Olympics 2036: ఒలింపిక్స్ కోసం సిద్ధమవుతున్న గుజరాత్.. 600 ఎకరాల్లో పనులు ప్రారంభం
17 October 2023, 13:23 IST
- Olympics 2036: ఒలింపిక్స్ కోసం సిద్ధమవుతోంది గుజరాత్. సుమారు 600 ఎకరాల్లో పనులు కూడా ప్రారంభం అయ్యాయి. 2036 ఒలింపిక్స్ కోసం సిద్ధంగా ఉన్నట్లు ఈ మధ్యే ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో ఈ పనులు ప్రారంభం కావడం విశేషం.
ఒలింపిక్స్ కోసం రెడీ అవుతున్న గుజరాత్
Olympics 2036: ఒలింపిక్స్ నిర్వహించాలన్నది 140 కోట్ల మంది భారతీయుల కల అని ఈ మధ్యే ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. 2036 ఒలింపిక్స్ ను కూడా భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే దీనికోసం బిడ్ వేయడం, దానిని గెలుచుకోవడంలాంటి తతంగం చాలా పెద్దదే. అయితే 13 ఏళ్ల తర్వాత జరగబోయే ఈ మెగా ఈవెంట్ కోసం పనులు మాత్రం అప్పుడే ప్రారంభం కావడం విశేషం.
ఈ గేమ్స్ నిర్వహించే ఆతిథ్య నగరంపై వచ్చే మూడేళ్లలో ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ మెగా ఈవెంట్ ను నిర్వహించడానికి ముందు వరుసలో ఉండే గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరం మాత్రం ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది. 2024 ఒలింపిక్స్ పారిస్ లో, 2028లో లాస్ ఏంజిల్స్ లో, 2032లో బ్రిస్బేన్ లో గేమ్స్ జరగనున్నాయి.
600 ఎకరాల్లో ఒలింపిక్స్ పనులు
2036 కోసం బిడ్ వేయాలని భారత్ ఆసక్తి చూపుతోంది. ఇండియాకు పోలాండ్, మెక్సికో, ఇండోనేషియాలాంటి దేశాల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. అంతకుముందు 2029లో జరగబోయే యూత్ ఒలింపిక్స్ నిర్వహించడంపై కూడా ప్రధాని మోదీ ఆసక్తి చూపించారు. ఈ నేపథ్యంలో గుజరాత్ లో అప్పుడే పనులు ప్రారంభమయ్యాయంటూ ఇండియా టుడే కథనం వెల్లడించింది.
ఈ గేమ్స్ కోసం రూపొందించిన తొలి ముసాయిదా ప్రకారం.. అహ్మదాబాద్ లో పనులు ప్రారంభించినట్లు ఆ కథనం తెలిపింది. ఈ పనుల కోసం కేంద్ర ప్రభుత్వ నుంచి కూడా రాష్ట్రానికి అనుమతి లభించిందని.. అహ్మదాబాద్, గాంధీనగర్ చుట్టూ ఉన్న నాలుగు ప్రాంతాలను దీనికోసం గుర్తించినట్లు కూడా చెప్పింది. దీనికోసం ఇప్పటికే గుజరాత్ ఒలింపిక్స్ ప్లానింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే ప్రత్యేక సంస్థను కూడా ఏర్పాటు చేయడం గమనార్హం.
దీనిపై గుజరాత్ ప్రభుత్వం అధికారికంగా స్పందించాల్సి ఉంది. నరేంద్ర మోదీ స్టేడియం పరిసరాల్లోనే ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. ఒలింపిక్స్ కోసం మొత్తంగా 600 ఎకరాలను కూడా గుర్తించినట్లు ఇండియా టుడే కథనం వెల్లడించింది. వివిధ స్పోర్ట్స్ కోసం రాష్ట్రంలోని 33 ప్రాంతాలను కూడా గుర్తించారు.
ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడల సంబరం ఒలింపిక్స్ నిర్వహించడమంటే మాటలు కాదు. దానికి కొన్ని వేల కోట్ల ఖర్చు, అత్యాధునిక వసతులు, రవాణా సౌకర్యాలు అవసరం. ప్రపంచంలోని ఎన్నో పెద్ద దేశాలు ఈ గేమ్స్ నిర్వహించి ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయాయి. గతంలో గ్రీస్, చైనా, బ్రెజిల్ లాంటి దేశాలు ఒలింపిక్స్ నిర్వహించి ఆర్థిక నష్టాలను కొనితెచ్చుకున్నాయి.