Williamson for IPL: ఐపీఎల్‌ కోసం విలియమ్సన్‌ను ముందుగానే వదలనున్న కివీస్.. కెప్టెన్‌ను కూడా మార్చింది-kane williamson to be released early for ipl and tom latham to lead new zealand ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Williamson For Ipl: ఐపీఎల్‌ కోసం విలియమ్సన్‌ను ముందుగానే వదలనున్న కివీస్.. కెప్టెన్‌ను కూడా మార్చింది

Williamson for IPL: ఐపీఎల్‌ కోసం విలియమ్సన్‌ను ముందుగానే వదలనున్న కివీస్.. కెప్టెన్‌ను కూడా మార్చింది

Maragani Govardhan HT Telugu
Mar 14, 2023 08:19 AM IST

Williamson for IPL: ఐపీఎల్‌లో ఆడేందుకు కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను ముందుగానే వదిలిపెట్టనుంది న్యూజిలాండ్. అతడి స్థానంలో శ్రీలంకతో వన్డేలకు టామ్ లాథమ్‌ను సారథిగా నియమించింది.

కేన్ విలియమ్సన్
కేన్ విలియమ్సన్ (AFP)

Williamson for IPL: ఐపీఎల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచంలో క్రికెట్ ఆడే ప్రతి ఒక్కరూ ఈ టోర్నీలో ఆడేందుకు ఇష్టపడతారు. ఆ సమయంలో సొంత దేశంలో సిరీస్‌లు ఉన్నా.. ఐపీఎల్‌కే ఓటేస్తారు. తాజాగా అదే జరిగింది. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను ఐపీఎల్ కోసం ముందే విడిచిపెట్టనుంది ఆ జట్టు. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఆడుతున్న విలియమ్సన్‌ వన్డేలకు అందుబాటులో ఉండడు. దీంతో వన్డే సిరీస్‌లో కివీస్‌ జట్టుకు టామ్ లాథమ్ నేతృత్వం వహించనున్నాడు.

గతేడాది జరిగిన ఐపీఎల్ వేలంలో గుజరాత్ టైటాన్స్ రూ.2 కోట్లకు అతడిని సొంతం చేసుకుంది. దీంతో మంచి ఫామ్‌లో ఉన్న విలియమ్సన్‌ ఐపీఎల్‌లో సత్తా చాటేందుకు ఆత్రుతగా ఉన్నాడు. అతడితో పాటు న్యూజిలాండ్ జట్టు ఐపీఎల్ కోసం టిమ్ సౌథీ(కోల్‌కతా నైట్ రైడర్స్), డేవాన్ కాన్వే(చెన్నై సూపర్ కింగ్స్), మిచెల్ సాంట్నర్(చెన్నై సూపర్ కింగ్స్)ను కూడా వదలిపెట్టనుంది. దీంతో టామ్ లాథమ్మ న్యూజిలాండ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

వీరి స్థానంలో న్యూజిలాండ్‌ జట్టులో కొత్త ముఖాలు కనిపించనున్నాయి. చాడ్ బోవాస్, బెన్ లిస్టర్‌ను శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌కు కివీస్ బోర్డ్ ఎంపిక చేసింది. అయితే మార్చి 25న జరగనున్న మొదటి వన్డే తర్వాత ఫిన్ అలెన్(రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), లోకీ ఫెర్గ్యూసన్(కోల్‌కతా నైట్ రైడర్స్), గ్లెన్ ఫిలిప్(సన్‌రైజర్స్ హైదరాబాద్)కు ఐపీఎల్ కోసం భారత్‌కు చేరుకోనున్నారు.

ఈ అంశంపై న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టెడ్ స్పందించారు. "జట్టులో ఎప్పుడూ కొత్త ఆటగాళ్లను కలిగి ఉండటం మంచి వాతావరణాన్ని సృష్టిస్తుంది. అలాగే నిర్దిష్ట ఫార్మాట్‌లో ఎంపిక చేయడానికి ఆటగాళ్లను పైకి తీసుకురావడం ఎప్పుడూ ఉత్తేజకరంగా ఉంటుంది." అని గ్యారీ స్టెడ్ అన్నారు.

శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో విలియమ్సన్ చివర వరకు పోరాడి న్యూజిలాండ్‌ను విజయతీరాలకు చేర్చాడు. కివీస్ గెలుపుతో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరేందుకు భారత్‌కు కూడా మార్గం సుగమమైంది.

శ్రీలంకతో వన్డే సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు..

టామ్ లాథమ్(కెప్టెన్), ఫిన్ అలెన్(తొలి వన్డేకు మాత్రమే), టామ్ బ్లండెల్, చాడ్ బోవెస్, మైఖేల్ బ్రాస్‌వెల్, మార్క్ చాప్‌మన్(2, 3వన్డేలకు), లోకీ ఫెర్గ్యూసన్(తొలి వన్డేకు మాత్రమే), మ్యాట్ హెన్రీ, బెన్ లిస్టర్(2, 3 వన్డేలకు), డారిల్ మిచెల్, హెన్రీ నికోలస్(2, 3 వన్డేలకు), గ్లెన్ ఫిలిప్స్(తొలి వన్డేకు), హెన్రీ షిప్లే, ఇష్ సోధీ, బ్లెయిర్ టికనెర్, విల్ యంగ్.

WhatsApp channel