Jadeja in Ranji Trophy: బౌలింగ్‌లో రెచ్చిపోయిన రవీంద్ర జడేజా.. ఒకే ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లు-jadeja in ranji trophy takes 7 wickets in second innings against tamilnadu ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Jadeja In Ranji Trophy: బౌలింగ్‌లో రెచ్చిపోయిన రవీంద్ర జడేజా.. ఒకే ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లు

Jadeja in Ranji Trophy: బౌలింగ్‌లో రెచ్చిపోయిన రవీంద్ర జడేజా.. ఒకే ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లు

Hari Prasad S HT Telugu
Jan 26, 2023 05:46 PM IST

Jadeja in Ranji Trophy: బౌలింగ్‌లో రెచ్చిపోయాడు రవీంద్ర జడేజా. తన కమ్‌బ్యాక్ మ్యాచ్ లో ఒకే ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లు తీయడం విశేషం. రంజీ ట్రోఫీలో తమిళనాడు, సౌరాష్ట్ర మ్యాచ్ లో జడేజా బంతితో రాణించాడు.

రవీంద్ర జడేజా
రవీంద్ర జడేజా (PTI)

Jadeja in Ranji Trophy: టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా నేషనల్ టీమ్ లోకి తిరిగి వచ్చే ముందు బౌలింగ్ లో కళ్లు చెదిరే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తమిళనాడుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్ లో జడేజా సౌరాష్ట్ర కెప్టెన్ గా బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో తమిళనాడు తమ రెండో ఇన్నింగ్స్ లో కేవలం 133 పరుగులకే కుప్పకూలింది.

తన లెఫ్టామ్ స్పిన్ తో ఆ టీమ్ బ్యాటర్లను తిప్పేశాడు జడేజా. ఏకంగా ఏడు వికెట్లతో చెలరేగాడు. రెండో ఇన్నింగ్స్ లో 17.1 ఓవర్లు వేసిన జడ్డూ.. 53 పరుగులు ఇచ్చి 7 వికెట్లు తీసుకున్నాడు. తమిళనాడు బ్యాటర్లు షారుక్ ఖాన్ తో పాటు బాబా ఇంద్రజిత్, ప్రదోష్ రంజన్ పాల్, విజయ్ శంకర్, మణిమారన్ సిద్ధార్థ్, సందీప్ వారియర్ ల వికెట్లు తీశాడు.

మిగతా మూడు వికెట్లు కూడా మరో జడేజా ఖాతాలోకి వెళ్లాయి. అతని పేరు ధర్మేంద్రసిన్హ్ జడేజా. ఈ ఇద్దరు జడేజాల ధాటికి తమిళనాడు రెండో ఇన్నింగ్స్ లో కేవలం 133 పరుగులు మాత్రమే చేయగలిగింది. అంతకుముందు తమిళనాడు తొలి ఇన్నింగ్స్ లో 324 రన్స్ చేయగా.. సౌరాష్ట్ర కేవలం 192 రన్స్ మాత్రమే చేయగలిగింది. జడేజా బ్యాట్ తో విఫలమయ్యాడు. కేవలం 15 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని సౌరాష్ట్ర ముందు 266 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది తమిళనాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర వికెట్ నష్టానికి 4 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్ లో జడేజా బంతితో రాణించడం టీమిండియాకు శుభసూచకమే అని చెప్పాలి. మోకాలి గాయం కారణంగా చాలా నెలులుగా నేషనల్ టీమ్ కు దూరంగా ఉన్న జడేజా.. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరగబోయే నాలుగు టెస్టుల సిరీస్ కు ఎంపికయ్యాడు.

అతని ఫిట్‌నెస్ పై ఫిబ్రవరి 1న బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే జడేజా పూర్తి ఫిట్ నెస్ తో మళ్లీ టీమ్ లోకి వస్తే మాత్రం ఆస్ట్రేలియాకు కష్టాలు తప్పవు. అశ్విన్ తో కలిసి జడేజా స్పిన్ కంగారూలను ఉక్కిరిబిక్కిరి చేస్తుందనడంలో సందేహం లేదు.

Whats_app_banner

సంబంధిత కథనం