Who is Mahesh Pithiya: ఆస్ట్రేలియా కొత్త ఎత్తుగడ.. అచ్చూ అశ్విన్‌లాగే వేసే మహేష్ బౌలింగ్‌లో ప్రాక్టీస్.. ఎవరితను?-who is mahesh pithiya who is helping australia team in nets ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Who Is Mahesh Pithiya Who Is Helping Australia Team In Nets

Who is Mahesh Pithiya: ఆస్ట్రేలియా కొత్త ఎత్తుగడ.. అచ్చూ అశ్విన్‌లాగే వేసే మహేష్ బౌలింగ్‌లో ప్రాక్టీస్.. ఎవరితను?

Hari Prasad S HT Telugu
Feb 03, 2023 03:05 PM IST

Who is Mahesh Pithiya: ఆస్ట్రేలియా కొత్త ఎత్తుగడ వేస్తోంది. అచ్చూ అశ్విన్‌లాగే వేసే మహేష్ పితియా అనే బౌలర్ తో నెట్ ప్రాక్టీస్ చేస్తోంది. ముఖ్యంగా స్మిత్ అతని బౌలింగ్ లో ఆడుతున్న వీడియో వైరల్ అవుతోంది. ఇంతకీ ఎవరీ మహేష్ పితియా?

ఆస్ట్రేలియాకు నెట్స్ లో సాయం చేస్తున్న స్పిన్ బౌలర్ మహేష్ పితియా ఇతడే
ఆస్ట్రేలియాకు నెట్స్ లో సాయం చేస్తున్న స్పిన్ బౌలర్ మహేష్ పితియా ఇతడే

Who is Mahesh Pithiya: ఈసారి ఇండియాలో ఎలాగైనా సిరీస్ గెలవాలని గట్టిగానే ఫిక్సయినట్లుంది ఆస్ట్రేలియా టీమ్. సరిగ్గా ఇండియన్ టీమ్ తో టెస్ట్ మ్యాచ్ ఎలా ఉంటుందో అలాంటి కండిషన్స్ లోనే ప్రాక్టీస్ చేస్తోంది. వామప్ మ్యాచ్ వద్దనుకొని, తామే ఆర్సీబీ టీమ్ సాయంతో బెంగళూరు దగ్గరలోని ఆలూర్ లో స్పిన్ వికెట్లు తయారు చేయించుకొని ప్రాక్టీస్ చేస్తుండటం విశేషం.

ట్రెండింగ్ వార్తలు

ఇక ఇప్పుడు మరో అడుగు ముందుకేసి టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ లాగే బౌలింగ్ చేస్తున్న మహేష్ పితియా అనే ఓ యువ బౌలర్ తో నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు ఆస్ట్రేలియా బ్యాటర్లు. రానున్న సిరీస్ లో అశ్విన్ తో ముప్పు తప్పదని ఆ టీమ్ ముందుగానే అంచనా వేస్తోంది. దీంతో అతనిలా బౌలింగ్ చేసే మహేష్ ను ప్రత్యేకంగా రప్పించుకుంది.

ఎవరీ మహేష్ పితియా?

మహేష్ పితియా ఓ స్పిన్ బౌలర్. అతనిది గుజరాత్ లోని జునాగఢ్. అశ్విన్ స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో ఆస్ట్రేలియా బ్యాటర్లకు సాయం చేయడానికి అతడు బెంగళూరుకు వచ్చాడు. అశ్విన బౌలింగ్ యాక్షన్ ఎలా ఉంటుందో మహేష్ ది కూడా అచ్చూ అలాగే ఉంది. నిజానికి తనకు 11 ఏళ్ల వయసు వచ్చే వరకూ కూడా అశ్విన్ బౌలింగ్ ను మహేష్ చూడలేదు.

ఎందుకంటే వాళ్ల ఇంట్లో కనీసం టీవీ కూడా లేదు. అయితే 2013లో తొలిసారి వెస్టిండీస్ పై అశ్విన్ ఆడుతున్నప్పుడు అతన్ని చూసిన మహేష్.. అశ్విన్ ను ఆదర్శంగా తీసుకొని స్పిన్ బౌలర్ గా మారాడు. గతేడాది డిసెంబర్ లో తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేశాడు. అతని బౌలింగ్ చూసి అప్పుడే చాలా మంది అశ్విన్ తో పోల్చడం ప్రారంభించారు.

ఈ విషయం తెలుసుకున్న ఆస్ట్రేలియా టీమ్.. అతన్ని ఆలూర్ కు రప్పించింది. ఇక్కడ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేకంగా మూడు స్పిన్ పిచ్ లను ఏర్పాటు చేయించింది. వీటిలో ప్రతి పిచ్ రోజు గడిచే కొద్దీ ఎక్కువగా టర్న్ అవుతూ కనిపించింది. తమకు ప్రాక్టీస్ మ్యాచ్ లో ఎలాగూ ఇలాంటి పిచ్ లు ఇవ్వరని, అందుకే తాము వద్దనుకున్నట్లు ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఈ మధ్య చెప్పిన విషయం తెలిసిందే.

కానీ ఆస్ట్రేలియా ఈ సిరీస్ కోసం సిద్ధమవుతున్న తీరు చూస్తుంటే మాత్రం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. 2012 నుంచి సొంతగడ్డపై సిరీస్ ఓడని టీమిండియా.. అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. ఇప్పటికే టీమిండియా తొలి టెస్ట్ జరిగే నాగ్‌పూర్ చేరుకుంది.

WhatsApp channel

సంబంధిత కథనం