Kohli vs Hooda: కోహ్లి vs హుడా చర్చ సరికాదు: పియూష్ చావ్లా
14 July 2022, 15:50 IST
- Kohli vs Hooda: విరాట్ కోహ్లి టీమ్‌లో లేని సమయంలో అతని మూడోస్థానంలో సెటిలయ్యేలా కనిపిస్తున్నాడు యువ బ్యాటర్ దీపక్ హుడా. అయితే అప్పుడే ఈ ఇద్దరి మధ్యా పోటీ అన్నది సరికాదని మాజీ క్రికెటర్ పియూష్ చావ్లా అంటున్నాడు.
విరాట్ కోహ్లి
న్యూఢిల్లీ: ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌తో టాప్ ఫామ్‌లోకి వచ్చాడు దీపక్ హుడా. లక్నో సూపర్ జెయింట్స్ తరఫున అద్భుతంగా ఆడిన అతడు.. ఆ తర్వాత టీమిండియాలో ఛాన్స్ కొట్టేసి ఇక్కడా సత్తా చాటుతున్నాడు. ఐర్లాండ్‌పై ఓపెనర్‌గా వచ్చి ఏకంగా సెంచరీ బాదాడు. ఇంగ్లండ్‌తో తొలి టీ20లోనూ 33 రన్స్‌తో రాణించాడు. అయితే తర్వాత అతన్ని రెండు టీ20లకు పక్కనపెట్టారు.
కారణం అప్పటికే విరాట్ కోహ్లి టీమ్‌లోకి తిరిగొచ్చాడు. సీనియర్ అయినా సరే ఫామ్‌లోని కోహ్లి బదులు మంచి ఫామ్‌లో ఉన్న హుడాను పక్కనపెట్టడమేంటన్న విమర్శలు వచ్చాయి. టీ20ల్లో మూడోస్థానంలో కోహ్లి స్థానాన్ని దీపక్ హుడాకు వదిలేయాలన్న సూచనలూ వచ్చాయి. అయితే దీనిపై తాజాగా మాజీ స్పిన్ బౌలర్ పియూష్ చావ్లా స్పందించాడు.
కోహ్లి vs హుడా అనే చర్చ సరికాదని, కోహ్లికి ఎంతో అనుభవం ఉండగా.. హుడా మూడు, నాలుగు ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు మాత్రమే ఆడినట్లు చావ్లా గుర్తు చేశాడు. "కోహ్లికి గొప్ప రికార్డు ఉంది. ఎప్పుడూ ప్రస్తుత ఫామ్‌నే పరిగణనలోకి తీసుకోవద్దు. ఎందుకంటే ఇది ఎవరికైనా జరగొచ్చు. కోహ్లి ఒక్క మంచి ఇన్నింగ్స్ ఆడితే చాలు. అతడు తిరిగి ఫామ్‌లోకి వస్తాడు. హుడా కేవలం 3, 4 గేమ్స్ మాత్రమే ఆడాడు. టీ20 వరల్డ్‌కప్‌లాంటి వాటిలో అనుభవానికి ఓటెయ్యాలి. కోహ్లి vs హుడా అనడం సరికాదు. కోహ్లిలాంటి వ్యక్తి నేరుగా తుది జట్టులోకి రాగలడు" అని చావ్లా అన్నాడు.
సౌతాఫ్రికా, ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లు ఆడని కోహ్లి.. ఇంగ్లండ్‌తో కేవలం రెండు టీ20లు ఆడిన ఫెయిలయ్యాడు. ఇప్పుడు వెస్టిండీస్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు కూడా అతన్ని దూరం పెట్టారు. దీంతో అసలు కోహ్లికి టీ20 వరల్డ్‌కప్ టీమ్‌లో చోటు దక్కుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.