IPL Media Rights: ఐపీఎల్ కొత్త రికార్డు అందుకుంది.. వేలంతో భారీ మొత్తం: జే షా
14 June 2022, 19:55 IST
- ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా లీగ్ కొత్త ఎత్తులను అందుకున్నట్లు ప్రకటించారు బీసీసీఐ కార్యదర్శి జే షా. మంగళవారం సాయంత్రం వరుస ట్వీట్లలో వేలం విశేషాలను వెల్లడించారు.
టాటా ఐపీఎల్ ట్రోఫీ
న్యూఢిల్లీ: ఐపీఎల్ కొత్త రికార్డును అందుకుంది. మీడియా హక్కుల వేలంలో ఒక్కో మ్యాచ్‌కు వచ్చిన మొత్తం ద్వారా ఇప్పుడు ప్రపంచంలోనే రెండో అత్యంత విలువైన లీగ్‌గా నిలిచింది. మూడు రోజుల పాటు సాగిన ఈ మీడియా హక్కుల ఈ-వేలానికి సంబంధించిన వివరాలను బీసీసీఐ సెక్రటరీ జే షా మంగళవారం అధికారికంగా వెల్లడించారు. 2023-2027 మధ్య ఐదు సీజన్ల కోసం ఈ మీడియా హక్కుల వేలం జరిగింది.
ఈ వేలం ద్వారా మొత్తం రూ.48390 కోట్లు వచ్చినట్లు జే షా తెలిపారు. గత ఐదేళ్ల కాలానికి స్టార్ టీవీ, డిజిటల్ హక్కుల కోసం చెల్లించిన మొత్తం కంటే ఇది మూడు రెట్లు కావడం గమనార్హం. ఈసారి టీవీ హక్కులను డిస్నీ స్టార్ నిలబెట్టుకోగా.. డిజిటల్ హక్కులు మాత్రం రిలయెన్స్‌కు చెందిన వయాకామ్18కు దక్కాయి. ఈసారి టీవీ హక్కుల కంటే డిజిటల్ హక్కులే ఎక్కువ ధర పలకడం విశేషం.
"ఇండియా టీవీ హక్కులను స్టార్ ఇండియా ఇండియా రూ.23,575 కోట్లకు దక్కించుకుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. రెండేళ్లపాటు మహమ్మారి వేధించినా.. ఇలాంటి బిడ్ రావడం బీసీసీఐ సంస్థాగత సామర్థ్యానికి నిదర్శనం. ఐపీఎల్ ప్రారంభం నుంచీ వృద్ధి సాధిస్తూనే ఉంది. ఇవాళ ఇండియన్ క్రికెట్ మరచిపోలేని రోజు. బ్రాండ్ ఐపీఎల్ కొత్త ఎత్తులను అందుకుంది. ఈ-వేలం ద్వారా రూ.48,390 కోట్లు వచ్చాయి. మ్యాచ్ విలువ పరంగా ఇప్పుడు ఐపీఎల్ ప్రపంచంలో రెండో అత్యంత విలువైన లీగ్" అని జే షా ట్వీట్ చేశారు.
"ఇక ఇప్పుడు, అభిమానుల ఎక్స్‌పీరియన్స్‌ను పెంచడం మన రాష్ట్ర అసోసియేషన్లు, ఐపీఎల్ ఫ్రాంఛైజీల చేతుల్లో ఉంది. క్రికెట్ ఫ్యాన్‌కు ప్రపంచస్థాయి సౌకర్యాలతో హై క్వాలిటీ క్రికెట్‌ను ఎంజాయ్ చేసేలా క్రికెట్ ఫ్యాన్‌ను చూసుకోవాలి" అని జే షా మరో ట్వీట్‌లో అన్నారు. ఐపీఎల్ ద్వారా వచ్చిన మొత్తాన్ని దేశవాళీ క్రికెట్‌ను కిందిస్థాయి నుంచి పటిష్టపరచడానికి ఉపయోగిస్తామని షా చెప్పారు.
ఇక డిజిటల్ హక్కులను వయాకామ్18 రూ.23,758 కోట్లకు దక్కించుకున్నట్లు షా వెల్లడించారు. ఇండియా డిజిటల్ విప్లవాన్ని చూసిందని, ఈ డిజిటల్ వేదిక క్రికెట్‌ను చూసే విధానాన్నే మార్చేసిందని షా అన్నారు.