Kane Williamson Injury: ఐపీఎల్ 2023కి విలియమ్సన్ దూరం! మోకాలికి తీవ్రమైన గాయం
Kane Williamson Injury: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2023 సీజన్‌లో గుజరాత్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ ఆడేది అనుమానంగా మారింది. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో అతడు గాయపడటంతో అతడు టోర్నీలో కొనసాగే అంశంపై సందిగ్ధత నెలకొంది.
Kane Williamson Injury: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ ఐపీఎల్‌లో తదుపరి మ్యాచ్‌లు ఆడేది, లేనిది అనుమానంగా మారింది. శుక్రవారం చెన్నైతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో విలియమ్సన్ గాయపడిన సంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ప్లేయర్ చెన్నై బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తూ కిందపడ్డాడు. దీంతో గాయపడిన అతడు మైదానం నుంచి నిష్క్రమించాడు. అయితే చిన్నగాయమై అనుకుంటే.. ప్రస్తుతం విలియమ్సన్ పరిస్థితి చూస్తుంటే అది పెద్దది కాదని తెలుస్తోంది.
చైన్నై ఇన్నింగ్స్‌లో 13వ ఓవర్లో రుతురాజ్ గైక్వాడ్ కొట్టిన షాట్‌ను ఆపేందుకు ప్రయత్నించిన కేన్ విలియమ్సన్ కింద పడి గాయపడ్డాడు. దీంతో నొప్పితో కుడి మోకాలిని పట్టుకుని నడవలేకపోయాడు. అప్పుడే ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత మైదానం నుంచి నిష్క్రమించాడు. అనంతరం ఫీల్డింగ్‌కు కూడా రాలేదు. ఇంపాక్ట్ ప్లేయర్ నియమం ప్రకారం ప్లెయింగ్ ఎలెవన్‌లోకి వచ్చాడు విలియమ్సన్.
ఐపీఎల్ వర్గాల సమాచారం ప్రకారం కేన్ విలియమ్సన్ ఐపీఎల్‌లో పాల్గొనే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. కొంతకాలం పాటు ఆటకు దూరంగా ఉండాల్సి రావచ్చని సమాచారం. ఈ విషయంలో గుజరాత్ కప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడుతూ.. "విలియమ్సన్ గాయం తీవ్రత గురించి తనకు తెలియదని చెప్పాడు. ఇది కచ్చితంగా మోకాలి గాయమే. కానీ సరిగ్గా ఏం జరిగిందనేది నాకు తెలియదు. నా వద్ద ఎలాంటి అప్డేట్ లేదు. గాయం తీవ్రంగా ఉంది? కొలుకునేందుకు ఎంత సమయం పడుతుంది అనేది ప్రస్తుతానికి నాకు తెలియదు.నేను ఇప్పుడే మెసేజ్ చేశాను. అతడు స్కాన్ కోసం వెళ్లాడు. స్కాన్ తర్వాత వైద్యుల చెక్ చేసిన తర్వాతే కచ్చితంగా ఏంటో చెప్పగలను" హార్దిక్ స్పష్టం చేశాడు.
ఈ సీజన్‌లో కేన్ విలియమ్సన్ తొలిసారి గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్నాడు. 2015 నుంచి 2022 వరకు సన్ రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2018, 2022లో ఆ జట్టుకు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. 2019, 2021లో కొన్ని మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు.
శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శుభ్‌మన్ గిల్(63) అర్ధశతకంతో ఆకట్టుకుని జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో మరో నాలుగు బంతులు మిగిలుండగానే గుజరాత్ విజయాన్ని అందుకుంది. చెన్నై బౌలర్లలో రాజవర్ధన్ మూడు వికెట్లు తీశాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 92 పరుగులతో రాణించాడు.