IPL: మహిళల ఐపీఎల్.. బీసీసీఐకి ఓ సూపర్ ఐడియా ఇచ్చిన లలిత్ మోదీ
18 June 2022, 21:41 IST
- ఐపీఎల్ అనే మనీ బ్యాంక్‌ను బీసీసీఐకి అందించి, తర్వాత ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో దేశం వదిలి పారిపోయిన లలిత్ మోదీ ఇప్పుడు మహిళల ఐపీఎల్‌పై బీసీసీఐకి ఓ కీలకమైన సూచన చేశాడు.
ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ
లండన్: లలిత్ మోదీ.. ఈ పేరు 15 ఏళ్ల కిందట ఓ సంచలనం. ఇప్పుడు బీసీసీఐపై కాసుల వర్షం కురిపిస్తున్న ఐపీఎల్‌కు తొలి ఛైర్మన్ అతడు. 2008 నుంచి 2010 వరకూ ఐపీఎల్ సీఈవోగా, బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నాడు. అయితే ఆ తర్వాత ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డాడంటూ అతనిపై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. ఇక్కడి కేసులను తప్పించుకునేందుకు అతడు దేశం వదిలి వెళ్లిపోయాడు.
అయితే తాజాగా అతడు ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. మహిళల ఐపీఎల్ ప్రారంభించాలని చూస్తున్న బీసీసీఐకి ఓ కీలకమైన సూచన చేయడం గమనార్హం. ఇప్పుడు ఐపీఎల్‌లో ఉన్న ప్రతి ఫ్రాంఛైజీకి ఒక మహిళల టీమ్ కచ్చితంగా ఉండాలన్న నిబంధన విధించాలని, అలా అయితే మహిళల ఐపీఎల్‌ను కూడా పూర్తి స్థాయిలో ప్రారంభించవచ్చని అతడు చెప్పాడు.
"ఈ ఏడాది ఎక్కువగా మహిళల ఐపీఎల్ మ్యాచ్‌లు చూడలేదు. అయితే ప్రతి ఫ్రాంఛైజీకి ఒక మహిళల టీమ్ ఉండాలన్న నిబంధన పెడితే బాగుంటుంది. ఒక ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఓనర్ మహిళల టీమ్ కలిగి ఉంటే.. ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ బెంచ్ స్ట్రెంత్ చాలా పెరుగుతుంది. ఇప్పటికే బాగా డబ్బు సంపాదిస్తున్న ఓనర్లు మహిళల క్రికెట్‌లో పెట్టుబడి పెడితే బాగుంటుంది" అని లలిత్ మోదీ అన్నాడు.
ప్రతి టీమ్ డబ్బు సంపాదిస్తున్న ఏకైక లీగ్ ప్రపంచంలో ఇదొక్కటే కావచ్చు అని అతను అభిప్రాయపడ్డాడు. కొత్తగా వచ్చిన రెండు టీమ్స్ తప్పి మిగతా అన్ని టీమ్స్ లాభాల్లో ఉన్నాయని అన్నాడు. ఇక రాబోయే కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల క్రికెట్‌ను చేర్చడంపై హర్షం వ్యక్తం చేశాడు.