Sania Last Professional Match: ఓటమితో ప్రొఫెషనల్ కెరీర్ ముగించిన సానియా.. తొలి రౌండులోనే పరాజయం
22 February 2023, 6:31 IST
- Sania Last Professional Match: సానియా మీర్జా తన 20 ఏళ్ల ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్‌ను ముగించింది. ఓటమితో తన కెరీర్‌కు వీడ్కొలు పలికింది. మంగళవారం దుబాయ్ డ్యూటీ ఫ్రీ టెన్నిస్ ఛాంపియన్‌షిప్స్‌లో ఆడిన సానియా.. తొలి రౌండులోనే ఓడింది.
సానియా మీర్జా
Sania Last Professional Match: ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్‌ను ఓటమితో ముగించింది. సరిగ్గా నెల క్రితం తన చివరి గ్రాండ్ స్లామ్ మ్యాచ్ ఆడిన సానియా.. తాజాగా దుబాయ్ వేదికగా జరిగిన డబ్ల్యూటీఏ దుబాయ్ డ్యూటీ ఫ్రీ టెన్నిస్ ఛాంపియన్ షిప్స్‌లో తన ఆఖరి ప్రొఫెషనల్ టెన్నిస్ మ్యాచ్ ఆడింది. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో తన అమెరికన్ భాగస్వామి మాడిసన్ కీస్‌తో కలిసి ఆడిన సానియా తొలి రౌండులో ఓటమి పాలైంది. రష్యన్ జోడీ వెరోనికియా కుదెరమెతోవా-లూయిడ్‌మిలా సంసోనోవా చేతిలో పరాజయం పాలైంది.
రష్యన్ జోడీ చేతిలో 4-6, 0-6 తేడాతో తొలి రౌండులో సానియా ఓడిపోయింది. తొలి సెట్ హోరా హోరీగా జరుగ్గా.. రెండో గేమ్‌లో మాత్రం సానియా జోడీ చేతులెత్తేసింది. రష్యన్ పెయిర్ పూర్తి వీరిపై పూర్తి ఆధిపత్యం చెలాయించి మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. సానియా-మాడిసన్ కీస్ సర్వీస్‌లను బ్రేక్ చేసి ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. ఫలితంగా మ్యాచ్‌ను రష్యన్‌లు సులభంగా సొంతం చేసుకున్నారు. దీంతో సానియా తన చివరి ప్రొఫెషనల్ మ్యాచ్‌ను ఓటమితో ముగించింది.
ఈ 36 ఏళ్ల హైదరాబాదీ టెన్నిస్ స్టార్ తన కెరీర్‌లో 43 డబుల్స్‌ను ఓ సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 2005లో సానియా అరంగేట్రం చేసినప్పుడు భారత్ టెన్నిస్‌కు ఆశాజ్యోతిగా పరిగణించబడింది. 2007 ఆగస్టులో సానియా తన కెరీర్‌లో మెరుగైన సింగిల్స్ ర్యాంక్ 27ను సాధించింది. 2005 గ్రాండ్ స్లామ్‌లో ఆమె నాలుగో రౌండుకు చేరుకుంది. గ్రాండ్ స్లామ్ సింగిల్స్‌లో ఇదే ఆమెకు అత్యుత్తమ ప్రదర్శనగా మిగిలిపోయింది. గ్రాండ్‌స్లామ్ డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో మొత్తం ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలుచుకుంది.
మహేష్ భూపతితో కలిసి 2009 ఆస్ట్రేలియన్ ఓపెన్, 2012 ఫ్రెంచ్ ఓపెన్ గెలిచింది. అనంతరం బ్రూనో సోర్స్‌తో కలిసి యూఎస్ ఓపెన్ సొంతం చేసుకుంది. 2016 రియో ఒలింపిక్స్ సెమీ ఫైనల్ వరకు వెళ్లింది. అయితే ఎన్ని టైటిళ్లను గెలిచినప్పటికి తన చివరి మ్యాచ్‌ను విజయంతో మాత్రం ముగించలేకపోయింది. రష్యన్ జోడీ కుందెమోతోవా-సంసోనోవా దుబాయ్ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించి సానియా ఆశలపై నీళ్లు చల్లారు.