Kaneria on Pant: పంత్ ఉండి ఉంటే కునెమాన్, లయన్ పని పట్టేవాడు: పాక్ మాజీ బౌలర్
Kaneria on Pant: పంత్ ఉండి ఉంటే కునెమాన్, లయన్ పని పట్టేవాడని అన్నాడు పాక్ మాజీ బౌలర్ డానిష్ కనేరియా. ఈ ఇద్దరు బౌలర్లే ఇండోర్ లో ఇండియన్ బ్యాటర్లకు చుక్కలు చూపించిన విషయం తెలిసిందే.
Kaneria on Pant: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో ప్రత్యర్థి కోసం వేసిన స్పిన్ ఉచ్చులో ఇండియానే చిక్కుకున్న సంగతి తెలుసు కదా. తొలి రోజే తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 109 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా స్పిన్నర్లు కునెమాన్, లయన్ ధాటికి భారత బ్యాటర్లు నిలవలేకపోయారు. అయితే ఈ మ్యాచ్ లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ ను ఇండియన్ టీమ్ చాలా మిస్ అయిందని పాకిస్థాన్ మాజీ బౌలర్ డానిష్ కనేరియా అన్నాడు.
పంత్ ఉండి ఉంటే కునెమాన్, లయన్ పని పట్టేవాడని కనేరియా స్పష్టం చేశాడు. లెఫ్టామ్ స్పిన్నర్ కునెమాన్ 5 వికెట్లు తీసిన విషయం తెలిసిందే. ఇలాంటి సందర్భాల్లో బౌలర్లపై ఎదురుదాడికి దిగే బ్యాటర్ ఏ జట్టుకైనా అవసరం. ఆ పని పంత్ చేసేవాడు. గతేడాది డిసెంబర్ లో రోడ్డు ప్రమాదంలో గాయపడిన పంత్.. ప్రస్తుతం కోలుకుంటున్న విషయం తెలిసిందే.
కనేరియా తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ.. పంత్ ను ఇండియన్ టీమ్ ఎలా మిస్ అవుతుందో చెప్పాడు. "ఈ స్పిన్నర్లతో ఎలా ఆడాలో రిషబ్ పంత్ ను అడిగితే అతడు చెప్పేవాడు. కాస్త ముందుకు వచ్చి బాల్ పిచ్ అవగానే దానిని బౌండరీ అవతలికి తరలించమని చెప్పేవాడు. అతడు ఉండి ఉంటే లయన్, కునెమాన్ లను వదిలేవాడు కాదు. వాళ్లపై అటాక్ చేసి వాళ్ల లెంత్స్ మార్చుకునేలా చేసేవాడు. ఇండియన్ బ్యాటర్లు నిరాశ పరిచారు" అని కనేరియా అన్నాడు.
ఇండియా సరిగా బ్యాటింగ్ చేసి ఉంటే మంచి స్కోరు సాధించే వాళ్లని అభిప్రాయపడ్డాడు. "ఇండియా సరిగా బ్యాటింగ్ చేసి తొలి ఇన్నింగ్స్ లో 250-300 రన్స్ చేయాల్సింది. వాళ్ల అనవసర షాట్లు ఇప్పుడు ఆస్ట్రేలియాకు పైచేయి సాధించి పెట్టాయి. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియాకు 80 శాతం గెలిచే అవకాశాలు ఉన్నాయి" అని కనేరియా స్పష్టం చేశాడు.
సంబంధిత కథనం