Sachin and Kohli Comparison: సచిన్-కోహ్లీని పోల్చిన అక్తర్.. ఇద్దరిలో ఎవరు బెస్టో చెప్పిన పాక్ మాజీ పేసర్
06 March 2023, 11:55 IST
- Sachin and Kohli Comparison: పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్.. సచిన్ తెందూల్కర్, విరాట్ కోహ్లీ గురించి ఆసక్తిర వ్యాఖ్యలు చేశాడు. ఇద్దరిలో ఎవరు బెస్టో తెలిపాడు. అయితే సచిన్ ప్రపంచంలోనే బెస్ట్ బ్యాటర్ అని, కానీ కెప్టెన్‌గా విఫలమయ్యాడని తెలిపాడు.
సచిన్ -కోహ్లీని పోల్చిన అక్తర్
Sachin and Kohli Comparison: సచిన్ తెందూల్కర్.. గాడ్ ఆఫ్ క్రికెట్‌గా ఆరాధించే మన మాస్టర్ రికార్డుల గురించి ఎంత చెప్పినా తక్కునే. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో శత శతకాలను పూర్తి చేసిన ఏకైక ఆటగాడిగా ఘనత సాధించాడు. సచిన్ తర్వాత ఆ రికార్డు అందుకునే అవకాశం ఎవరికైనా ఉందా? సమీపంలో విరాట్ కోహ్లీ పేరు మాత్రమే వినిపిస్తోంది. ఇప్పటికే 74 ఇంటర్నేషనల్ సెంచరీలు చేసిన కోహ్లీ.. సచిన్ రికార్డు అధిగమిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే వీరిద్దరిలో ఎవరు బెస్ట్ అంటే చెప్పడం కష్టమే. ఇద్దరూ వారి వారి జెనరేషన్‌లో అద్బుత ఆటతీరుతో మెప్పిస్తున్నారు. తాజాగా సచిన్-కోహ్లీని పోలుస్తూ పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
"చూడండి.. సచిన్ తెందూల్కర్ ప్రపంచంలోనే బెస్ట్ బ్యాటర్. అయితే అతడు కెప్టెన్‌గా విఫలమయ్యాడు. తనకు తానే కెప్టెన్సీని వదులుకున్నాడు. ఇదే సమయంలో విరాట్ కోహ్లీ దగ్గరకొస్తే అతడి గురించి ఇదే విషయంపై నా స్నేహితులతో కొన్నిసార్లు చర్చించాను. కోహ్లీ కొన్ని సార్లు విఫలమై ఉండొచ్చు.. కానీ తన మనస్సుతో ఆలోచించి ఆడినప్పుడు మెరుగైన ప్రదర్శన చేశాడు. మైండ్ ఫ్రీగా ఉన్నప్పుడు టీ20 ప్రపంచకప్‌ను శాసించాడు" అని అక్తర్ స్పష్టం చేశాడు.
కోహ్లీపై అక్తర్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడి శతకాల కారణంగానే ఒకానొక దశలో భారత్ వరుస విజయాలను సొంతం చేసుకుందని తెలిపాడు.
"లక్ష్య ఛేదనలోనే కోహ్లీ 40 సెంచరీలు చేశాడు. కోహ్లీని విపరీతంగా పొగొడుతున్నానని చాలా మంది నాతో అంటున్నారు. అయితే ఒకానొక దశలో కోహ్లీ సెంచరీలు చేయడం వల్ల భారత్ విజయం సాధించిందనే విషయం తెలుసుకోవాలి." అని అక్తర్ అన్నాడు.
ప్రస్తుతం విరాట్ కోహ్లీ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్ ఆడుతున్నాడు. అయితే ఈ సిరీస్‌లో టీమిండియా 2-1 తేడాతో ముందుంది. చివరి టెస్టు మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా మార్చి 9 నుంచి ప్రారంభం కానుంది.