Rishabh Pant Accident Video: రిషబ్ పంత్ కారు ప్రమాదం ఇలా జరిగింది.. వైరల్ అవుతున్న సీసీటీవీ ఫుటేజ్
30 December 2022, 12:49 IST
- Rishabh Pant Accident Video: రిషబ్ పంత్ కారు ప్రమాదం ఎలా జరిగిందో తాజాగా వైరల్ అవుతున్న సీసీటీవీ ఫుటేజ్‌ను చూస్తే తెలుస్తుంది. టీమిండియా వికెట్ కీపర్ శుక్రవారం తెల్లవారుఝామున ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.
పంత్ కారు ప్రమాదం సీసీటీవీలో రికార్డ్ అయింది
Rishabh Pant Accident Video: ఇండియన్ క్రికెట్ టీమ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కారు ప్రమాదం ఎంత ఘోరంగా జరిగిందో సమీపంలోని సీసీటీవీలో రికార్డయిన వీడియో చూస్తే స్పష్టమవుతోంది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన పంత్.. డెహ్రాడూన్‌లో చికిత్స పొందుతున్నాడు. హైవేపై వేగంగా వెళ్తున్న పంత్ కారు ఒక్కసారిగా అదుపు తప్పి పక్కనే ఉన్న డివైడర్‌కు ఢీకొట్టింది.
ఆ వెంటనే కారులో మంటలు వ్యాపించాయి. అప్పటికే గాయపడినా పంత్ ఎలాగోలా విండ్ స్క్రీన్‌ను పగలగొట్టి బయటకు రాగలిగాడు. అయితే ఈ ప్రమాదంలో పంత్ తల, మోకాళ్లు, వెనుక భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగానే ఉన్నట్లు సీసీటీవీ వీడియో చూస్తే తెలుస్తోంది. పంత్ కారు అత్యంత వేగంగా డివైడర్ వైపు దూసుకెళ్లినట్లు అందులో కనిపిస్తోంది.
ఢిల్లీ-డెహ్రాడూర్ హైవేపై హరిద్వార్ జిల్లాలోని మంగ్లౌర్ దగ్గర ప్రమాదం జరిగింది. ఆ సమయంలో తాను నిద్ర మత్తులోకి జారుకున్నట్లు పంత్ తెలిపాడు. గాయాలు చాలానే అయినా.. పంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు బీసీసీఐ కూడా వెల్లడించింది. ఆర్థోపెడిక్స్, ప్లాస్టిక్ సర్జన్ల పర్యవేక్షణలో పంత్ ఉన్నాడు. పంత్‌కు ముఖ్యంగా నుదురు, మోకాళ్ల భాగంలో తీవ్ర గాయాలు అయినట్లు అతనికి ఎమర్జెన్సీలో ట్రీట్‌మెంట్ అందించిన డాక్టర్ సుశీల్ నగార్ చెప్పారు.
పంత్ ఒంటిపై కాలిన గాయాలు లేకపోయినా.. కారులో మంటల వేడికి అతని వెనుక భాగం మొత్తం కమిలిపోయినట్లు కనిపిస్తోంది. ఈ మధ్యే బంగ్లాదేశ్‌లో టెస్ట్ సిరీస్ గెలిచిన టీమ్‌లో సభ్యుడైన రిషబ్ పంత్‌కు.. శ్రీలంకతో జరిగే సిరీస్ కోసం టీమ్‌లో చోటు దక్కలేదు. అతడు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడెమీలో రిపోర్ట్ చేయాల్సి ఉంది.
రిషబ్ పంత్ గాయాల తీవ్రత చూస్తే ఏడాది పాటు క్రికెట్‌కు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆ లెక్కన వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు కూడా పంత్ దూరం కానున్నాడు.
టాపిక్