Ravindra Jadeja Fined Match Fee: జడేజాకు షాక్ ఇచ్చిన ఐసీసీ - మ్యాచ్ ఫీజులో కోత
11 February 2023, 16:20 IST
Ravindra Jadeja Fined Match Fee: బోర్డర్ గవాస్కర్ సిరీస్ తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై ఇన్నింగ్స్ తేడాతో టీమ్ ఇండియా ఘన విజయాన్ని సాధించింది. టీమ్ ఇండియా గెలుపులో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. అయితే అతడికి మ్యాచ్ ఫీజులో కోత విధిస్తూ ఐసీసీ షాక్ ఇచ్చింది.
రవీంద్ర జడేజా
Ravindra Jadeja Fined Match Fee: నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్ ద్వారా దాదాపు ఐదు నెలల విరామం తర్వాత టీమ్ ఇండియా లోకి రీఎంట్రీ ఇచ్చిన రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో 70 పరుగులతో రాణించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు.
టీమ్ ఇండియా విజయంలో కీలక భూమిక పోషించిన జడేజాకు ఐసీసీ షాక్ ఇచ్చింది. జడేజా మ్యాచ్‌ఫీజులో ఇరవై ఐదు శాతం కోత విధించింది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో తొలిరోజు మ్యాచ్ జరుగుతోన్న సమయంలో సిరాజ్ ఇచ్చిన క్రీమును జడేజా ఎడమచేతి చూపుడు వేలుకు రాసుకుంటూ కనిపించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. జడేజా బాల్ టాంపరింగ్‌కు పాల్పడ్డడంటూ కథనాలు వెలువడ్డాయి.
ఈ బాల్ టాంపరింగ్ పుకార్లపై స్పందించిన టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్ అది పెయిన్ కిల్లర్ క్రీమ్ అంటూ వివరణ ఇచ్చింది. తాజాగా జడేజాపై ఐసీసీ ఫైన్ విధించింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవల్ 1 తప్పిదం క్రింద అంపైర్ అనుమతి లేకుండా పెయిన్ కిల్లర్ క్రీమును ఉపయోగించిన జడేజాకు వార్నింగ్ ఇవ్వడమే కాకుండా అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం కట్ చేసింది.
ఒక డీ మెరిట్ పాయింట్‌ను విధించింది. మెడికల్ పర్పస్ కోసమే జడేజా ఈ క్రీమును ఉపయోగించినట్లు ఇండియా టీమ్ మేనేజ్‌మెంట్ ఇచ్చిన వివరణతో ఐసీసీ కన్వీన్స్ అయ్యింది. జడేజా బాల్ టాంపరింగ్‌కు పాల్పడలేదని అంగీకరించి సింపుల్ పనిష్‌మెంట్ విధించింది.