Ganguly on Pant: రిషబ్ పంత్ మళ్లీ ఇండియాకు ఆడటానికి రెండేళ్లు పట్టొచ్చు: గంగూలీ
Ganguly on Pant: రిషబ్ పంత్ మళ్లీ ఇండియాకు ఆడటానికి రెండేళ్లు పట్టొచ్చని అన్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ కూడా అయిన దాదా.. సోమవారం (ఫిబ్రవరి 27) పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
Ganguly on Pant: ఇండియన్ టీమ్ ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ లో రిషబ్ పంత్ ను చాలా మిస్ అవుతోంది. తాజాగా జరుగుతున్న ఇండియా, ఆస్ట్రేలియా సిరీస్ లో పంత్ లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది. అయితే గతేడాది డిసెంబర్ లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్.. మళ్లీ ఇండియన్ టీమ్ కు ఆడటానికి రెండేళ్లు పట్టొచ్చని చెప్పాడు టీమిండియా మాజీ కెప్టెన్, ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ.
పీటీఐకి అతడు సోమవారం (ఫిబ్రవరి 27) ఇచ్చిన ఇంటర్వ్యూలో పంత్ కు సంబంధించి కొన్ని వివరాలు వెల్లడించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ లోనూ పంత్ లేని లోటు పూడ్చడం చాలా కష్టమని చెప్పాడు. ప్రమాదం జరిగిన తర్వాత తాను కొన్నిసార్లు పంత్ తో మాట్లాడినట్లు కూడా గంగూలీ తెలిపాడు.
"రెండు, మూడుసార్లు పంత్ తో మాట్లాడాను. అతడు క్లిష్టమైన దశను ఎదుర్కొంటున్నాడు. గాయాలు, సర్జరీలు చేయించుకుంటున్నాడు. అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఏడాది లేదంటే రెండేళ్లలో అతడు ఇండియన్ టీమ్ కు ఆడే అవకాశం ఉంది" అని గంగూలీ చెప్పాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ రిషబ్ పంత్ కు ఇంకా ప్రత్యామ్నాయాన్ని చూడలేదు. అభిషేక్ పొరెల్ లేదంటే షెల్డన్ జాక్సన్ తో పంత్ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది. దీనికి మరికొంత సమయం అవసరమని, ఐపీఎల్ ప్రారంభానికి ముందు మరో క్యాంప్ ఏర్పాటు చేస్తామని గంగూలీ వెల్లడించాడు.
ఇక పంత్ లేకపోవడంతో కొత్త కెప్టెన్ ని కూడా ఎంపిక చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీనికి ఆస్ట్రేలియా ప్లేయర్ డేవిడ్ వార్నర్ ఉన్నాడు. అతనికే కెప్టెన్సీ దక్కే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఢిల్లీ టీమ్ కోల్‌కతాలో మూడు రోజుల క్యాంప్ ఏర్పాటు చేసింది. ఇందులో పృథ్వీ షా, ఇషాంత్ శర్మ, చేతన్ సకారియా, మనీష్ పాండేలాంటి ప్లేయర్స్ పాలుపంచుకున్నారు.
"ఐపీఎల్ కు ఇంకా నెల సమయం ఉంది. సీజన్ ఇప్పుడే ప్రారంభమైంది. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ లో క్రికెటర్లందరినీ ఒక్కచోటుకు తీసుకురావడం అంత సులువు కాదు. నలుగురైదుగురు ఇరానీ ట్రోఫీ ఆడుతున్నారు. సర్ఫరాజ్ ఖాన్ కు గాయమైంది. అయితే అతడు ఐపీఎల్ సమయానికి కోలుకునే అవకాశం ఉంది" అని గంగూలీ చెప్పాడు.
సంబంధిత కథనం