తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Pbks Vs Kkr: కోల్‌కతాకు వరణుడి దెబ్బ.. డీఎల్‌ఎస్ విధానంలో పంజాబ్ విజయం

PBKS vs KKR: కోల్‌కతాకు వరణుడి దెబ్బ.. డీఎల్‌ఎస్ విధానంలో పంజాబ్ విజయం

01 April 2023, 20:17 IST

google News
    • PBKS vs KKR: మొహలీ వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. డీఎల్ఎస్ విధానంలో కోల్‌కతా లక్ష్యానికి 7 పరుగుల దూరంలో ఉండటంతో పంజాబ్ గెలిచింది. పంజాబ్ బౌలర్ 3 వికెట్లతో రాణించాడు.
కోల్‌కతాపై పంజాబ్ ఘనవిజయం
కోల్‌కతాపై పంజాబ్ ఘనవిజయం (PTI)

కోల్‌కతాపై పంజాబ్ ఘనవిజయం

PBKS vs KKR: ఐపీఎల్ 2023లో పంజాబ్ కింగ్స్ బోణీ చేసింది. మొహాలీ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్ మధ్యలోనే ఆగిపోవడంతో డక్‌వర్త్ లూయిస్ విధానంలో పంజాబ్ 7 పరుగుల తేడాతో గెలిచింది. 192 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన కేకేఆర్.. 16 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ఇంతలో వర్షం రావడంతో చాలా సేపు మ్యాచ్ ఆగిపోయింది. అయితే డక్‌వర్ల్ లూయిస్ విధానం ప్రకారం కేకేఆర్.. విజయానికి మరో 7 పరుగుల దూరంలోనే ఆగిపోయింది. 16 ఓవర్లలో 153 పరుగులైనా చేసినట్లయితే కోల్‌కతా గెలిచేది. కానీ చివరకు పంజాబ్ విజయాన్ని కైవసం చేసుకుంది.

192 పరుగుల లక్ష్య ఛేదనలో కేకేఆర్‌కు శుభారంభమేమి దక్కలేదు. రెండో ఓవర్లోనే పంజాబ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ తన స్పెల్‌తో కోల్‌కతా ఓపెనర్ మన్‌దీప్ సింగ్‌(2), వన్డౌన్ బ్యాటర్ అనుకుల్ రాయ్‌ను(4) ఔట్ చేశాడు. ఆ కాసేపటికే రెహమనుతుల్లాను(22) పెవిలియన్ చేర్చి కోల్‌కతాను కోలుకోలేని దెబ్బకొట్టాడు నాథన్ ఎల్లిస్. దీంతో 29 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ నితీశ్ రాణా(24), వెంకటేష్ అయ్యర్(34) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. నిలకడగా బ్యాటింగ్ చేస్తూ స్కోరు వేగం పెంచారు.

వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 46 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే నితీష్‌ను సికిందర్ రజా ఔట్ చేయడంతో కేకేఆర్ మరో ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఆ కాసేపటికే రింకూ సింగ్ కూడా ఔట్ కావడంతో కోల్‌కతా ఓటమి అంచున నిలిచింది. ఇలాంటి సమయంలో వెంకటేష్ అయ్యర్‌తో ఆండ్రూ రసెల్(35) ఆదుకునే ప్రయత్నం చేశాడు. వీరిద్దూర సిక్సర్లు, ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించారు. ఆరో వికెట్‌కు వీరిద్దరూ 56 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇలాంటి సమయంలో పంజాబ్ బౌలర్ సామ్ కరన్.. రసెల్‌ను ఔట్ చేసి లక్ష్యం దిశగా వెళ్తున్న కేకేఆర్‌ను దెబ్బకొట్టాడు.ఆ కాసేపటికే వెంకటేష్ అయ్యర్ కూడా ఔట్ కావడంతో కేకేఆర్ ఓటమి దిశగా ప్రయాణించింది.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శార్దూల్ ఠాకూర్(8), సునీల్ నరైన్(7) చెరో సిక్సర్‌తో ధాటిగా ఆడేందుకు ప్రయత్నించారు. అయితే ఇంతలోనే వర్షం పడటంతో ఆట ఆగిపోయింది. ఎంత సేపటికీ తగ్గకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ విధానంలో పంజాబ్‌ విజయం సాధించింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు తీయగా.. నాథన్ ఎల్లిస్, సామ్ కరన్, సికిందర్ రజా తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోరు సాధించింది. పంజాబ్ బ్యాటర్ భానుక రాజపక్స(50) అర్దశతకంతో ఆకట్టుకోగా.. కెప్టెన్ శిఖర్ ధావన్(40) రాణించాడు. కోల్‌కతా బౌలర్లలో సౌథీ 2 వికెట్లు తీయగా.. నరైన్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

తదుపరి వ్యాసం