PCB Free Entry for 2nd test: ప్రేక్షకులు లేక వెల వెల బోతున్న పాక్ స్టేడియాలు.. ఫ్రీ ఎంట్రీ షురూ.. ఉచితంగానైనా చూస్తారా?
31 December 2022, 18:58 IST
- PCB Free Entry for 2nd test: న్యూజిలాండ్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌కు స్టేడియాలు ప్రేక్షకులు లేక వెలవెల బోతున్నాయి. దీంతో పాక్ క్రికెట్ బోర్డు ఫ్రీ ఎంట్రీకి అనుమతించింది.
పాకిస్థాన్-న్యూజిలాండ్ రెండో టెస్టుకు ప్రేక్షకులకు ఫ్రీ ఎంట్రీ
PCB Free Entry for 2nd test: పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పరిస్థితి. చాలా కాలం తర్వాత ఈ ఏడాదే సొంత గడ్డపై క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతుండటంతో భారీ సంఖ్యలో ప్రేక్షకులు వస్తారని ఆశించింది పాకిస్థాన్. అయితే పాక్ జట్టు వరుస ఓటములతో అభిమానులను నిరాశకు గురిచేయడంతో మ్యాచ్‌లను చూసేందుకు ఆసక్తి చూపించడం లేదు. కరాచీ వేదికగా శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులోనూ ప్రేక్షకులు లేక స్టేడియం వెల వెల బోయింది. దీంతో రెండో టెస్టు నుంచి ఉచితంగా ఆడియెన్స్‌ను అనుమతించనుంది. ఈ మేరకు పీసీబీ ప్రకటన విడుదల చేసింది.
"మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రేక్షకులు ఒరిజినల్ ఐడీ కార్డు లేదా బీ ఫారం తీసుకుని స్టేడియానికి వస్తే ఉచితంగా ఎంట్రీ లభిస్తుంది. ఇమ్రాన్ ఖాన్, క్వాద్, వసీం అక్రమ్, జహీర్ అబ్బాస్ పేరిట ఉన్న ప్రీమియం లాంజ్‌లకు వెళ్లి చూసే అవకాశం కూడా ఉంది. ప్రీమియం, ఫస్ట్ క్లాస్, జనరల్ విభాగంలో ఏ ప్రదేశంలోనైనా కూర్చుని మ్యాచ్‌ను వీక్షించవచ్చు." అని పీసీబీ తన ప్రకటనలో పేర్కొంది.
అంతేకాకుండా పీసీబీ నేషనల్ బ్యాంక్ క్రికెట్ ఎరీనా, గరీబ్ నవాజ్ పార్కింగ్ ఏరియాలోనూ ప్రేక్షకులకు అనుమతి ఉందని స్పష్టం చేసింది. ఏదేమైనప్పటికీ స్టేడియంలో ప్రేక్షకులు లేక ఇలా ఉచిత పథకాలను ప్రవేశపెట్టడంతో నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు.
కరాచీ వేదికగా న్యూజిలాండ్-పాకిస్థాన్ మధ్య జరిగిన మొదటి టెస్టు డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో పాక్ 438 పరుగులు చేయగా.. అనంతరం న్యూజిలాండ్ కేన్ విలియమ్సన్ డబుల్ సెంచరీతో రాణించడంతో 612 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌ను పాక్ 8 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. కివీస్ విజయానికి 15 ఓవర్లలో 138 పరుగులు అవసరం కాగా.. వెలుతురు లేకపోవడంతో 7.3 ఓవర్లకే మ్యాచ్‌ను ముగించి ఫలితం డ్రాగా తేల్చారు. అప్పటి న్యూజిలాండ్ వికెట్ నష్టానికి 61 పరుగులే చేసింది.