తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Shreyas Iyer: అయ్యర్ అరుదైన ఘనత.. రాహుల్ రికార్డు బ్రేక్ చేసిన శ్రేయాస్

Shreyas Iyer: అయ్యర్ అరుదైన ఘనత.. రాహుల్ రికార్డు బ్రేక్ చేసిన శ్రేయాస్

23 July 2022, 8:45 IST

google News
    • పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన రెండో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ విషయంలో కేఎల్ రాహుల్‌ను అధిగమించాడు.
శ్రేయాస్ అయ్యర్
శ్రేయాస్ అయ్యర్ (AFP)

శ్రేయాస్ అయ్యర్

వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ 3 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. అయితే శ్రేయాస్ అయ్యర్ ఈ మ్యాచ్‌లో 54 పరుగులతో వన్డే కెరీర్‌లో 10వ అర్ధశతకాన్ని నమోదు చేశాడు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అయ్యర్ ధావన్‌తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ అయ్యర్ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో వేగంగా 1000 పరుగులను పూర్తి చేసిన రెండో భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.

వన్డేల్లో వేగంగా వేయ్యి పరుగులు పూర్తి చేసిన భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉన్నారు. వీరిద్దరూ 24 ఇన్నింగ్స్‌లో ఈ రికార్డు నెలకొల్పగా శ్రేయాస్ 25 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. అయితే అయ్యర్ తన సహచర బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను అధిగమించాడు. రాహుల్‌కు ఈ రికార్డుకు 27 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యియి. టీమిండియా మాజీ బ్యాటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూతో సమమయ్యాడు.

వన్డేల్లో వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన భారత ఆటగాళ్లు..

1. విరాట్ కోహ్లీ- 24 ఇన్నింగ్స్‌లు

2. శిఖర్ ధావన్- 24 ఇన్నింగ్స్‌లు

3. శ్రేయాస్ అయ్యర్- 25 ఇన్నింగ్స్‌లు

4. నవ్‌జ్యోత్ సింగ్ సిద్దూ- 25 ఇన్నింగ్స్‌లు

5. కేఎల్ రాహుల్- 27 ఇన్నింగ్స్‌లు.

గతేడాది కాలంగా శ్రేయాస్ అయ్యర్ టీమిండియా తరఫున అన్ని ఫార్మాట్లలోనూ కీలక ప్లేయర్‌గా ఆడుతున్నాడు. అయితే ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో రెండు మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించలేదు. విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ నుంచి పోటీ గట్టిగా ఉండటంతో అతడికి స్థానం దక్కలేదు. ఇప్పటి వరకు శ్రేయాస్ అయ్యర్ 28 వన్డేల్లో 41.71 సగటుతో 1001 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ 10 అర్ధశతకాలు ఉన్నాయి.

వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌ చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. 309 పరుగుల లక్ష్యంతో భరిలోకి దిగిన కరేబియన్ బ్యాటర్లు 6 వికెట్లు కోల్పోయి 305 పరుగులకు పరిమితమయ్యారు. చివరి ఓవర్‌లో 15 పరుగులు అవసరం కాగా.. 11 పరుగులే చేసింది. భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ పొదుపుగా బౌలింగ్ విండీస్ నుంచి విజయాన్ని దూరం చేశాడు.

టాపిక్

తదుపరి వ్యాసం