Clarke About Whitewash Prediction: భారత్ చేతిలో ఆసీస్ వైట్ వాష్ అవుతుందని గంగూలీ జోస్యం.. క్లార్క్ షాకింగ్ రియాక్షన్
01 March 2023, 6:34 IST
- Clarke About Whitewash Prediction: టీమిండియా చేతిలో ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో వైట్ వాష్‌కు గురవుతుందని గంగూలీ జోస్యం చెప్పారు. తాజాగా ఈ అంశంపై మైఖేల్ క్లార్క్ స్పందించారు.
భారత్-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్
Clarke About Whitewash Prediction: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మూడో టెస్టు బుధవారం ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే భారత్ 2-0 తేడాతో ముందంజలో ఉండగా.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తోంది. మరోపక్క స్పిన్ పిచ్‌లపై పేలవ ప్రదర్శనతో ఆస్ట్రేలియా బ్యాటర్లు విఫలమవుతున్న నేపథ్యంలో సిరీస్‌ను భారత్ సులభంగా గెలిచేస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. భారత్ 4-0 తేడాతో సిరీస్ క్లీన్ స్వీప్ చేస్తుందని స్పష్టం చేశారు. తాజాగా గంగూలీ వ్యాఖ్యలపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ స్పందించారు. దాదా చెప్పిందే జరుగుతుందని జోస్యం చెప్పారు.
"ఆసీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేస్తుందా? అంటే అవుననే అంటాను. అది జరగకుండా ఆపడం ఎలాగో నాకు తెలియట్లేదు. ఇక్కడ సమస్య ఏంటంటే ప్రస్తుతం ఆసీస్ జట్టును పాత ఆస్ట్రేలియా జట్లతో పోల్చడమే. గతంలో టీమ్‌లు, ఇప్పుడు ఒకేలా లేదు. మ్యాథ్యూ హెడెన్, జస్టిన్ లాంగర్, రికీ పాంటింగ్, స్టీవ్ వా, మార్క్ వా, గిల్ క్రిస్ట్ లాంటి దిగ్గజ ప్లేయర్లు లేరు. అంత క్వాలిటీ ప్రస్తుతం జట్టులో లేదు." అని క్లార్క్ స్పష్టం చేశారు.
"స్టీవ్ స్మిక్ గొప్ప ఆటగాడు. వార్నర్ సరిగ్గా రాణించలేదు. లబుషేన్ మంచి ఆటగాడే కానీ అతడి ఈ పరిస్థితులు కఠినంగా మారాయి. ఆస్ట్రేలియా అనగానే స్టీవ్ వా లీడ్ చేసిన ఆసీస్ జట్టే గుర్తుకువస్తుంది. అయితే ప్రస్తుతం అలా లేదు. వేర్వేరు పరిస్థితుల్లో వేర్వేరు ఆటగాళ్లు విభిన్నంగా పరీక్షను ఎదుర్కొంటారు" అని క్లార్క్ తెలిపారు. ఇదే సమయంలో గంగూలీ 4-0 స్టేట్మెంట్‌పై కూడా క్లార్క్ స్పందించారు.
2-0తో వెనకబడిన ఆస్ట్రేలియా మిగిలిన రెండు టెస్టుల్లో పుంజుకోగలదని ఆశీస్తున్నాను. అలా చేయకపోతే ప్రతి ఆస్ట్రేలియన్ అభిమానికి ఇది చాలా నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. సౌరవ్ గంగూలీ 4-0తో ఓడుతుందని ఎందుకు అంచనా వేశాడో నాకు అర్థమైంది. అని క్లార్క్ అన్నారు.
భారత పర్యటనకు ముందుగానే ఆస్ట్రేలియా రావాల్సిందని, అలా కాకుండా ప్రాక్టీస్ సెషన్ కూడా లేకుండా బరిలో దిగడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని క్లార్క్ అన్నారు.
"భారత పర్యటనకు ప్రాక్టీస్ సెషన్ లేకుండా రావడం ఎవరి ఐడియానో నాకు తెలియదు. ఒకవేళ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ది అయినా సరే ఈ విధానం సరికాదు. భారత్‌కు ఆసీస్ ముందే రావాల్సింది. ఇక్కడ పరిస్థితులకు తగినట్లు ప్రిపరేషన్ లేకుండా బరిలోకి దిగడం కరెక్ట్ కాదు. భారత్‌కు రాకపోయనా కనీసం యూఏఈలోనైనా ప్రాక్టీస్ చేయాల్సింది. టూర్ గేమ్ ఆడటం వల్ల ఏం కాదు. ముఖ్యంగా భారత్ పర్యటనలో ఇలా చేయడం తప్పే. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పిచ్‌ల్లో సీమర్లు బౌన్స్‌ను ఊహించవచ్చు. కానీ స్పిన్‌లో అలా ఉండదు. సరైన శిక్షణ లేకుండా గెలవాలనుకోవడం అసాధ్యం." అని క్లార్క్ తెలిపారు.
బుధవారం నుంచి టీమిండియా ఆస్ట్రేలియాతో మూడో టెస్టు ఆడనుంది. ఇండోర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానుంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది.