తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Virat Kohli: చిరంజీవి పాటలకు విరాట్‌ కోహ్లి డ్యాన్స్‌ చేసేవాడు: రవితేజ

Virat Kohli: చిరంజీవి పాటలకు విరాట్‌ కోహ్లి డ్యాన్స్‌ చేసేవాడు: రవితేజ

Hari Prasad S HT Telugu

13 July 2022, 21:39 IST

google News
    • Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మన మెగాస్టార్‌ చిరంజీవి పాటలకు డ్యాన్స్‌ చేసేవాడట. ఈ విషయాన్ని ఒకప్పుడు అతని రూమ్‌మేట్‌గా ఉన్న హైదరాబాద్‌ క్రికెటర్‌ ద్వారక రవితేజ షేర్‌ చేశాడు.
విరాట్ కోహ్లితో రవితేజ
విరాట్ కోహ్లితో రవితేజ (Raviteja Twitter)

విరాట్ కోహ్లితో రవితేజ

న్యూఢిల్లీ: విరాట్‌ కోహ్లి ఫీల్డ్‌లో చూడటానికి చాలా సీరియస్‌గా, దూకుడుగా కనిపిస్తాడు కానీ.. అతడు చాలా సరదాగా ఉంటాడని అతని సహచరులు చెబుతుంటారు. ఫీల్డ్‌ బయట ఎంజాయ్‌ చేయడానికే ఎక్కువగా ఇష్టపడతాడు. విరాట్‌తో కలిసి ఆడిన మాజీ, ప్రస్తుత క్రికెటర్లు అతని గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు చెబుతారు. తాజాగా ద్వారక రవితేజ కూడా ఓ ఇంట్రెస్టింగ్‌ విషయం చెప్పాడు.

మంగళవారం(జులై 12) ట్విటర్‌ ద్వారా రవితేజ ఇప్పటి వరకూ ఎవరికీ తెలియని విషయాన్ని వెల్లడించాడు. విరాట్‌ కోహ్లిని యూకేలో కలిసిన సందర్భంగా అతనితో రవితేజ ఫొటోలు దిగాడు. వాటిని ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ఒకప్పటి జ్ఞాపకాలను పంచుకున్నాడు. ఈ ఇద్దరూ అండర్‌ -15 క్రికెట్‌ ఆడే రోజుల్లో ఒకే రూమ్‌లో ఉండేవారు. ఆ సమయంలో విరాట్‌.. మెగాస్టార్‌ చిరంజీవి పాటలకు డ్యాన్స్‌ చేసేవాడని రవితేజ చెప్పాడు.

"అతన్ని ఆరేళ్ల తర్వాత యూకేలో కలిశాను. కలవగానే అతడు అడిగిన తొలి విషయం.. చిరు ఎలా ఉన్నావ్‌ అని? అండర్‌ 15 రోజుల్లో మేమిద్దరం రూమ్‌మేట్స్‌. నేను టీవీలో చిరంజీవి పాటలు చూసేవాడిని. అతడు వాటికి డ్యాన్స్‌ చేసేవాడు. అప్పటి నుంచే మేమిద్దరం ఒకరికొకరం చిరు అని నిక్‌నేమ్‌ ఇచ్చుకున్నాం. నిన్ను చూడటం చాలా బాగుంది చిరు" అని విరాట్‌ కోహ్లి గురించి రవితేజ ట్వీట్‌ చేశాడు.

హైదరాబాద్‌ టీమ్‌ తరఫున 78 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన రవితేజ 4722 రన్స్‌ చేశాడు. అతడు డెక్కన్‌ ఛార్జర్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున 32 ఐపీఎల్ మ్యాచ్‌లు కూడా ఆడాడు. ఇండియా అండర్‌-19 టీమ్‌ తరఫున కూడా ప్రాతినిధ్యం వహించాడు.

తదుపరి వ్యాసం