Ramiz Acting Like Kid: రమీజ్ పిల్లాడిలా ప్రవర్తిస్తున్నాడు.. అతడిపై పాక్ మాజీ కెప్టెన్ ఫైర్
31 December 2022, 17:04 IST
- Ramiz Acting Like Kid: పీసీబీ మాజీ ఛీఫ్ రమీజ్ రజా తనను పదవీ నుంచి తొలగించడంపై ఇంకా అసంతృప్తి వెళ్లగక్కుతూనే ఉన్నాడు. దీంతో పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్.. రమీజ్ రజాపై మండిపడ్డాడు. అతడు చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తున్నాడని స్పష్టం చేశాడు.
రమీజ్ రజా
Ramiz Acting Like Kid: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ పదవీ నుంచి ఆ దేశ మాజీ క్రికెటర్ రమీజ్ రజాను ఇటీవల తొలగించిన విషయం తెలిసిందే. ఆ పదవీ ఊడినప్పటి నుంచి అతడు తన అసంతృప్తి జ్వాలలు కక్కుతూనే ఉన్నాడు. పాక్ ప్రభుత్వంపై, పీసీబీ ప్యానెల్‌పై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాడు. కార్యాలయంలో తన వస్తువులను కూడా తీసుకెళ్లనీయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంతటితో ఆగకుండా భారత్‌పై తన అక్కసు వెళ్లగక్కుతున్నాడు. దీంతో అతడి ప్రవర్తనపై విసిగిన పలువురు మాజీలు రమీజ్‌పై విమర్శలు చేస్తున్నారు. తాజాగా పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ కూడా రమీజ్‌పై తీవ్రంగా ధ్వజమెత్తాడు. కాస్త హుందాగా వ్యవహరించాలని, పిల్లాడిలా ప్రవర్తించవద్దని హితవు పలికాడు.
"రమీజ్ రజా లక్కీ అనే చెప్పాలి. ప్రభుత్వం మారిన తర్వాత కూడా కొన్ని నెలల పాటు పీసీబీ ఛైర్మన్‌గా కొనసాగాడు. సాధారణంగా అలా జరుగదు. కానీ అతడి విషయంలో అలా జరగడమే కాకుండా.. పీసీబీ ఛైర్మన్‌గా సపోర్ట్ కూడా చేశారు. రమీజ్‌ను తొలగించే విషయంపై ముందు నుంచే చాలా చర్చ నడిచింది. ఒక్క రాత్రిలో ఆ నిర్ణయాన్ని తీసుకోలేదు" అని సల్మాన్ భట్ వ్యాఖ్యానించాడు.
పదవీ పోయిన తర్వాత పీసీబీ మాజీ ఛీప్ మరి పిల్లాడిలా ప్రవర్తిస్తున్నాడని సల్మాన్ భట్ అసంతృప్తి తెలియజేశాడు.
"అతడు ఇటీవల చేసిన కామెంట్లు అభ్యంతరకరంగా ఉన్నాయి. గతంలోనూ చాలా మందిని ఆ పదవి నుంచి తొలగించారు. కానీ ఎవ్వరూ ఈ విధంగా స్పందించలేదు. అతడు మరి పిల్లాడిలా ప్రవర్తిస్తున్నాడు. బొమ్మ లేకపోతే ఆడుకోననే పిల్లాడిలా మారం చేస్తున్నాడు. అతడికి ఇతర నైపుణ్యాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అతడు కామెంటరీ కూడా చేయవచ్చు. అలా కాకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదు. కాస్త హుందాగా వ్యవహరిస్తే బాగుంటుంది." అని సల్మాన్ భట్ స్పష్టం చేశాడు.
ఈ ఏడాది టెస్టు క్రికెట్‌లో పాకిస్థాన్ ఘోరంగా విఫలమైంది. ఏప్రిల్‌లో సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఓటమి పాలైన పాక్.. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ వైట్ వాష్‌కు గురైంది. అంతేకాకుండా ఆసియా, టీ20 వరల్డ్ కప్‌లో ఫైనల్ వరకు చేరి కూడా రిక్త హస్తాలతో తిరిగి వచ్చింది. దీంతో పీసీపీ ఛైర్మన్‌గా ఉన్న రమీజ్ రజాపై వేటు వేశారు.