తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Sanju Samson Fans To Protest: బీసీసీఐకి వ్యతిరేకంగా నిరసన చేపట్టనున్న సంజూ శాంసన్‌ ఫ్యాన్స్‌

Sanju Samson Fans to Protest: బీసీసీఐకి వ్యతిరేకంగా నిరసన చేపట్టనున్న సంజూ శాంసన్‌ ఫ్యాన్స్‌

Hari Prasad S HT Telugu

14 September 2022, 21:50 IST

google News
    • Sanju Samson Fans to Protest: బీసీసీఐకి వ్యతిరేకంగా నిరసన చేపట్టాలని నిర్ణయించారు సంజూ శాంసన్‌ ఫ్యాన్స్‌. అతన్ని టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌లోకి ఎంపిక చేయకపోవడంపై వాళ్లు గుర్రుగా ఉన్నారు.
సంజూ శాంసన్, దినేష్ కార్తీక్
సంజూ శాంసన్, దినేష్ కార్తీక్ (AFP)

సంజూ శాంసన్, దినేష్ కార్తీక్

Sanju Samson Fans to Protest: సంజూ శాంసన్‌ను టీ20 వరల్డ్‌కప్‌ టీమ్‌లోకి ఎంపిక చేయకపోవడంపై అభిమానులు ఇంకా ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏకంగా బీసీసీఐకి వ్యతిరేకంగా నిరసన చేపట్టాలని నిర్ణయించారు. దీనికోసం ఇండియా, సౌతాఫ్రికా మధ్య తిరువనంతపురంలో జరగబోయే మ్యాచ్‌నే వేదికగా చేసుకోనుండటం గమనార్హం.

ఈ టీ20 మ్యాచ్‌ సెప్టెంబర్‌ 28వ తేదీన అక్కడి గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియంలో జరగబోతోంది. కేరళ క్రికెటర్‌ అయిన సంజూకి పదేపదే అన్యాయం జరుగుతుండటంపై అక్కడి అభిమానులు చాలా రోజులుగా క్రికెట్‌ బోర్డుపై ఆగ్రహంతో ఉన్నారు. తనకు వచ్చిన అవకాశాలను అతడు సద్వినియోగం చేసుకుంటున్నా కూడా శాంసన్‌ను ఎంపిక చేయడం లేదని వాళ్లు భావిస్తున్నారు.

ఈ మధ్యే వెస్టిండీస్‌ టూర్‌లో సంజూ శాంసన్‌ రాణించాడు. దీంతో టీ20 వరల్డ్‌కప్‌కు అతన్ని ఎంపిక చేస్తారని అభిమానులు ఆశగా ఎదురు చూశారు. అయితే రిషబ్‌ పంత్‌, దినేష్‌ కార్తీక్‌లను ఎంపిక చేసిన సెలక్టర్లు సంజూకి మొండిచేయి చూపించారు. ఫామ్‌లో ఉన్న శాంసన్‌ను కాకుండా ఈ సీజన్‌లో పెద్దగా రాణించని కేఎల్‌ రాహుల్‌, రిషబ్‌ పంత్‌లను ఎలా సెలక్ట్‌ చేస్తారని కూడా శాంసన్‌ ఫ్యాన్స్‌ ప్రశ్నిస్తున్నారు.

దీంతో ఇండియా, సౌతాఫ్రికా మ్యాచ్‌ సందర్భంగా కొందరు అభిమానులు సంజూ శాంసన్‌ ఫొటోలు ఉన్న టీషర్ట్స్‌ వేసుకొని వచ్చి బీసీసీఐకి నిరసన తెలపాలని నిర్ణయించుకున్నట్లు ఐఏఎన్‌ఎస్‌ న్యూస్‌ ఏజెన్సీ వెల్లడించింది. ఆస్ట్రేలియాతో ఈ నెల 20 నుంచి మూడు టీ20ల సిరీస్‌ ప్రారంభం కానుండగా.. అది ముగియగానే సౌతాఫ్రికాతో తిరువనంతపురంలోనే ఇండియా తొలి టీ20 ఆడనుంది.

ఈ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా టీ20 సిరీస్‌లకు కూడా సంజూ శాంసన్‌ పేరును సెలక్టర్లు పరిశీలించలేదు. ఈ రెండు సిరీస్‌లలోనూ పంత్‌, కార్తీక్‌లు చోటు దక్కించుకున్నారు. ప్రతి సిరీస్‌కు టీమ్‌ ఎంపిక జరిగినప్పుడల్లా సంజూ శాంసన్‌కు జరిగే అన్యాయంపై అతని ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉంటారు. సోషల్‌ మీడియాలో సంజూకి మద్దతుగా, బీసీసీఐని వ్యతిరేకిస్తూ పోస్ట్‌లు చేస్తుంటారు.

తదుపరి వ్యాసం