Felicitate U19 World Cup Women Team: సచిన్ చేతుల మీదుగా అండర్ 19 వుమెన్స్ టీమ్‌కు సత్కారం.. ఎప్పుడంటే?
31 January 2023, 7:07 IST
- Felicitate U19 World Cup Women Team: భారత మహిళల అండర్ 19 వుమెన్ జట్టు ఇటీవల ప్రపంచకప్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వీరి విజయానికి చిరు సత్కారం చేయనున్నారు సచిన్, బీసీసీఐ. ఈ మేరకు ఫిబ్రవరి 1న అహ్మాదాబాద్ వేదికగా సత్కరించనున్నారు.
భారత మహిళల అండర్ 19 వరల్డ్ కప్ జట్టు
Felicitate U19 World Cup Women Team: ఇటీవల జరిగిన అండర్ 19 వుమెన్స్ వరల్డ్ కప్‌లో భారత మహిళల జట్టు విశ్వవిజేతగా మారిన సంగతి తెలిసిందే. ఆదివారం నాడు ఇంగ్లాండ్ వుమెన్స్ టీమ్‌తో జరిగిన ఫైనల్‌లో సులభంగా గెలిచిన భారత అమ్మాయిలు.. ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్నారు. ఫలితంగా భారత మహిళల క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఓ ఐసీసీ ట్రోఫీని తన ఖాతాలో వేసుకున్నారు. దీంతో వీరిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని భారత అండర్ 19 వుమెన్స్ టీమ్‌ను ఘనంగా సత్కరించనుంది బీసీసీఐ. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ కూడా ఈ సత్కాక కార్యక్రమంలో పాలు పంచుకోనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జైషా ట్విటర్ వేదికగా ప్రకటించారు.
ఫిబ్రవరి 1న అహ్మదాబాద్ వేదికగా భారత అండర్ 19 మహిళల జట్టును సత్కరించనున్నారు. "భారతరత్న శ్రీ సచిన్ తెందూల్కర్, బీసీసీఐ ఫిబ్రవరి 1వ తేదీని అహ్మదాబాద్ శ్రీ నరేంద్రమోదీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సాయంత్రం 6.30 గంటలకు అండర్ 19 జట్టును సత్కరించనున్నాం. ఈ యువ క్రికెటర్ల భారత్‌ను గర్వపడేలా చేశారు. వీరి విజయాలను గౌరవించాలి." అని జైషా ట్విటర్ వేదికగా ప్రకటించారు.
సౌతాఫ్రికా వేదికగా జరిగిన మహిళల అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై భారత్ విజయం సాధించింది. ఈ ఫైనల్ తర్వాత భారత మహిళల జట్టు సోమవారం నాడు ముంబయికి చేరుకుంది. అక్కడ నుంచి సరాసరి సన్మాన కార్యక్రమం కోసం అహ్మదాబాద్ బయల్దేరింది. బుధవారం నాడు ఈ కార్యక్రమం జరగనుంది. ఇదే వేదికపై బుధవారం నాడు భారత్-న్యూజిలాండ్ నిర్ణయాత్మక చివరి టీ20 జరగనుంది.
షెఫాలీ వర్మ కెప్టెన్సీలో భారత అండర్ 19 జట్టు విశ్వవిజేతగా నిలిచింది. భారత మహిళల క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఓ ఐసీసీ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్‌తో జరిగిన ఈ ఫైనల్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు 17.1 ఓవర్లో కేవలం 68 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లు టైటాస్ సధు, అర్చనా దేవి, ప్రశవి చోప్రా ధాటికి ఇంగ్లాండ్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. అనంతరం లక్ష్య ఛేదనంలో భారత అమ్మాయిలు 3 వికెట్లు కోల్పోయి 14 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు. సౌమ్యా తివారీ(24), గొంగడి త్రిష(24) ఆకట్టుకునే ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందించారు.