MS Dhoni Sixes: ధోనీ ఈజ్ బ్యాక్.. తన మార్క్ సిక్స్‌లతో అలరించిన మిస్టర్ కూల్
31 January 2023, 16:21 IST
MS Dhoni Sixes: ధోనీ ఈజ్ బ్యాక్ అనకుండా ఉండలేరు ఈ వీడియో చూసిన తర్వాత. ఈ మిస్టర్ కూల్ తన మార్క్ సిక్స్‌లతో అలరించాడు. ఐపీఎల్ 2023 కోసం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ మొదలుపెట్టిన ధోనీ.. నెట్స్ లో భారీ సిక్స్ లు బాదాడు.
ఎమ్మెస్ ధోనీ
MS Dhoni Sixes: మహేంద్ర సింగ్ ధోనీని ఎల్లో జెర్సీలో బహుశా చివరిసారి చూడబోతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్. వచ్చే ఐపీఎల్ తర్వాత మిస్టర్ కూల్ ఈ మెగా లీగ్ నుంచి కూడా తప్పుకునే అవకాశాలు ఉన్నాయి. గతేడాది పాయింట్ల టేబుల్లో 9వ స్థానంతో సరిపెట్టుకున్న ఆ టీమ్ ను ఈసారి విజేతగా నిలిపి విజయవంతంగా తన కెరీర్ ముగించాలని ధోనీ భావిస్తున్నాడు.
పైగా ఈసారి ఐపీఎల్ స్వదేశంలో జరుగుతుండటంతో చెన్నైలో సొంత ప్రేక్షకుల ముందు తన చివరి మ్యాచ్ ఆడాలని అతడు ఉవ్విళ్లూరుతున్నాడు. దీనికోసం అతడు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. నిజానికి ఐపీఎల్లో ఆడబోయే ప్లేయర్స్ లో చాలా మంది ఆయా నేషనల్ టీమ్స్ కు ఆడుతుండగా.. ధోనీ మాత్రం ఒంటరిగా ప్రాక్టీస్ చేస్తున్నాడు.
అంతేకాదు నెట్స్ లో తన మార్క్ సిక్స్ లు బాదుతూ కనిపించాడు. అతనికి స్పిన్నర్లు బౌలింగ్ చేస్తుండగా.. ధోనీ అవలీలగా వాటిని సిక్స్ లుగా మలిచాడు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. చాలా రోజుల తర్వాత ధోనీ మళ్లీ బ్యాట్ పట్టడం చూసి ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు.
2008 నుంచి చెన్నైసూపర్ కింగ్స్ టీమ్ కు కెప్టెన్ గా ఉన్న మహి.. గతేడాది సీజన్ మొదట్లో జడేజాకు కెప్టెన్సీ అప్పగించాడు. అతడు విఫలం కావడంతో కెప్టెన్సీ మళ్లీ ధోనీ చేతికి వచ్చింది. ఇప్పటి వరకూ కెరీర్ లో మొత్తం 234 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిన ధోనీ.. 4978 రన్స్ చేశాడు. అంతేకాదు 229 సిక్స్ లు కూడా బాదాడు.
ఇక ఈ కొత్త సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ను కూడా వేలంలో కొనుగోలు చేసింది. అతని కోసం చెన్నై ఫ్రాంఛైజీ రూ.16.25 కోట్లు వెచ్చించింది.
స్టోక్స్ రావడంతో చెన్నై బలం మరింత పెరిగింది. ధోనీ ఒకవేళ ఈ సీజన్ తర్వాత ఐపీఎల్ నుంచి కూడా రిటైరైతే.. స్టోక్సే భవిష్యత్తు కెప్టెన్ గా కనిపిస్తున్నాడు. గత వేలంలో స్టోక్స్ తో పాటు అజింక్య రహానే, కైల్ జేమీసన్ లాంటి ప్లేయర్స్ ను కొనుగోలు చేసింది.