BCCI రిచెస్ట్ క్రికెట్ బోర్డుగా ఎలా మారింది? బోర్డు రాత మార్చిన వ్యక్తి ఎవరు?
ఒక రకంగా మనీ పవర్ ఏంటో క్రికెట్ దేశాలకు రుచి చూపించిన ఘనత బీసీసీఐదే. 30 ఏళ్ల కిందట బోర్డు ఉన్న పరిస్థితి చూస్తే.. BCCI ఇప్పుడీ స్థాయికి ఎదుగుతుందని ఎవరూ కనీసం ఊహించి కూడా ఉండరు. మరి బోర్డుకు ఈ మనీ పవర్ ఎలా వచ్చింది?
BCCI.. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. క్రికెట్‌ను నడిపించేది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అయినా.. ఆ ఐసీసీ నడిచేది ఈ బీసీసీఐ కనుసన్నల్లోనే. ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ బోర్డుగా ఈ ఆటను శాసిస్తోంది. ఐసీసీలో చెల్లేది మన మాటే. మనల్ని రెండు వందల ఏళ్లు పాలించి, క్రికెట్‌ను మనకు పరిచయం చేసిన బ్రిటీషోడే తలవంచే స్థాయికి, మన చిరకాల ప్రత్యర్థి, దాయాది పాకిస్థాన్ మనల్ని చూసి కుళ్లుకునే స్థాయికి చేరింది.
క్రికెట్‌లో ఏ నయా సంస్కరణ తీసుకురావాలన్నా బీసీసీఐ అంగీకారం లేకుండా సాధ్యం కాని పరిస్థితి. మన బోర్డు అడుగు తీసి అడుగేస్తే కోట్లు కురుస్తాయి. ఒక రకంగా మనీ పవర్ ఏంటో క్రికెట్ దేశాలకు రుచి చూపించిన ఘనత బీసీసీఐదే. క్రికెట్ అంటే పడిచచ్చే అభిమానులు ఉన్న దేశంలో అక్కడి క్రికెట్ బోర్డు ఇలా కోట్లు కొల్లగొట్టడం పెద్ద విషయమేమీ కాదు అని సింపుల్‌గా తీసిపారేయడానికి లేదు.
ఎందుకంటే 30 ఏళ్ల కిందట బోర్డు ఉన్న పరిస్థితి చూస్తే.. BCCI ఇప్పుడీ స్థాయికి ఎదుగుతుందని ఎవరూ కనీసం ఊహించి కూడా ఉండరు. మరి బోర్డుకు ఈ మనీ పవర్ ఎలా వచ్చింది? మూడు దశాబ్దాల్లోనే అప్పుల ఊబి నుంచి కోలుకొని ఏకంగా ప్రపంచ క్రికెట్‌నే శాసించే స్థాయికి ఎలా చేరింది? బీసీసీఐ సక్సెస్ స్టోరీ నిజంగా ఓ కార్పొరేట్ పాఠమే.
BCCI.. అలా మొదలైంది..
సరిగ్గా 94 ఏళ్ల కిందట అంటే 1927, నవంబర్ 21న ఢిల్లీలో ఓ 45 మంది పాల్గొన్న మీటింగ్ జరిగింది. ఆ తర్వాత అదే ఏడాది డిసెంబర్ 10న బాంబే జింఖానా గ్రౌండ్‌లో మరో సమావేశం జరిగింది. ఈ సమావేశాలే దేశంలో బీసీసీఐ పురుడు పోసుకోవడానికి నాంది పలికాయి. తర్వాత సరిగ్గా ఏడాదికి అంటే 1928, డిసెంబర్‌లో బీసీసీఐ ఏర్పడింది. ఈ సమావేశాలను ప్రారంభించిన గోవన్ తొలి అధ్యక్షుడిగా, డె మెల్లో తొలి కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆ తర్వాత ఐదు నెలలకే ఐసీసీ.. బీసీసీఐని పూర్తిస్థాయి సభ్యదేశంగా గుర్తించింది.
BCCI.. అక్కడ మలుపు తిరిగింది ..
1983.. ఇండియన్ క్రికెట్‌లో ఈ ఏడాదిని ఎవరూ మరచిపోరు. అప్పటి వరకూ క్రికెట్ ప్రపంచంలో పసికూనలాంటి టీమిండియా.. తొలిసారి విశ్వవిజేతగా నిలిచిన ఏడాది అది. టీవీల్లో అభిమానులు చూసిన తొలి ప్రపంచకప్ కూడా అదే. దేశంలో క్రికెట్ క్రేజ్ పెరగడానికి అదే కారణమైనా.. బీసీసీఐ ఆ క్రికెట్‌ను అమ్ముకొని నాలుగు రాళ్లు వెనకేసుకోవడానికి మరో పదేళ్లు పట్టింది. ఆ వరల్డ్‌కప్‌లో ఇండియా సెమీఫైనల్ చేరిన తర్వాత గానీ మన దూర్‌దర్శన్ మ్యాచ్‌లను ప్రసారం చేయలేదు.
