Rishabh Pant: టీ20ల్లో పంత్‌ను ఓపెనర్‌గా పంపాలన్న గవాస్కర్.. గిల్‌క్రిస్ట్‌తో పోల్చిన లెజెండ్
06 July 2022, 20:55 IST
- Rishabh Pant: వైట్‌బాల్ క్రికెట్‌లో రిషబ్ పంత్‌ను ఓపెనర్‌గా పంపాలంటూ ఓ కొత్త ప్రతిపాదన చేశాడు లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. అంతేకాదు ఈ సందర్భంగా అతన్ని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గిల్‌క్రిస్ట్‌తో పోల్చాడు.
రిషబ్ పంత్
న్యూఢిల్లీ: సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో దారుణంగా విఫలమైన రిషబ్ పంత్.. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్ట్‌లో మాత్రం చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో ఇండియాకు విజయంపై ఆశలు కల్పించడంలో అతనిదే కీలకపాత్ర. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. దూకుడైన క్రికెటర్‌గా పేరున్న రిషబ్ పంత్ విచిత్రంగా వైట్ బాల్ క్రికెట్‌లో కాకుండా సాంప్రదాయ టెస్ట్ క్రికెట్‌లో ఎక్కువగా రాణిస్తున్నాడు.
టెస్టుల్లో ఇప్పటి వరకూ అతడు 43.32 సగటుతో 2123 రన్స్ చేశాడు. అందులో ఐదు సెంచరీలు ఉన్నాయి. అదే సమయంలో వన్డేల్లో 32 సగటుతో 715 రన్స్, టీ20ల్లో 23 సగటుతో 741 రన్స్ మాత్రమే చేశాడు. వన్డేలు, టీ20ల్లో ఒక్క సెంచరీ కూడా లేదు. అయితే వైట్ బాల్ క్రికెట్‌లోనూ పంత్ ఆ స్థాయిలో ఆడాలంటే అతన్ని ఓపెనర్‌గా పంపాలని సూచిస్తున్నాడు లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్.
"ఇది చాలా మంది ఆప్షన్. ఆస్ట్రేలియా తరఫున ఆడమ్ గిల్‌క్రిస్ట్ వైట్ బాల్ క్రికెట్‌లో ఎలా ఆడాడో చూడండి. టెస్టుల్లో ఆరు, ఏడు స్థానాల్లో వచ్చినా వైట్ బాల్ క్రికెట్‌లో ఓపెనర్‌గా వచ్చి విధ్వంసం సృష్టించేవాడు. ఎక్కువ ఓవర్లు ఆడే ఛాన్స్ వస్తే రిషబ్ పంత్‌లాంటి ప్లేయర్ కూడా అదే విధ్వంసం సృష్టించవచ్చు" అని గవాస్కర్ అనడం విశేషం.
"రిషబ్ పంత్ అనగానే ఫినిషర్‌గా చూస్తున్నాం. అతడు చివర్లో వస్తున్నాడు. వెంటనే షాట్లు ఆడటానికి ప్రయత్నించి ఔటవుతున్నాడు. ఓపెనర్‌గా వస్తే ఫస్ట్ బాల్ నుంచే ధాటిగా ఆడాలన్న ఆలోచన అతనికి ఉండదు. పేస్, మూవ్‌మెంట్ తెలుసుకోవడానికి అతనికి కొన్ని బాల్స్ ఆడే ఛాన్స్ ఉంటుంది. ఇంగ్లండ్‌లో అయితే వైట్ బాల్‌తోనూ మొదట్లో కాస్త మూవ్‌మెంట్ ఉంటుంది. ఇది ఇండియాకు కలిసొచ్చేదే" అని గవాస్కర్ అన్నాడు.