India vs Australia 3rd test: 12 పరుగులకే 6 వికెట్లు.. ఆస్ట్రేలియాకు కీలకమైన లీడ్
India vs Australia 3rd test: 12 పరుగులకే 6 వికెట్లు పడిపోయాయి. అయినా ఆస్ట్రేలియాకు కీలకమైన ఆధిక్యం లభించింది. ఇండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ప్రస్తుతం కంగారూలే పైచేయి సాధించారు.
India vs Australia 3rd test: ఇండోర్ టెస్ట్ రెండో రోజు ఉదయం సెషన్ లో ఇండియా బౌలర్లు చెలరేగారు. 12 పరుగులకే ఆస్ట్రేలియా టీమ్ చివరి ఆరు వికెట్లు తీశారు. దీంతో ఆ టీమ్ తొలి ఇన్నింగ్స్ లో 197 పరుగులకు ఆలౌటైంది. అయితే తొలి ఇన్నింగ్స్ లో కీలకమైన 88 పరుగుల ఆధిక్యం ఆ జట్టుకు లభించింది. తొలి రోజు 4 వికెట్లు తీసిన జడేజాకు రెండో రోజు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. అయితే ఉమేష్, అశ్విన్ చెరో మూడు వికెట్లతో చెలరేగారు.
ట్రెండింగ్ వార్తలు
రెండో రోజు ఉదయం తొలి గంటలో ఇండియా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది. ఆస్ట్రేలియా బ్యాటర్లు గ్రీన్, హ్యాండ్స్‌కాంబ్ స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్ కు 40 పరుగులు జోడించారు. ఈ దశలో అశ్విన్ వీళ్ల భాగస్వామ్యానికి తెరదించాడు. 19 పరుగులు చేసిన హ్యాండ్స్‌కాంబ్ ఔటయ్యాడు. అప్పటికే ఆస్ట్రేలియా స్కోరు 186.
అతడు ఔటవడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ గాడి తప్పింది. మిగిలిన వికెట్లు పేకమేడలా కూలాయి. ఓవైపు అశ్విన్, మరోవైపు ఉమేష్ చెలరేగి బౌలింగ్ చేశారు. ఇద్దరూ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. దీంతో ఆస్ట్రేలియా తన చివరి ఆరు వికెట్లను కేవలం 12 పరుగుల తేడాలో కోల్పోయి 197 పరుగులకే పరిమితమైంది. తొలి రోజు చెలరేగిన జడేజా.. రెండో రోజు ఉదయం తొలి గంటలో చాలానే ప్రయత్నించినా.. వికెట్ తీయలేకపోయాడు.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లో ఉస్మాన్ ఖవాజా 60 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. లబుషేన్ 31, స్మిత్ 26, గ్రీన్ 21 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా చివరి ఐదుగురు బ్యాటర్లలో ఒక్కరు కూడా రెండంకెల స్కోరు అందుకోలేదు. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా లంచ్ సమయానికి వికెట్ నష్టపోకుండా 13 పరుగులు చేసింది. రోహిత్, గిల్ క్రీజులో ఉన్నారు.