Ravi Shastri on Team India: రాహుల్ వైస్ కెప్టెన్ అయితే ఏంటి.. శుభ్‌మన్ గిల్ ఉండాల్సిందే: రవిశాస్త్రి
08 February 2023, 17:59 IST
- Ravi Shastri on Team India: రాహుల్ వైస్ కెప్టెన్ అయితే ఏంటి.. శుభ్‌మన్ గిల్ అయితే ఉండాల్సిందే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. అంతేకాదు ఆస్ట్రేలియాను ఇండియా 4-0తో ఓడించాలని అనడం గమనార్హం.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీపై గవాస్కర్ కీలక వ్యాఖ్యలు
Ravi Shastri on Team India: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరగబోయే బోర్డర్, గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో కేఎల్ రాహుల్ కంటే ముందు శుభ్‌మన్ గిల్ ఉండాల్సిందే అని అన్నాడు మాజీ కోచ్ రవిశాస్త్రి. వైస్ కెప్టెన్ అయినంత మాత్రాన టీమ్ లో ప్లేస్ గ్యారెంటీ అన్న రూలేమీ లేదని శాస్త్రి అనడం విశేషం. టాప్ ఫామ్ లో ఉన్న గిల్ కచ్చితంగా తుది జట్టులో ఉండాలని స్పష్టం చేశాడు.
ఇక ఐదో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ కూడా ఉండాలని రవి అన్నాడు. ఆ లెక్కన అతని తుది జట్టులో రాహుల్ కు చోటు లేనట్లే. "శుభ్‌మన్ లేదా రాహుల్.. ఎవరిని తీసుకోవాలో టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయిస్తుంది. గతంలో ఎవరిని తీసుకున్నారో వాళ్లనే తీసుకోవాలని అనుకుంటారు కానీ ఇక్కడ ఫామ్ ముఖ్యం. ఓ బ్యాటర్ బంతిని ఎంతో బాగా బాదుతున్నాడు. అతని బ్యాట్ మధ్యలో నుంచి ఈ షాట్స్ వస్తున్నాయి" అని గిల్ గురించి ఐసీసీ రివ్యూలో మాట్లాడుతూ రవిశాస్త్రి అన్నాడు.
"నెట్స్ లో గిల్, రాహుల్ ను చాలా దగ్గరగా చూస్తున్నా. ఎవరి ఫుట్ వర్క్ బాగుంది.. ఎవరి టైమింగ్ బాగుందో చూస్తున్నాను. రాహుల్ కంటే శుభ్‌మన్ గిల్ కే అవకాశం ఇస్తే మంచిదే. రాహుల్ వైస్ కెప్టెన్ కాబట్టి ఆటోమేటిగ్గా టీమ్ లో ఉంటాడని నేను చెప్పను" అని రవిశాస్త్రి అన్నాడు. ఇక పిచ్ లపై ఆస్ట్రేలియా మీడియాలో వస్తున్న వార్తలపై కూడా శాస్త్రి స్పందించాడు.
"ఎలాంటి పిచ్ అని నన్ను ఎవరైనా అడిగితే.. స్పిన్ పిచ్ అంటాను. టాస్ ఓడిపోతే తొలి సెషన్ నుంచే బంతి టర్న్ అవ్వాలి. నేను కోరుకునేది అదే. ఒకవేళ నేను కోచ్ నే అయితే ఆస్ట్రేలియాను 4-0తో ఎలా ఓడించాలన్న మైండ్ సెట్ తోనే ఉంటాను. అంటే తొలి రోజు నుంచే లెగ్ స్టంప్ పై పడిన బాల్ ఆఫ్ స్టంప్ ను గిరాటేయాలి" అని రవిశాస్త్రి స్పష్టం చేశాడు.
"నేను మ్యాజిక్ చూడాలని అనుకుంటున్నాను. కుల్దీప్ యాదవ్ అది చేయాలి. టాస్ ఓడిపోయి పిచ్ బాగుండి స్పిన్ కు అనుకూలించక ఫింగర్ స్పిన్నర్ ఏమీ చేయలేకపోతే లెగ్ స్పిన్నర్ ఆ పని చేయాలి. ఇతర స్పిన్నర్ కంటే ముందే స్పిన్ చేయాలి" అని రవిశాస్త్రి అన్నాడు. "ఇండియా 4-0తో గెలవడానికే ఆడాలి. మనం స్వదేశంలో ఆడుతున్నాం. నేను రెండుసార్లు ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లాను. ఏం జరిగిందో నాకు తెలుసు" అని కూడా శాస్త్రి చెప్పాడు.