India vs Australia: 36 ఆలౌట్ గుర్తుందా అన్న ఆస్ట్రేలియా.. దిమ్మదిరిగే రిప్లై ఇచ్చిన ఆకాశ్ చోప్రా
India vs Australia: 36 ఆలౌట్ గుర్తుందా అంటూ ఆస్ట్రేలియా కీలకమైన బోర్డర్ గవాస్క్ ట్రోఫీకి ముందు మాటల యుద్ధానికి దిగింది. అయితే దీనికి మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా దిమ్మదిరిగే రిప్లై ఇచ్చాడు.
India vs Australia: ఆస్ట్రేలియా ఎవరితో సిరీస్ ఆడినా కూడా ముందు ప్రత్యర్థిపై మాటలతో దాడి చేయడం అలవాటు. అసలు మ్యాచ్ కు ముందే ప్రత్యర్థులను తమ మాటల ద్వారా కుంగదీస్తారు. ఇక ఫీల్డ్ లో దిగిన తర్వాత స్లెడ్జింగ్ తో నోటికి పని చెప్పి మిగతా పని పూర్తి చేస్తారు. కొన్ని దశాబ్దాలుగా కంగారూలు చేస్తున్నది ఇదే. ఇప్పుడు ఇండియాతో కీలకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభానికి ముందు కూడా మాటల యుద్ధం ప్రారంభించింది.
2020-21 టూర్ సందర్భంగా అడిలైడ్ లో జరిగిన తొలి టెస్టులో ఇండియా కేవలం 36 పరుగులకే ఆలౌటైన విషయం తెలుసు కదా. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ క్రికెట్ ఆస్ట్రేలియాకు చెందిన అధికార మీడియా సోమవారం (ఫిబ్రవరి 6) ఓ ట్వీట్ చేసింది. "36 పరుగులకే ఆలౌట్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గురువారం ప్రారంభం కాబోతోంది" అని క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్ సైట్ ట్వీట్ చేయడం గమనార్హం. దీంతోపాటు ఆ ఇన్నింగ్స్ వీడియో కూడా పోస్ట్ చేసింది.
అయితే దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. "మరి సిరీస్ స్కోర్ లైన్ సంగతేంటి" అని అతడు ప్రశ్నించాడు. నిజానికి తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లోనే టీమ్ అంత దారుణమైన ప్రదర్శన చేసినా.. ఆ తర్వాత అద్భుతంగా పుంజుకొని సిరీస్ ను 2-1తో గెలిచింది. ఇదే విషయాన్ని ఆకాశ్ చోప్రా గుర్తు చేస్తూ క్రికెట్ ఆస్ట్రేలియాకు దిమ్మదిరిగే రిప్లై ఇచ్చాడు.
అడిలైడ్ లో జరిగిన తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఇండియన్ టీమ్ 244 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాను 191 పరుగులకే ఆలౌట్ చేసి 53 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అయితే రెండో ఇన్నింగ్స్ లో కేవలం 36 రన్స్ కే ఆటౌల్ కావడంతో ఆస్ట్రేలియా 90 పరుగుల లక్ష్యాన్ని సులువుగా ఛేదించి సిరీస్ లో ఆధిక్యం సంపాదించింది.
ఈ మ్యాచ్ తర్వాత ఆస్ట్రేలియా 4-0తో సిరీస్ గెలుస్తుందని ఆ దేశానికి చెందిన పలువురు మాజీ క్రికెటర్లు అంచనా వేశారు. అప్పుడు కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లి కూడా తొలి టెస్ట్ తర్వాత స్వదేశానికి తిరిగి రావడంతో భారత అభిమానులూ నిరాశ చెందారు. అయితే తర్వాత అజింక్య రహానే కెప్టెన్సీలోని యంగిండియా అద్భుతమే చేసింది.
రెండో టెస్ట్ లో రహానే సెంచరీతో ముందుండి నడిపించడంతో ఇండియా 8 వికెట్లతో గెలిచి సిరీస్ సమం చేసింది. మూడో టెస్టులో ఓటమి నుంచి గట్టెక్కి వీరోచిత పోరాటంతో డ్రా చేసుకుంది. నాలుగో టెస్టులో ఏకంగా ఆస్ట్రేలియా పెట్టని కోటలాంటి బ్రిస్బేన్ లోనూ చారిత్రక విజయంతో సిరీస్ ను 2-1తో ఎగరేసుకుపోయింది. 32 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాను బ్రిస్బేన్ లో ఓడించిన ఘనతను కూడా సొంతం చేసుకుంది.
సంబంధిత కథనం