IPL Media Rights: రూ.48390 కోట్లలో ప్లేయర్స్, ఫ్రాంఛైజీలకు దక్కేదెంత?
15 June 2022, 12:33 IST
- ఐపీఎల్ ఇప్పుడు ప్రపంచంలోనే రెండో అత్యంత విలువైన లీగ్. తాజాగా నిర్వహించిన మీడియా హక్కుల వేలంలో ఐపీఎల్ ఒక్కో మ్యాచ్ విలువ రూ. 118.02 కోట్లకు చేరడం విశేషం.
ఐపీఎల్ 2022 ఛాంపియన్స్ గుజరాత్ టైటన్స్
న్యూఢిల్లీ: ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత ఈ 15 ఏళ్లలో ఇండియన్స్‌కు బోరింగ్ సమ్మర్ అంటే ఏంటో తెలియకుండా పోయింది. అంతలా ప్రతి ఇంట్లో ఓ మంచి ఎంటర్‌టైన్‌మెంట్ సాధనంగా మారింది. ప్రతి ఏటా అభిమానుల సంఖ్యను పెంచుకుంటూ వెళ్తున్న ఈ మెగా లీగ్ అందుకు తగినట్లే తన బ్రాండ్ వాల్యూనూ పెంచుకుంటోంది. తాజాగా నిర్వహించిన మీడియా హక్కుల వేలం ద్వారా బీసీసీఐకి ఏకంగా రూ.48390 కోట్లు వచ్చాయంటే ఈ లీగ్ పవరేంటో అర్థం చేసుకోవచ్చు.
ఐదేళ్ల కిందట 2017-22 మధ్య ఐదేళ్ల కాలానికి డిస్నీ స్టార్ టీవీ, డిజిటల్ హక్కుల కోసం చెల్లించిన మొత్తం రూ.16348 కోట్లు మాత్రమే. ఆ లెక్కన ఇప్పుడు ఆ మొత్తం సుమారు మూడు రెట్లు పెరిగింది. ఇది ఇండియన్ క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన క్షణం అని అందుకే బీసీసీఐ కార్యదర్శి జే షా అన్నారు. అయితే ఈ మీడియా హక్కుల ద్వారా వచ్చిన ఇంత భారీ మొత్తంతో ఏం చేస్తారు? ఇందులో ప్లేయర్స్‌కు, ఫ్రాంఛైజీలు, బీసీసీఐకి దక్కేదెంత అన్న సందేహాలు చాలా మందికి ఉన్నాయి.
సగం ఫ్రాంఛైజీలకే..
ఈ రూ.48390 కోట్లలో సగం మొత్తం ఫ్రాంఛైజీలకే వెళ్తుంది. లీగ్‌లో మొదటి నుంచీ ఉన్న ఎనిమిది ఫ్రాంఛైజీలు ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీలకు సమానంగా పంచుతారు. కొత్తగా వచ్చిన ఫ్రాంఛైజీలు లక్నో, గుజరాత్‌లకు ఈ పాత ఫ్రాంఛైజీల స్థాయిలో దక్కడానికి మరికాస్త సమయం పడుతుంది. ఆ లెక్కన పాత 8 ఫ్రాంఛైజీలు ఒక్కోదానికి సుమారు రూ.3 వేల కోట్లు దక్కనున్నాయి.
మిగతా సగం ప్లేయర్స్, అసోసియేషన్లకు..
ఇక మిగిలిన సగం అంటే రూ.24,195 కోట్లను ప్లేయర్స్, రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు పంచుతారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన రిపోర్ట్ ప్రకారం.. ఈ రూ.24195 కోట్లలో 26 శాతం వాటా అంతర్జాతీయ, దేశవాళీ క్రికెటర్లకు దక్కుతుంది. మిగతా 74 శాతంలో ఓ నాలుగు శాతం సిబ్బంది జీతాల కోసం పక్కన పెట్టి మిగతా మొత్తాన్ని రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు ఇస్తారు. అంటే మొత్తంగా ప్లేయర్స్‌కు సుమారు రూ.6 వేల కోట్లు దక్కే అవకాశం ఉంది.