Roger Federer Emotional: ముగిసిన టెన్నీస్ మజిలీ.. ఓటమితో ఫెదరర్ వీడ్కోలు.. స్విస్ దిగ్గజం కన్నీటి పర్యంతం
24 September 2022, 7:41 IST
- Roger Federer Last Match: రోజర్ ఫెదరర్ తన చివరి మ్యాచ్‌లో ఓటమి పాలయ్యాడు. నాదల్‌తో కలిసి లేవర్ కప్ డబుల్ మ్యాచ్ ఆడిన అతడు.. వరల్డ్ టీమ్ సభ్యులు జాక్ సాక్స్-ఫ్రాన్సీస్ టియాఫో చేతిలో ఓటమి పాలయ్యారు.
రోజర్ ఫెదరర్
Roger Federer Lost his last Match: టెన్నీస్‌లో ఓ శకం ముగిసింది. స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ప్రొఫెషనల్ కెరీర్‌కు లేవర్ కప్‌తో ఘనంగా వీడ్కొలు పలికాడు. తను ఆడబోయే చివరి టోర్నీ ఇదేనని ఇప్పటికే ప్రకటించిన రోజర్.. శుక్రవారం తన చివరి ప్రొఫెషనల్ మ్యాచ్ ఆడాడు. స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్‌తో కలిసి లేవర్ కప్ డబుల్స్ మ్యాచ్‌లో ఓడిన అతడు పరాజయంతో ఆటకు గుడ్‌బై చెప్పాడు. సెంటర్ కోర్టు వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో వరల్డ్ టీమ్.. జాక్స్ సాక్స్- ఫ్రాన్సీస్ టియాఫే జోడీ చేతిలో ఫెదరర్-రఫా ద్వయం ఓటమి పాలైంది.
రెండు గంటల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో నాదల్-ఫెదరర్ తీవ్రంగా పోరాడారు. అయితే చివరకు 4-6, 7-6(7-2), 11-9 తేడాతో ఓటమి పాలయ్యారు. ఫలితంగా లేవర్ కప్‌లో టీమ్ యూరప్‌తో టీమ్ వరల్డ్ 2-2 తేడాతో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో సాక్స్-టియాఫే ఆధిపత్యం కనిపించింది. పూర్తిగా ప్రశాంతంగా ఓడిన ఈ జోడి.. తమ సీనియర్ టెన్నీస్ ప్లేయర్లను ఓడించారు. ఫెదరర్-నాదల్ ఒక మ్యాచ్ పాయింట్‌తో ఓ సెట్‌లో నెగ్గినప్పటికీ చివరకు విజయం మాత్రం ప్రత్యర్థులనే వరించింది.
మ్యాచ్ అనంతరం ఫెదరర్ కన్నీటి పర్యంతం..
ఈ మ్యాచ్‌లో పరాజయం పాలైన తర్వాత ఫెదరర్-నాదల్ ఇద్దరూ కన్నీటి పర్యంతమయ్యారు. భావోద్వేగానికి లోనైన ఫెదరర్ టెన్నీస్‌పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఇదే సమయంలో ఫ్యాన్స్ కళ్లల్లోనూ నీళ్లు తిరిగాయి. రెండు దశాబ్దాల పాటు అద్వితీయమైన జైత్రయాత్ర కొనసాగించిన రోజర్‌కు విషెస్ చెబుతూ.. ఘనంగా వీడ్కొలు పలికారు. ఫెదరర్ కోర్టులో ఉంటే టెన్నీస్ ఆట ఎప్పుడూ ఒకేలా ఉండదని ఓ అభిమాని పేర్కొన్నాడు.
ఫెదరర్ చివరి ఆట తర్వాత అభిమానులు సోషల్ మీడియా వేదికగా విశేషంగా స్పందించారు. "ఈ ఆటను ఎంతో గొప్పగా మార్చినందుకు థ్యాంక్యూ ఫెదరర్.. టెన్నీస్ ఎప్పుడూ మళ్లీ ఇలా ఉండదు" అని ఓ అభిమాని తన స్పష్టం చేశాడు. ప్రొఫెషనల్ టెన్నీస్‌లో తన కెరీర్‌లో పర్ఫెక్ట్‌గా ఉన్నందుకు ఫెదరర్‌పై మరో అభిమాని ప్రశంసల వర్షం కురిపించాడు.
"అతడి ప్రతిభ అద్భుతం. ఎన్నో మరపురాని క్షణాలు అందించాడు. టెన్నీస్‌లో ఎప్పుడూ జెంటిల్మెన్ తరహాలో వ్యవహరించాడు. ఆట కోసం ఇంత చేసిన నీకు ధన్యవాదాలు" అంటూ మరో అభిమాని ఫెదరర్‌కు కృతజ్ఞతలు చెప్పాడు.