తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rishabh Pant: టీమ్‌లో రిషబ్‌ పంత్‌ ప్లేస్‌కు గ్యారెంటీ లేదు: ఇర్ఫాన్‌ పఠాన్‌

Rishabh Pant: టీమ్‌లో రిషబ్‌ పంత్‌ ప్లేస్‌కు గ్యారెంటీ లేదు: ఇర్ఫాన్‌ పఠాన్‌

Hari Prasad S HT Telugu

17 June 2022, 14:21 IST

google News
    • టీమిండియాలో గతంలో ఎప్పుడూ చూడని పరిస్థితి నెలకొంది. ఒక్క వికెట్‌ కీపర్‌ కూడా దొరకని పరిస్థితి నుంచి ఇప్పుడు ఏకంగా నలుగురు వికెట్‌ కీపర్లు తుది జట్టులో చోటు కోసం పోటీపడే పరిస్థితి వచ్చింది.
రిషబ్ పంత్
రిషబ్ పంత్ (PTI)

రిషబ్ పంత్

న్యూఢిల్లీ: సౌతాఫ్రికాతో సిరీస్‌లో రిషబ్‌ పంత్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ బ్యాట్‌తో అతని ప్రదర్శన దారుణంగా ఉంది. తొలి రెండు మ్యాచ్‌లలో ఓడి విశాఖపట్నం టీ20లో గెలిచిన తర్వాత కెప్టెన్‌గా పంత్‌ కాస్త ఊరట చెందినా బ్యాటర్‌గా మాత్రం అతనిపై ఇంకా ఒత్తిడి ఇంకా కొనసాగుతూనే ఉంది. రాజ్‌కోట్‌లో మరో డూ ఆర్‌ డై మ్యాచ్‌కు అతడు సిద్ధమవుతున్నాడు.

ఈ నేపథ్యంలో రిషబ్‌ పంత్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌. ఇప్పుడైతే కెప్టెన్‌గా ఉన్నాడు కానీ భవిష్యత్తులో తుది జట్టులోనే చోటు గల్లంతయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. "అతను అసలు ఆడటం లేదు. కచ్చితంగా ఆడాల్సిందే. ప్రస్తుతానికైతే కెప్టెన్‌గా ఉన్నావు కాబట్టి ఫర్వాలేదు. కానీ భవిష్యత్తులో తుది జట్టులో ఉండటానికే చాలా శ్రమించాల్సి రావచ్చు" అని స్టార్‌ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ ఇర్ఫాన్‌ అన్నాడు.

"ఇప్పటికే దినేష్‌ కార్తీక్‌, ఇషాన్‌ కిషన్‌ తుది జట్టులో ఉన్నారు. వీళ్లు వికెట్‌ కీపర్లే. సంజు శాంసన్‌ వెయిటింగ్‌లో ఉన్నాడు. కేఎల్‌ రాహుల్‌ కూడా కీపింగ్‌ చేయగలడు. అతడు కచ్చితంగా తుది జట్టులో ఉంటాడు. రాహుల్‌ బెస్ట్‌ క్రికెటర్‌. ఆ లెక్కన చాలా కాంపిటిషన్‌ ఉంది. చాలా రోజుల పాటు ఇలా పరుగులు చేయకుండా ఉండలేవు" అని ఇర్ఫాన్‌ స్పష్టం చేశాడు.

సౌతాఫ్రికాతో మూడు టీ20ల్లో పంత్‌ కేవలం 40 రన్స్‌ మాత్రమే చేశాడు. బంతిని చాలా హార్డ్‌గా కొట్టడానికి పంత్‌ ప్రయత్నిస్తున్నాడని, ముఖ్యంగా ఆఫ్‌సైడ్‌లో అతడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఇర్ఫాన్‌ చెప్పాడు. "టీ20 గేమ్‌ అతనిదే. అందులో సందేహం లేదు. రిషబ్‌ పంత్‌ సూపర్‌స్టార్‌ ప్లేయర్‌. అతడు 24 ఏళ్ల కుర్రాడు. మరో పదేళ్లు ఆడితే అతడో అద్భుతమైన క్రికెటర్‌ అవుతాడు. ఈ మధ్య ఆఫ్‌సైడ్‌లో ఆడే సమయంలో బలంగా కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. లెగ్‌సైడ్‌లో ఆడే సమయంలో ఉపయోగించినంత బలం ఆఫ్‌సైడ్‌లో ఆడే సమయంలో ఉపయోగిస్తే సమస్యలు వస్తాయి. చాలా బలంగా ఆడటానికి ప్రయత్నిస్తూ గాల్లోకి బంతిని లేపుతున్నాడు. ఆఫ్‌సైడ్‌లో గ్రౌండ్‌పై నుంచి ఆడుతూ.. లెగ్‌సైడ్‌లో గాల్లోకి ఆడితే బాగుంటుంది" అని ఇర్ఫాన్‌ పఠాన్‌ కీలకమైన సూచన చేశాడు.

టాపిక్

తదుపరి వ్యాసం