కానీ సెమీస్‌లో ఇంగ్లండ్‌ను మట్టికరిపించి, ఫైనల్లో రెండుసార్లు విశ్వవిజేత వెస్టిండీస్‌కు షాకిచ్చి కప్పు గెలిచిన తర్వాత ఇండియాలో వన్డే క్రికెట్ క్రేజ్ మొదలైంది. దీంతో 1987లో బీసీసీఐ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కలిసి వరల్డ్‌కప్ ఆతిథ్య హక్కులను సొంతం చేసుకున్నాయి. ఆ టోర్నీ విజయవంతమైంది. అయినా దానివల్ల బోర్డు లాభపడింది పెద్దగా లేదు. 1992 వరకు కూడా బోర్డు మ్యాచ్‌లను లైవ్ టెలికాస్ట్ చేయడానికి చాలా ఇబ్బంది పడింది.
BCCI.. ఇలా ఎదిగింది..
ఇప్పుడంటే క్రికెట్ మ్యాచ్‌లను లైవ్ టెలికాస్ట్ చేయడానికి ఛానెల్స్ పోటీ పడుతూ వేల కోట్లు ఇవ్వడానికి ముందుకొస్తున్నాయి కానీ.. 30 ఏళ్ల కిందట ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే దూర్‌దర్శన్‌దే ఆధిపత్యం. అప్పట్లో మ్యాచ్‌ను టెలికాస్ట్ చేయడానికి బీసీసీఐనే రివర్స్‌లో డీడీకి మ్యాచ్‌కు రూ. 5 లక్షలు ఇచ్చేదంటే నమ్మగలరా? కానీ 1993లో ఇప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గురువు జగ్మోహన్ దాల్మియా బోర్డు రాతనే మార్చేసే ఓ నిర్ణయం తీసుకున్నారు. దూర్‌దర్శన్‌పై న్యాయపోరాటం చేసి గెలిచారు.
ఆ తర్వాత మ్యాచ్‌ల టెలికాస్ట్ కోసం డీడీనే బీసీసీఐకి డబ్బులు చెల్లించడం ప్రారంభించింది. అదే ఏడాది ఇండియా, ఇంగ్లండ్ సిరీస్ కోసం బీసీసీఐ టీవీ హక్కులను ట్రాన్స్ వరల్డ్ ఇంటర్నేషనల్‌కు కట్టబెట్టింది. ఆ సిరీస్ ద్వారా ఏకంగా 6 లక్షల డాలర్ల లాభాన్ని బోర్డు ఆర్జించడం విశేషం. ప్రైవేట్ ఛానెల్స్ ద్వారా మ్యాచ్‌లను టెలికాస్ట్ చేయించాలన్న దాల్మియా నిర్ణయం.. తర్వాతి కాలంలో బీసీసీఐని వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతిని చేసింది. ఆ దశాబ్దం చివరినాటికి ఇండియాలో క్రికెట్ ఫ్యాన్ బేస్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో వివిధ ఆదాయ మార్గాల్లో బోర్డు ఖజానా నిండటం మొదలైంది. 1996 వరల్డ్‌కప్ హక్కులను కూడా ఇండియా దక్కించుకోవడంతో ఇక బోర్డు వెనుదిరిగి చూడలేదు.
BCCI.. ఐపీఎల్‌తో శాసిస్తోంది
బీసీసీఐ ఆర్జన అలా ప్రారంభం కాగా.. ఆ తర్వాత మరో పదేళ్లకు అంటే 2007లో బోర్డు తీసుకున్న మరో నిర్ణయం క్రికెట్‌నే శాసించే స్థాయికి చేర్చింది. ఆ ఏడాదే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అనే బంగారు బాతును ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఫ్రాంఛైజీలు, ఆటగాళ్ల వేలం, క్రికెట్‌లోకి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, బాలీవుడ్ స్టార్ల ఎంట్రీ అంతా క్రికెట్ అభిమానులకు ఓ కొత్త అనుభూతిని పంచింది. ఈ ఐపీఎల్ వల్లే ప్రపంచ క్రికెట్‌లో ఆధిపత్యం చేతులు మారింది.
ఇప్పుడా ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ సుమారు రూ. 50 వేల కోట్లు. ఈ మనీ పవర్‌తో క్రికెట్‌ను బీసీసీఐ శాసించడం మొదలుపెట్టింది. ఇప్పుడో సాధారణ క్రికెటర్ కూడా కోట్లు సంపాదిస్తున్నాడంటే దానికి కారణం ఐపీఎల్. ఐదేళ్ల పాటు ఐపీఎల్‌ను ప్రత్యక్షప్రసారం చేయడానికి స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ ఏకంగా రూ. 16 వేల కోట్లకుపైగా చెల్లించింది. అంటే ఒక్కో ఐపీఎల్ మ్యాచ్ టెలికాస్ట్ చేయడానికి రూ. 60 కోట్లు చెల్లిస్తుందన్నమాట.
ఒకప్పుడు మ్యాచ్‌ల టెలికాస్ట్ కోసం డీడీకి ఎదురు చెల్లించిన బీసీసీఐ.. ఇప్పుడీ స్థాయికి చేరడం నిజంగా ఓ అద్భుతమే. ప్రస్తుతం బీసీసీఐ విలువ సుమారు రూ. 15 వేల కోట్లు. ప్రపంచ క్రికెట్‌ను నడిపే ఐసీసీ కంటే కూడా మన బోర్డు ఆదాయమే ఎక్కువ కావడం విశేషం. క్రికెట్‌ను ప్రాణంగా ప్రేమించే భారత అభిమానులదీ ఈ సక్సెస్ స్టోరీలో కీలకపాత్రే.
సంబంధిత కథనం