Sachin Tendulkar on Dhoni: అందుకే ద్రవిడ్‌ను కాదని ధోనీకి కెప్టెన్సీ ఇవ్వమన్నాను: సచిన్ టెండూల్కర్
22 December 2022, 12:11 IST
- Sachin Tendulkar on Dhoni: ద్రవిడ్‌ను కాదని ధోనీకి కెప్టెన్సీ ఇవ్వమని ఎందుకు చెప్పానో సచిన్ టెండూల్కర్ వివరించాడు. ఇన్నేళ్ల తర్వాత మాస్టర్ చెప్పిన విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.
2011 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ధోనీని హత్తుకున్న సచిన్ టెండూల్కర్
Sachin Tendulkar on Dhoni: టీమిండియా మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్లలో ధోనీ ఒకడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అతని కెప్టెన్సీ దక్కినప్పుడు మాత్రం దేశమంతా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే అప్పటికే టీమ్‌లో సచిన్, గంగూలీ, ద్రవిడ్‌లాంటి సీనియర్లంతా ఉన్నారు. వాళ్లను కాదని పెద్దగా అనుభవం లేని ధోనీకి కెప్టెన్సీ ఇవ్వడమేంటన్న ప్రశ్నలు తలెత్తాయి.
అయితే తర్వాతి కాలంలో ఆ ప్రశ్నలకు ధోనీ తన కెప్టెన్సీతో బదులిచ్చాడు. 2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, టెస్టుల్లో నంబర్ వన్ ఇలా ధోనీ కెప్టెన్సీలో ఇండియన్ క్రికెట్ ఓ రేంజ్‌కు వెళ్లింది. కానీ అసలు ధోనీకి కెప్టెన్సీ దక్కడంలో సచిన్ టెండూల్కర్ పాత్ర ఉంది అన్న విషయం చాలా మందికి తెలియదు. ఓ సీనియర్ మోస్ట్ ప్లేయర్‌గా, ప్రపంచ క్రికెట్‌ను దశాబ్దాల పాటు ఏలిన వ్యక్తిగా సచిన్ మాటకు అప్పట్లో ఎంతో విలువ ఉండేది.
అతని సలహా మేరకే టీమ్ మేనేజ్‌మెంట్ ధోనీకి కెప్టెన్సీ అప్పగించింది. అయితే తాను ధోనీ పేరునే ఎందుకు చెప్పానో తాజాగా మాస్టర్ వివరించాడు. ఇన్ఫోసిస్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సచిన్.. కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
"నాకు కెప్టెన్సీ ఆఫర్ వచ్చిన సమయంలో నేను ఇంగ్లండ్‌లో ఉన్నాను. అయితే మన టీమ్‌లోనే ఓ మంచి లీడర్ ఉన్నాడు. అతడు ఇంకా జూనియరే అయినా.. మీరు అతన్ని కచ్చితంగా చూడాలని చెప్పాను. ఫీల్డింగ్ చేసే సమయాల్లో ధోనీతో నేను చాలా సంభాషణలు జరిపాను. ఎక్కువగా ఫస్ట్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తుంటాను కాబట్టి ధోనీతో మాట్లాడేవాడిని. అప్పుడే ద్రవిడే కెప్టెన్ అయినా.. ధోనీ ఏమనుకుంటున్నాడో తెలుసుకునే వాడిని. అతడి ఫీడ్‌బ్యాక్ చాలా బ్యాలెన్స్‌డ్‌గా, ఎంతో పరిణతితో కూడుకుని ఉండేది" అని సచిన్ వివరించాడు.
"మంచి కెప్టెన్సీ అంటే ప్రత్యర్థి కంటే ఒక అడుగు ముందే ఉండటం. జోష్‌తోకాదు హోష్‌తో ఆడాలి అని మనం అనుకునే విధంగానే ధోనీ ఉండేవాడు. అది వెంటనే జరిగేది కాదు. 10 వికెట్లు 10 బాల్స్‌లో దక్కవు. దానికోసం ప్లాన్ చేయాలి. చివరికి స్కోరుబోర్డే చూస్తారు. ఈ లక్షణాలన్నీ ధోనీలో కనిపించాయి. అందుకే అతని పేరును ప్రతిపాదించాను" అని సచిన్ చెప్పాడు.
2011లో ధోనీ సారథ్యంలోని టీమిండియా వన్డే వరల్డ్‌కప్ గెలిచినప్పుడు సచిన్ టీమ్‌లోనే ఉన్నాడు. అతనికది ఆరో వరల్డ్‌కప్. కెరీర్ ముగింపు దశలో మాస్టర్ తన వరల్డ్‌కప్ కలను సాకారం చేసుకున్నాడు. 2013లో ధోనీ కెప్టెన్‌గా ఉన్న సమయంలోనే సచిన్ రిటైరయ్యాడు.