Rohit Sharma Dance: తొలి వన్డేకు డుమ్మా కొట్టి బావ మరిది పెళ్లిలో డ్యాన్స్ చేసిన రోహిత్.. వీడియో
17 March 2023, 15:11 IST
- Rohit Sharma Dance: తొలి వన్డేకు డుమ్మా కొట్టి బావ మరిది పెళ్లిలో డ్యాన్స్ చేశాడు కెప్టెన్ రోహిత్ శర్మ. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో రోహిత్ లేకపోవడంతో హార్దిక్ కెప్టెన్ గా ఉన్న విషయం తెలిసిందే.
రోహిత్ శర్మ
Rohit Sharma Dance: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేకు డుమ్మా కొట్టిన రోహిత్ శర్మ.. తన బావ మరిది పెళ్లిలో డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. తన భార్య రితికా సజ్దే సోదరుడి పెళ్లి గురువారం (మార్చి 16) రాత్రి జరిగింది. ఈ పెళ్లిలో భార్యతో కలిసి రోహిత్ స్టేజ్ పై స్టెప్పులేశాడు.
కొరియోగ్రాఫర్ స్టెప్పులూ చూపిస్తుండగా.. ఈ ఇద్దరూ డ్యాన్స్ చేయడం విశేషం. ఈ వీడియో చూసి ఫ్యాన్స్ చాలా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. హిట్‌మ్యాన్ తన బెస్ట్ స్టెప్పులు వేస్తున్నాడని ఓ యూజర్ కామెంట్ చేశాడు. ఇక మరో వ్యక్తి స్పందిస్తూ.. క్రీజులోలాగే డ్యాన్స్ లోనూ రోహిత్ ఫుట్‌వర్క్ చాలా బాగుందని సరదాగా అన్నాడు. ఈ పెళ్లి కోసమే రోహిత్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డే నుంచి తప్పుకున్నాడు.
అతడు తిరిగి రెండు, మూడు వన్డేలకు టీమ్ లోకి వస్తాడు. రోహిత్ లేకపోవడంతో తొలి వన్డేలో హార్దిక్ పాండ్యా స్టాండిన్ కెప్టెన్ గా ఉన్న విషయం తెలిసిందే. రోహిత్ కెప్టెన్సీలో ఈ మధ్యే ఆస్ట్రేలియాపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఇండియా 2-1తో గెలుచుకుంది. ఈ ట్రోఫీని ఇండియా వరుసగా నాలుగోసారి గెలవడం విశేషం.
తొలి వన్డేలో రోహిత్ లేకపోవడంతో ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ రానున్నారు. ఇక వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టిన కేఎల్ రాహుల్ ఐదోస్థానంలో బ్యాటింగ్ కు దిగనున్నాడు. మరో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కూడా గాయం కారణంగా ఆస్ట్రేలియాతో సిరీస్ కు దూరమయ్యాడు. అతడు ఐపీఎల్లో ఆడతాడా లేదా అన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది.