తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Pcb Vs Bcci: భారత్ ఆసియా కప్‌లో ఆడకపోతే.. పాక్ వరల్డ్ కప్‌ను బహిష్కరిస్తుందా? పీసీబీ ఛైర్మన్ ఏమన్నారు?

PCB Vs BCCI: భారత్ ఆసియా కప్‌లో ఆడకపోతే.. పాక్ వరల్డ్ కప్‌ను బహిష్కరిస్తుందా? పీసీబీ ఛైర్మన్ ఏమన్నారు?

08 January 2024, 19:45 IST

google News
  • PCB Vs BCCI: ఆసియా కప్ పాకిస్థాన్‌కు భారత్ రాకపోతే మాత్రం అక్కడ జరగనున్న వరల్డ్ కప్‌ను తాము బహిష్కరించే వైఖరిపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని పీసీపీ ఛైర్మన్ నజాం సేఠి తెలిపారు. రాబోయే ఏసీసీ, ఐసీసీ సమావేశాల్లో ఈ అంశం చర్చిస్తామని స్పష్టం చేశారు.

పీసీబీ ఛైర్మన్ నజాం సేఠి
పీసీబీ ఛైర్మన్ నజాం సేఠి (AP)

పీసీబీ ఛైర్మన్ నజాం సేఠి

PCB Vs BCCI: పాకి‌స్థాన్‌లో జరిగే ఆసియా కప్ టోర్నీకి టీమిండియా రాకపోతే.. ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు రాబోమని పాక్ మాజీ ఛైర్మన్ రమీజ్ రజా తెగెసి చెప్పిన సంగతి తెలిసిందే. గతేడాది ఇప్పటికే ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ ఏడాది పాకిస్థాన్‌లో జరగనున్న ఆసియా కప్ టోర్నీకి భారత్ వస్తుందా? లేదా అనే అంశం మళ్లీ వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్(PCB) ప్రస్తుత ఛైర్మన్ నజాం సేఠీ ఈ అంశంపై స్పందించారు. ఈ విషయంలో ఉన్న ఆప్షన్లు అన్నింటినీ పట్టించుకుని, స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకుంటామని తెలిపారు. ఈ అంశంపై రాబోయే ఆసియా క్రికెట్ కౌన్సి(ACC), ఐసీసీ సమావేశాల్లో చర్చ లేవనెత్తుతామని స్పష్టం చేశారు.

"మా చేతిలో సంక్లిష్టమైన సమస్యలు ఉన్నాయి. నేను ఏసీసీ, ఐసీసీ సమావేశాల్లో ఉన్న ఆప్షన్లపై చర్చిస్తాను. ప్రస్తుతానికి మేము స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోవాలి. నేను నా ఆప్షన్లు అన్నింటినీ ముందుపెట్టాను. మిగిలిన అన్ని జట్లు పాకిస్థాన్‌కు వస్తున్నప్పుడు భద్రతకు సంబంధించి ఎలాంటి సమస్యలు లేవు. అప్పుడు సెక్యూరిటీ విషయలో భారత్ ఎందుకు ఆందోళన చెందుతుంది. అలా అయితే మా జట్టును భారత్‌కు పంపడంపై కూడా భద్రతా సమస్యలు ఉండవచ్చు. నేను ఈ విషయంపై రాబోయే సమావేశాల్లో చర్చకు తీసుకొస్తాను" అని నజాం సేఠి తెలిపారు.

ఐసీసీ సమావేశాలు ఈ నెలలోనే జరగనున్నాయి. దీంతో పీసీబీ ఈ విషయంపై చర్చించే అవకాశముంది. "సహజంగానే మేము ఈ విషయంలో భారత్ వైఖరికి మద్దతు ఇవ్వము. ఎందుకంటే మేము ఆసియా కప్ నిర్వహించాలనుకుంటున్నాము. ఇది కేవలం ఆ టోర్నీ గురించి మాత్రమే కాదు. 2025లో పాకిస్థాన్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీని కూడా మనం గుర్తుంచుకోవాలి." అని ఆయన అన్నారు.

ఐసీసీ సమావేశానికి వెళ్లే ముందు సమస్యలపై పాక్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరపనున్నట్లు నజాం సేఠి తెలిపారు. "నేను ప్రభుత్వం నుంచి సలహా కోరాను. ప్రభుత్వ విధానాల ప్రకారం మా నిర్ణయం ఆధారపడి ఉంటుంది. ఆసియా కప్ కోసం భారత్ రాకపోయినా.. మమ్మల్ని ప్రపంచకప్ ఆడమంటే మేము ఏం చేయగలం? ఒకవేళ వద్దంటే మాత్రం పరిస్థితి ఇలానే ఉంటుంది." అని నజాం సేఠి తెలిపారు. ఆసియా కప్‌ కోసం పాకిస్థాన్‌కు భారత్ రాకపోతే ప్రపంచకప్‌లో పాక్ ఆడుతుందా లేదా అనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని పీసీబీ ఛైర్మన్ అన్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం