబ్‌మన్ గిల్ మాత్రం షాట్లు ఎక్కువగా ఆడాడు. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో సాగిన ట్రైనింగ్ సెషన్‌లో 30 నిమిషాల పాటు నెట్స్‌లో సాధన చేశారు. మరి వీరిద్దరిలో తుది జట్టులోకి ఎవరిని తీసుకోవాలంటే మాత్రం భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
టీమ్ మేనేజ్మెంట్ నుంచి కేఎల్ రాహుల్‌కు పూర్తి మద్దతు లభిస్తోంది. ఓపెనర్‌గా అతడు పదే పదే విఫలమవుతున్నప్పటికీ ఈ అతడి వైపే మొగ్గుచూపిస్తున్నారు. మరోప్కక శుబ్‌మన్ గిల్‌ను తీసుకోవాలని మాజీ క్రికెటర్లు, అభిమానులు కోరుకుంటున్నారు. అతడు అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో ఈ వాదనలు పెరుగుతున్నాయి. రాహుల్‌కు ఎన్ని అవకాశాలిచ్చినా నిలబెట్టుకోలేకపోయాడని, కాబట్టి అతడి స్థానంలో గిల్‌ను తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మరి టీమ్ మేనేజ్మెంట్ ఎవరిని తుది జట్టులోకి తీసుకుంటుందో వేచి చూడాలి. ఫామ్‌లో ఉన్న గిల్‌కు అవకాశమిస్తారా? లేక అనుభవం కలిగిన కేఎల్ రాహుల్ వైపే ఆసక్తి చూపిస్తారా అనేది చూడాలి. మరోపక్క చివరి రెండు టెస్టులకు కేఎల్ రాహుల్‌ను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించడం చూస్తుంటే అతడిపై వేటు పడే అవకాశాలే కనిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో బుధవారం నాడు జరగనున్న మూడో టెస్టుతో తెలుస్తుంది.