Australia Practice: ఆస్ట్రేలియా మాస్టర్ ప్లాన్.. ఇండియాను బోల్తా కొట్టించడానికి ఆర్సీబీ సాయంతో ప్రాక్టీస్-australia practicing on rank turners with help of ipl team rcb at alur ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Australia Practicing On Rank Turners With Help Of Ipl Team Rcb At Alur

Australia Practice: ఆస్ట్రేలియా మాస్టర్ ప్లాన్.. ఇండియాను బోల్తా కొట్టించడానికి ఆర్సీబీ సాయంతో ప్రాక్టీస్

Hari Prasad S HT Telugu
Feb 02, 2023 11:03 AM IST

Australia Practice: ఆస్ట్రేలియా మాస్టర్ ప్లాన్ వేసింది. ఈసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఎలాగైనా ఇండియాను బోల్తా కొట్టించడానికి ఆర్సీబీ సాయంతో ప్రాక్టీస్ చేస్తోంది. టూర్ మ్యాచ్ ఆడకుండా ఆ టీమ్ ఈ కొత్త ప్లాన్ తో బరిలోకి దిగబోతోంది.

ఆస్ట్రేలియా టీమ్
ఆస్ట్రేలియా టీమ్ (REUTERS)

Australia Practice: ఇండియాను ఇండియాలో ఓడించడం ఎంతటి ఛాంపియన్ కు అయినా దాదాపు అసాధ్యం. పదేళ్లుగా స్వదేశంలో ఓటమెరగని రికార్డు టీమిండియా సొంతం. అలాంటి ఇండియన్ టీమ్ ను 19 ఏళ్ల తర్వాత వాళ్ల సొంతగడ్డపైనే ఓడించాలన్న పట్టుదలతో వచ్చింది ఆస్ట్రేలియా టీమ్. అయితే ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్ కోసం ఆ టీమ్ ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడకపోవడం ఆశ్చర్యం కలిగించింది.

కానీ ఈ టూర్ మ్యాచ్ వల్ల లాభం లేదని, కావాలని తమకు పేస్ పిచ్ లు తయారు చేయించి ప్రాక్టీస్ గేమ్స్ ఆడిస్తున్నారని ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ చెప్పాడు. అందుకే తమ సొంతంగా ప్రాక్టీస్ చేసుకుంటామనీ అన్నాడు. అయితే దీని వెనుక ఆస్ట్రేలియా ఓ పెద్ద మాస్టర్ ప్లానే వేసినట్లు తాజాగా తేలింది. ఆ ప్లాన్ కు ఐపీఎల్ టీమ్ ఆర్సీబీ టీమ్ సాయం చేస్తోంది.

ఆస్ట్రేలియా మాస్టర్ ప్లాన్ ఇదీ

ఫిబ్రవరి 9న తొలి టెస్ట్ నాగ్‌పూర్‌లో జరగనుండగా ఆస్ట్రేలియా మాత్రం నాలుగు రోజుల సంసిద్ధత క్యాంప్ ను బెంగళూరులో ఏర్పాటు చేసుకుంది. దీనికి కారణం ఆ టీమ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్, స్పిన్ కన్సల్టెంట్ డానియల్ వెటోరీ. ఈ ఇద్దరికీ ఐపీఎల్ టీమ్ ఆర్సీబీతో మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో బెంగళూరు దగ్గరలోని ఆలూర్ లో ఆస్ట్రేలియా ప్రత్యేకంగా తమకు కావాల్సినట్లుగా స్పిన్ పిచ్ లను ఏర్పాటు చేయించుకొని మరీ ప్రాక్టీస్ చేస్తోంది.

ఇండియన్ టీమ్ లోని అశ్విన్, జడేజా, కుల్దీప్, అక్షర్ లాంటి స్పిన్నర్లు.. షమి, సిరాజ్ లాంటి పేసర్లను ఎదుర్కోవడానికి తగిన పిచ్ లపై ఆస్ట్రేలియా ప్రాక్టీస్ చేయాలని నిర్ణయించింది. వీటిలో కాస్త తక్కువ స్పిన్ అయ్యే పిచ్ లు, బాగా టర్న్ అయ్యే పిచ్ లు, వేరియబుల్ బౌన్స్ ఉండే పిచ్ లు ఉన్నాయి. నాగ్‌పూర్, ఢిల్లీ, అహ్మదాబాద్ లలో స్పిన్ పిచ్ లే ఎదురవుతాయని ఆస్ట్రేలియా ఇలాంటి పిచ్ లపై ప్రాక్టీస్ చేస్తోంది.

ఇక ధర్మశాల పిచ్ పేస్ బౌలింగ్ కు అనుకూలం. అందుకు తగినట్లు ప్రత్యేకంగా మరో పచ్చిక ఉన్న పిచ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. నాలుగు రోజుల పాటు తమ బ్యాటర్లు ఈ వేర్వేరు పిచ్ లపై పూర్తిస్థాయిలో సిరీస్ కోసం సిద్ధమయ్యేలా చేయాలన్నది ఆస్ట్రేలియా ప్లాన్. ఇక మీడియా, అభిమానుల కంటపడకుండా దూరంగా ఆలూర్ లో ఈ క్యాంప్ ఏర్పాటు చేసుకోవడం విశేషం.

గతంలో 2013, 2017లలో ప్రాక్టీస్ గేమ్స్ ఆడిన ఆస్ట్రేలియా.. సిరీస్ లో ఎదురయ్యే పిచ్ లకు, ఈ ప్రాక్టీస్ మ్యాచ్ పిచ్ లకు అసలు సంబంధం లేని విషయాన్ని గమనించింది. దీంతో ఈసారి కావాలనే వాటికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఇండియా అంటేనే స్పిన్ కు స్వర్గధామం. ఎలాగూ అలాంటి పిచ్ లపైనే ఆడాల్సి వస్తుందని ఊహించిన ఆసీస్.. ఈ కొత్త ఎత్తుగడ వేసింది. గురువారం (ఫిబ్రవరి 2) నుంచే ఆ టీమ్ నాలుగు రోజుల ప్రాక్టీస్ ప్రారంభిస్తోంది.

WhatsApp channel

సంబంధిత కథనం