Ravi Shastri on India vs Australia: ఆస్ట్రేలియాపై ఇండియా 2-0తో సిరీస్ గెలుస్తుంది: రవిశాస్త్రి
06 February 2023, 19:20 IST
- Ravi Shastri on India vs Australia: ఆస్ట్రేలియాపై ఇండియా 2-0తో సిరీస్ గెలుస్తుందని అన్నాడు టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి. గురువారం (ఫిబ్రవరి 9) నుంచి ప్రారంభం కాబోతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీపై అతడు స్పందించాడు.
మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లితో రవిశాస్త్రి
Ravi Shastri on India vs Australia: ఇప్పుడు క్రికెట్ ప్రపంచం కళ్లన్నీ ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరగబోయే నాలుగు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీపైనే ఉన్నాయి. ఈసారైనా ఇండియా గడ్డపై ఆస్ట్రేలియా గెలుస్తుందా? ప్రస్తుతం ఇండియా దగ్గర ఉన్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని మళ్లీ సొంతం చేసుకుంటుందా? అన్న చర్చలు జోరుగా నడుస్తున్నాయి.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఈ సిరీస్ పై స్పందించాడు. స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడిన అతడు.. సిరీస్ ఫలితాన్ని అంచనా వేశాడు. ఈ సిరీస్ ను ఇండియా 2-0తో గెలుస్తుందని రవి చెప్పాడు. తొలి టెస్ట్ నుంచే ఆస్ట్రేలియాపై ఒత్తిడి పెంచాలని సూచించాడు.
"సిరీస్ ఫలితం గురించి చెప్పాలంటే.. ఇండియా కనీసం 2-0తో అయినా గెలవాలి. స్వదేశంలో ఆడుతున్నారు. ఆ పని చేయడానికి తగిన బౌలర్లు ఉన్నారు. బ్యాటింగ్ లైనప్ కూడా ఉంది. తొలి టెస్ట్ మ్యాచ్ నుంచే ఒత్తిడి పెంచాలి" అని రవిశాస్త్రి అన్నాడు. నిజానికి గతంలో అతడు కోచ్ గా ఉన్న సమయంలోనే ఆస్ట్రేలియాలో ఇండియా రెండు చారిత్రక సిరీస్ విజయాలు సాధించింది.
2018-19, 2020-21లలో వరుసగా రెండుసార్లు ఆసీస్ గడ్డపై సిరీస్ లు గెలవడం విశేషం. ఇప్పుడు రాహుల్ ద్రవిడ్ కోచింగ్ లో స్వదేశంలో బరిలోకి దిగుతోంది. ఇక పిచ్ ల గురించి రవిశాస్త్రి స్పందిస్తూ.. తొలి రోజు నుంచే స్పిన్ అయ్యే పిచ్ లను తయారు చేయాలని సూచించాడు.
"తొలి రోజు నుంచే బాల్ స్పిన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. టాస్ ఓడిపోయినా ఫర్వాలేదు. కాస్తయినా బాల్ స్పిన్ అవడం చూడాలి. లేదంటే తొలి రోజు నుంచే బౌలర్లకు ఎంతో కొంత అనుకూలించాలి. అదే మీ బలం. స్వదేశంలో ఆడుతున్నారు. దానిని సద్వినియోగం చేసుకోవాలి" అని రవిశాస్త్రి స్పష్టం చేశాడు.