Lyon Breaks Kumble record: ఆసీస్ స్పిన్నర్ లయన్ అరుదైన ఘనత.. కుంబ్లే రికార్డు బ్రేక్
02 March 2023, 19:08 IST
- Lyon Breaks Kumble record: ఆస్ట్రేలియా స్పిన్న నాథన్ లయన్ అరుదైన ఘనత సాధించాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు కుంబ్లే పేరిట ఉండగా.. తాజాగా నాథన్ లయన్ అధిగమించాడు.
నాథన్ లయన్
Lyon Breaks Kumble record: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా స్వల్ప పరుగులే చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ ముందు కేవలం 75 పరుగుల లక్ష్యాన్నే నిర్దేశించింది. కంగారూ స్పిన్నర్ నాథన్ లయన్ 8 వికెట్లతో భారత పతనాన్ని శాసించాడు. ఫలితంగా టీమిండియా ఓటమి దిశగా ప్రయాణిస్తోంది. లయన్ ధాటికి భారత బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు కట్టారు. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో లయన్ అరుదైన ఘనతను సాధించాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.
ఇప్పటి వరకు ఆ రికార్డు అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. తాజాగా నాథన్ లయన్ ఈ రోజు మ్యాచ్‌లో 57వ ఓవర్లో ఉమేశ్ యాదవ్ వికెట్ తీయడంతో 112వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. కుంబ్లే 111 వికెట్లతో రెండో స్థానంలో నిలవగా అశ్విన్ 106 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..
నాథన్ లయన్- 112 వికెట్లు
అనిల్ కుంబ్లే- 111 వికెట్లు
రవిచంద్రన్ అశ్విన్- 106 వికెట్లు
హర్భజన్ సింగ్- 95 వికెట్లు
రవీంద్ర జడేజా- 84 వికెట్లు
టెస్టు క్రికెట్‌లో నాథన్ లయన్ అత్యంత విజయవంతమైన స్పిన్నర్‌గా నిలిచాడు. అందులోనూ భారత్‌తో సిరీస్‌లో అతడు బాగా రాణించాడు. టీమిండియాతో టెస్టు సిరీస్‌లో అత్యంత విజయవంతమైన వికెట్ టేకర్‌గా ఉన్న శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీ ధరన్‌ను కూడా నాథన్ లయన్ అధిగమించాడు. నేటి మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ వికెట్ తీయడంతో ఆ రికార్డును బ్రేక్ చేశాడు. అంతేకాకుండా ఆస్ట్రేలియా తరఫున షేన్ వార్న్ తర్వాత అత్యంత సక్సెస్‌ఫుల్ వికెట్ టేకర్‌గా లయన్ నిలిచాడు. భారత్‌పై అతడు కొన్ని కీలక మ్యాచ్‌ల్లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.
ఇండోర్ వేదికగా జరిగిన రెండో రోజు ఆటలో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 197 పరుగుల వద్ద ఆలౌటైంది. రవీంద్ర జడేజా 4 వికెట్లు తీయగా.. అశ్విన్, ఉమేష్ యాదవ్ చెరో 3 వికెట్లతో రాణించాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌కు బ్యాటింగ్‌కు దిగిన భారత్ 163 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా కేవలం 75 పరుగుల ఆధిక్యాన్ని మాత్రమే సాధించింది. మూడో రోజు ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్ ఆడనుంది. నాథన్ లయన్ 64 పరుగులిచ్చి 8 వికెట్లు తీశాడు.