Ravi Shastri on Virat Kohli: విరాట్ అందరి నోళ్లూ మూయించాడు: రవిశాస్త్రి
25 October 2022, 16:22 IST
- Ravi Shastri on Virat Kohli: విరాట్ అందరి నోళ్లూ మూయించాడని అన్నాడు టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి. కోహ్లి ఆడిన ఇన్నింగ్స్ చూసి తాను భావోద్వేగానికి గురయ్యానని అన్నాడు.
విరాట్ కోహ్లి
Ravi Shastri on Virat Kohli: టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌పై ఆడిన ఇన్నింగ్స్‌తో విరాట్ కోహ్లి అందరి నోళ్లూ మూయించాడని అన్నాడు మాజీ కోచ్ రవిశాస్త్రి. గత రెండేళ్లుగా అతడు ఎలాంటి దశను ఎదుర్కొన్నాడో తనకు తెలుసని, అందుకే ఆ ఇన్నింగ్స్‌ను చూస్తున్న సమయంలో తాను భావోద్వేగానికి గురైనట్లు అతడు చెప్పాడు.
పాకిస్థాన్‌తో మ్యాచ్ ముగిసిన మరుసటి రోజు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడిన రవిశాస్త్రి.. విరాట్ గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. "మన దేశంలో జ్ఞాపకశక్తి తక్కువ. ప్రపంచ టోపీ మాస్టర్లు. రెండు నిమిషాల్లో అటు నుంచి ఇటు మారిపోతారు. నేనేం అనుకుంటున్నానో కోహ్లికి తెలుసు. అతడు ఏమనుకుంటున్నాడో నాకు తెలుసు. ఇంకా చెప్పేదేముంది" అని రవిశాస్త్రి అన్నాడు.
ఈ సందర్భంగా 1985లో వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ క్రికెట్ టోర్నీని శాస్త్రి గుర్తు చేసుకున్నాడు. అప్పుడు కూడా తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై గెలిచిన తర్వాత ఫైనల్లోనూ ఆ టీమ్‌నే ఓడించామని, ఈసారి కూడా అదే జరిగితే ఎలా ఉంటుందని అన్నాడు. ఇక హరీస్ రవూఫ్ వేసి 19వ ఓవర్లో కోహ్లి కొట్టిన ఆ రెండు సిక్స్‌లు ఓ ఇండియన్ బ్యాటర్ కొట్టిన బెస్ట్ సిక్స్‌లని రవిశాస్త్రి అనడం విశేషం.
ఆ సిక్స్‌లను అప్పట్లో షోయబ్ అక్తర్ బౌలింగ్‌లో సచిన్ కొట్టిన సిక్స్‌తో మాత్రమే పోల్చవచ్చని చెప్పాడు. కొన్నాళ్లుగా కోహ్లి ఆటతీరు చూసి తానేమీ ఆందోళన చెందలేదని, అతడు కచ్చితంగా తిరిగి ఫామ్‌లోకి వస్తాడని, ఆస్ట్రేలియాలోనే అది జరుగుతుందని తాను ముందే ఊహించినట్లు రవిశాస్త్రి తెలిపాడు. ఆస్ట్రేలియా కండిషన్స్, అక్కడి పిచ్‌లు విరాట్‌కు బాగా కలిసొచ్చినట్లు శాస్త్రి చెప్పాడు.
కోహ్లి అప్పట్లో తీసుకున్న బ్రేక్ ఇప్పుడు బాగా కలిసొచ్చిందని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌లో విరాట్ ఇబ్బంది పడిన సమయంలో అతనికి బ్రేక్ అవసరమని చెప్పానని, నెల రోజుల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న సమయంలో ఆత్మసమీక్ష చేసుకునే వీలు కలిగిందని అన్నాడు. ఆసియా కప్‌లో అందుకే తాను కోహ్లి బాడీ లాంగ్వేజ్‌నే పరిశీలించానని, చాలా సహనం, ప్రశాంతంగా కనిపించాడని రవిశాస్త్రి చెప్పాడు.
తాను 2014లో టీమ్ డైరెక్టర్‌గా ఉన్న సమయం నుంచీ కోహ్లితో అనుబంధం ఏర్పడిందని, ఆ తర్వాత తాను కోచ్, అతడు కెప్టెన్‌గా ఉండటంతో తమ బంధం మరింత బలపడిందని రవిశాస్త్రి తెలిపాడు. "కోహ్లి ఓ డైమండ్. అతడు గత ఏడాది కాలంగా ఎదుర్కొన్న దశను చూసి నేనేమీ ఆందోళన చెందలేదు. అతని వ్యక్తిత్వం నాకు తెలుసు. పడిలేచిన కెరటంలా మళ్లీ గాడిలో పడతాడని అనుకున్నాను. ఆ బ్రేక్ అతనికి సాయం చేసింది. ఇప్పుడతడు మరింత తెలివైన వ్యక్తిగా మారాడు" అని రవి చెప్పాడు.