Ramiz Raja on India: ఇండియా సేవకులుగా ఉండాలా.. వాళ్లేం చెబితే అది వినాలా?: రమీజ్
Ramiz Raja on India: ఇండియాకు సేవకులుగా ఉండాలా.. వాళ్లేం చెబితే అది వినాలా అంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ రమీజ్ రాజా అన్నారు. తాను పీసీబీ ఛీఫ్‌గా ఉన్న సమయంలో బీసీసీఐతో కఠినంగా వ్యవహరించిన తీరుపై ఆయన స్పందించారు.
Ramiz Raja on India: క్రికెట్‌లో ఇండియా సూపర్ పవర్. బీసీసీఐ దగ్గర ఉన్న ఆర్థిక బలంపైనే ఐసీసీ కూడా నడుస్తోంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అంత మాత్రాన ఇండియాకు సేవకులుగా ఉండాలా అంటూ ప్రశ్నిస్తున్నారు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ రమీజ్ రాజా. ఆసియాకప్ 2023 విషయంలో బీసీసీఐతో సై అంటే సై అన్నట్లుగా రమీజ్ వ్యవహరించారు.
ఒకవేళ పాక్ నుంచి ఆసియాకప్‌ను తరలిస్తే ఇండియాలో జరిగే వరల్డ్‌కప్‌ను బాయ్‌కాట్ చేస్తామనీ అప్పట్లో రమీజ్ హెచ్చరించారు. ఇప్పుడు రమీజ్ తన పదవి కోల్పోయారు. కొత్తగా నజమ్ సేఠీ ఆ పదవిలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను పదవిలో ఉన్నప్పుడు చేసిన గొప్ప పనుల గురించి రమీజ్ చెప్పుకొచ్చారు.
"నేను ఛైర్మన్‌గా ఉన్న సమయంలో తీసుకొచ్చిన సానుకూల మార్పు ఏంటంటే నేను నాయకత్వం అందించాను. న్యూజిలాండ్ అర్ధంతరంగా వెళ్లిపోయినప్పుడు ఇది సరికాదని వాళ్లకు చెప్పాం. ఇంగ్లండ్ మా దగ్గరికి రావడానికి నిరాకరించింది. వాళ్లతో మాట్లాడాం. ఆ తర్వాత ఐదు టీ20లకు బదులు ఏడు మ్యాచ్‌లు వాళ్లు ఆడారు. ఈసీబీ అధికారులు లాహోర్‌లోని గఢాఫీ స్టేడియానికి వెళ్లి చూశారు. ఆ తర్వాత నా దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పారు. ఆస్ట్రేలియా కూడా అలాగే వచ్చింది" అని రమీజ్ అన్నారు.
"అసలు నాయకత్వం అంటే ఏంటి? ఆసియా క్రికెట్ కౌన్సిల్ పాకిస్థాన్‌కు ఓ టోర్నీ ఆతిథ్య హక్కులు కట్టబెట్టింది. అలాంటప్పుడు ఇండియా మేము రాము.. టోర్నీని తటస్థ వేదికకు మార్చాలంటే ఎలా స్పందించాలి? మనమందరం ఇండియాకు సేవకులుగా ఉండాలా? ఎందుకంటే వాళ్లకు వాళ్లు వరల్డ్ పవర్ అని చెప్పుకుంటున్నందుకా? వాళ్లు చెప్పిందే వింటూ వెళ్లాలా" అని రమీజ్ ప్రశ్నించారు.
"మనల్ని ఎక్కడ ఒంటరి వాళ్లను చేస్తారో అన్న భయం మనలో ఉంటుంది. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని ముందుకెళ్దాం అనుకుంటారు. కానీ అది సరైన నాయకత్వ లక్షణం కాదు. ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ టీమ్ గొప్పగా ఆడుతోంది. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సూపర్ స్టార్లు ఉన్నారు. టీమ్‌కు, అభిమానులకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వండి" అని రమీజ్ డిమాండ్ చేశారు.
సంబంధిత కథనం