తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Oscar Pistorius Released: గర్ల్‌ఫ్రెండ్‌ను హత్య చేసిన బ్లేడ్ రన్నర్ జైలు నుంచి రిలీజ్

Oscar Pistorius Released: గర్ల్‌ఫ్రెండ్‌ను హత్య చేసిన బ్లేడ్ రన్నర్ జైలు నుంచి రిలీజ్

Hari Prasad S HT Telugu

05 January 2024, 9:21 IST

google News
    • Oscar Pistorius Released: గర్ల్‌ఫ్రెండ్‌ను హత్య చేసిన కేసులో పారాలింపిక్ ఆస్కార్ పిస్టోరియస్ అలియాస్ బ్లేడ్ రన్నర్ శుక్రవారం (జనవరి 5) జైలు నుంచి రిలీజ్ కానున్నాడు. అతడు ఎనిమిదిన్నరేళ్లపాటు జైల్లో గడిపాడు.
బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్
బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్ (AP)

బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్

Oscar Pistorius Released: సౌతాఫ్రికాకు చెందిన మాజీ పారాలింపిక్ ఛాంపియన్, స్ప్రింటర్ ఆస్కార్ పిస్టోరియస్ శుక్రవారం (జనవరి 5) జైలు నుంచి బయటకు రానున్నాడు. తన గర్ల్‌ఫ్రెండ్ రీవా స్టీన్‌కాంప్ ను హత్య చేసిన కేసులో అతడు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. 2013లో వాలెంటైన్స్ డే నాడు పిస్టోరియస్ ఆమెను చంపాడు.

కాళ్లు లేకపోవడంతో కార్బన్ ఫైబర్ తో చేసిన కృత్రిమ కాళ్లతో అతడు పరుగెత్తాడు. దీంతో ఆస్కార్ పిస్టోరియస్ కు బ్లేడ్ రన్నర్ అనే పేరు ఉంది. గర్ల్‌ఫ్రెండ్ ను హత్య చేసిన కేసులో ఇప్పటి వరకూ అతడు ఎనిమిదిన్నరేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. ఇప్పుడు పెరోల్ పై బయటకు వస్తున్నాడు. 37 ఏళ్ల వయసున్న ఈ బ్లేడ్ రన్నర్.. తాను కావాలని హత్య చేయలేదని, ఆమెను ఎవరో దొంగ అనుకొని కాల్చినట్లు పదే పదే వాదించాడు.

బ్లేడ్ రన్నర్ కేసేంటి?

బ్లేడ్ రన్నర్ గా సౌతాఫ్రికాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచాడు ఆస్కార్ పిస్టోరియస్. అలాంటి వ్యక్తి 2013లో వాలెంటైన్స్ డే నాడే తన గర్ల్‌ఫ్రెండ్ స్టీన్‌కాంప్ ను హత్య చేయడం సంచలనం సృష్టించింది. తాను బాత్‌రూమ్ లో ఉండగా.. ఆమె వచ్చిందని, ఇంట్లోకి ఎవరో చొరబడ్డారని భావించి ఆమెపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపినట్లు అతడు కోర్టులో వాదించాడు.

అయినా కోర్టు మాత్రం అతని వాదనను తోసి పుచ్చింది. కేసు నమోదైన తర్వాత మొదట 7 నెలల పాటు హౌజ్ అరెస్ట్ చేశారు. తర్వాత హత్య కేసులో శిక్ష విధించారు. అతడు సగం శిక్ష అనుభవించిన తర్వాత పెరోల్ ఇవ్వొచ్చని గతేడాది నవంబర్ లో పెరోల్ బోర్డు చెప్పింది. 2029, డిసెంబర్ లో అతని శిక్ష పూర్తి కానుంది. అంత వరకూ ఓ అధికారి ఎప్పుడూ బ్లేడ్ రన్నర్ పై ఓ కన్నేసి ఉంచుతారు. అతడు జాబ్ చేయాలన్నా.. అడ్రెస్ మారాలన్నా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

ఎవరీ బ్లేడ్ రన్నర్?

కాళ్లు లేకుండానే జన్మించిన ఆస్కార్ పిస్టోరియస్ కృత్రిమ కాళ్ల సాయంతో తన అవిటితనాన్ని అధిగమించి ప్రపంచం మెచ్చే స్ప్రింటర్ గా ఎదిగాడు. సౌతాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ లో అతడు జన్మించాడు. 2000 ఏడాదిలో ఏథేన్స్ లో జరిగిన పారాలింపిక్స్ లో 200 మీటర్ల గోల్డ్ సాధించి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఇక 2008లో జరిగిన బీజింగ్ ఒలింపిక్స్ లో తాను సాధారణ అథ్లెట్లలో పోటీ పడతానని చెప్పి అతడు మరింత ఆశ్చర్య పరిచాడు.

మొదట దీనిని వరల్డ్ అథ్లెటిక్స్ తీవ్రంగా వ్యతిరేకింది. అయితే అతనిపై విధించిన నిషేధాన్ని స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ కోర్టు ఎత్తేసింది. దీంతో బీజింగ్ ఒలింపిక్స్ 400 మీటర్ల క్వాలిఫయింగ్ రౌండ్లో పోటీ పడ్డాడు. కానీ 0.7 సెకన్లలో అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయాడు. అదే ఏడాది జరిగిన పారాలింపిక్స్ లో 100, 200, 400 మీటర్ల రేసుల్లో గోల్డ్ మెడల్స్ గెలిచి సంచలనం సృష్టించాడు.

ఆ తర్వాత 2012లో లండన్ ఒలింపిక్స్ కు అర్హత సాధించాడు. అక్కడ 400 మీటర్ల సెమీఫైనల్స్ చేరడంతోపాటు సౌతాఫ్రికా 4x400 మీటర్ల రిలే టీమ్ లోనూ పాల్గొన్నాడు. ప్రపంచమంతా అతన్ని ఆకాశానికెత్తుతున్న సమయంలో 2013, ఫిబ్రవరి 14న తన గర్ల్‌ఫ్రెండ్ ను షూట్ చేసి చంపాడన్న ఆరోపణలు రావడం షాక్ కు గురి చేసింది. తర్వాత అది నిజమేనని విచారణలో తేలడంతో స్పోర్ట్స్ లో ఓ గొప్ప చరిత్ర మరుగున పడిపోయింది.

తదుపరి వ్యాసం