BCCI Central Contracts: ఏ నుంచి బీ గ్రేడ్‌కు పడిపోయిన పుజారా, రహానే
02 March 2022, 22:53 IST
- బీసీసీఐ ఇచ్చే వార్షిక వేతన కాంట్రాక్ట్ గ్రేడ్స్‌లో చతేశ్వర్ పుజారా, రహానేను తగ్గించింది. గ్రేడ్ ఏ నుంచి వారిని గ్రేడ్ బీకి తగ్గించింది. గతేడాది వారు చేసిన ప్రదర్శన ఆధారంగా కాంట్రాక్ట్ లిస్టులో వారి గ్రేడ్‌ను తగ్గించింది.
పుజారా, రహానే
గత కొన్నిరోజులుగా టీమిండియా టెస్టు ఆటగాడు చతేశ్వర్ పుజారా, మాజీ వైస్ కెప్టెన్ అజింక్యా రహానే ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గతేడాది కొన్ని కీలక మ్యాచుల్లో వీరు పెద్దగా ప్రదర్శన చేయలేకపోయారు. ఈ కారణంగా బీసీసీఐ తన సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్‌లో వీరి గ్రేడ్‌ను తగ్గించింది. ఇంతకు ముందు ఏ-గ్రేడ్ లిస్టులో ఉండే వీరిద్దరిని బీ-గ్రేడ్‌కు తగ్గించింది. గ్రేడ్ ఆధారంగా క్రికెటర్ల వార్షిక వేతనాన్ని నిర్ణయిస్తారు. బుధవారం నాడు బీసీసీఐ ఆటగాళ్లకు లేటెస్ట్ గ్రేడింగ్ కాంట్రాక్టు లిస్టులను ప్రకటించింది.
బీసీసీఐ కాంట్రాక్టులో మొత్తం నాలుగు విభాగాలు ఉంటాయి. ఏ-గ్రేడ్ కాంట్రాక్టుకు చెందిన ఆటగాళ్లకు రూ.7 కోట్ల వార్షిక వేతనం, బీ-గ్రేడ్ వారికి రూ.5 కోట్లు, సీ- గ్రేడ్ వారికి రూ.3 కోట్లు. డీ -గ్రేడ్ ఆటగాళ్లకు కోటి రూపాయల ఆదాయాన్ని అందజేస్తుంది. గతేడాది మొత్తం 28 క్రికెటర్లకు ఈ గ్రేడింగ్ కాంట్రాక్టులివ్వగా.. ఈ ఏడాది 27 మంది మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా స్థిరంగా ఏ -గ్రేడ్ లిస్టులో ఉండగా.. రహానే, పుజారాను మాత్రం ఏ నుంచి బీ గ్రేడ్‌కు తగ్గించింది.
గ్రేడ్-ఏలో ఇంతకుముందు 10 మంది ఉండేవారు. కానీ ప్రస్తుతం ఆ సంఖ్య ఐదుకు చేరింది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ తన స్థానాలను ఆక్రమించుకోగా.. గాయం కారణంగా జట్టుకు దూరమైన హార్దిక్ పాండ్య ఏ నుంచి సీ గ్రేడ్‌కు పడిపోయాడు. వన్డేలో మాత్రమే ఆడుతున్న సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా ఏ నుంచి సీకి చేరాడు. ఇటీవల వివాదంలో చిక్కుకున్న వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కూడా బీ గ్రేడ్ నుంచి సీ గ్రేడ్ కూడా చేరాడు. మయాంక్ అగర్వాల్ కూడా గ్రూప్ బీ నుంచి సీకి చేరాడు. మహ్మద్ సిరాజ్ గ్రూప్-బీ లో ఉండగా.. సూర్యకుమార్ యాదవ్ గ్రేడ్ సీలో తన స్థానాన్ని సుస్థిరపరచుకున్నాడు.
టాపిక్