తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Messi Jersey: ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మెస్సీ వేసుకున్న జెర్సీలకు రూ.65 కోట్లు

Messi Jersey: ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మెస్సీ వేసుకున్న జెర్సీలకు రూ.65 కోట్లు

Hari Prasad S HT Telugu

15 December 2023, 14:21 IST

google News
    • Messi Jersey: ఫుట్‌బాల్ వరల్డ్ కప్ 2022లో అర్జెంటీనా స్టార్ ప్లేయర్, కెప్టెన్ లియోనెల్ మెస్సీ వేసుకున్న జెర్సీలకు వేలంలో రికార్డు ధర పలికింది. అతని ఆరు జెర్సీలకు ఏకంగా రూ.65 కోట్లు రావడం విశేషం.
వరల్డ్ కప్ 2022లో లియెనెల్ మెస్సీ వేసుకున్న జెర్సీలు
వరల్డ్ కప్ 2022లో లియెనెల్ మెస్సీ వేసుకున్న జెర్సీలు (AP)

వరల్డ్ కప్ 2022లో లియెనెల్ మెస్సీ వేసుకున్న జెర్సీలు

Messi Jersey: అర్జెంటీనాకు మూడున్నర దశాబ్దాల తర్వాత మరోసారి ఫుట్‌బాల్ వరల్డ్ కప్ సాధించి పెట్టిన కెప్టెన్ లియోనెల్ మెస్సీ జెర్సీలకు వేలంలో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. గతేడాది జరిగిన వరల్డ్ కప్ లో మెస్సీ వేసుకున్న జెర్సీలను గురువారం (డిసెంబర్ 14) వేలం వేశారు. ఈ వేలంలో ఆరు జెర్సీలకు ఏకంగా 78 లక్షల డాలర్లు (సుమారు రూ.65 కోట్లు) రావడం విశేషం.

ప్రపంచ క్రీడల చరిత్రలో మూడోో అత్యధిక ధర పలికిన జెర్సీగా నిలిచింది. అంతేకాదు గతంలో వేలం వేసిన లియెనెల్ మెస్సీ ఐటెమ్స్ అన్నింటి కంటే ఎక్కువ ధర కూడా ఇదే కావడం గమనార్హం. ప్రముఖ వేలం సంస్థ సోథేబీ ఈ జెర్సీల వేలం నిర్వహించింది. ఈ ఆరు జెర్సీల్లో ఒక దానిని వరల్డ్ కప్ ఫైనల్లో మెస్సీ వేసుకున్నాడు. ఆరు జెర్సీల సెట్ కు వేలంలో ఈ భారీ మొత్తం లభించింది.

గతేడాది జరిగిన వరల్డ్ కప్ ఫస్ట్ హాఫ్ లో అర్జెంటీనా ఆడిన మ్యాచ్ లలో మెస్సీ వేసుకున్న జెర్సీలు ఇందులో ఉన్నాయి. నిజానికి ఈ జెర్సీలు అత్యధిక ధరకు అమ్ముడుపోయి గతంలోని రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తుందని సోథేబీ భావించింది. ప్రస్తుతం ఈ రికార్డు మైఖేల్ జోర్డాన్ జెర్సీ పేరిట ఉంది. అతడు 1998 ఎన్‌బీఏ ఫైనల్స్ లో వేసుకున్న జెర్సీని గతేడాది వేలం వేయగా.. ఏకంగా 1.01 కోట్ల డాలర్ల ధర పలికింది.

ఇక రెండో స్థానంలో ఫుట్‌బాల్ లెజెండ్ డీగో మారడోనా 1986 వరల్డ్ కప్ ఫైనల్లో వేసుకున్న జెర్సీ నిలిచింది. ఈ జెర్సీని గతేడాది మేలో వేలం వేయగా.. 92.8 లక్షల డాలర్లు పలికింది. 1986లో మారడోనా అర్జెంటీనాకు తొలి వరల్డ్ కప్ అందించాడు. ఆ తర్వాత 36 ఏళ్లకు అంటే 2022లో మరోసారి కెప్టెన్ గా మెస్సీ రెండో వరల్డ్ కప్ సాధించి పెట్టాడు.

గతేడాది ఫైనల్లో మెస్సీ రెండు గోల్స్ చేశాడు. మెస్సీ ఇప్పటికే రికార్డు స్థాయిలో 8 బ్యాలన్ డోర్ అవార్డులను కూడా గెలుచుకున్న విషయం తెలిసిందే. 20 ఏళ్లుగా అతడు తన నేషనల్ టీమ్ అర్జెంటీనాతోపాటు బార్సిలోనా, పారిస్ సెయింట్-జెర్మేన్, ఇంటర్ మియామీ క్లబ్ లకు ఆడాడు.

తదుపరి వ్యాసం