Asia Cup 2022: అప్పటికి ఇప్పటికి చాలా మారింది.. పాక్‌తో మ్యాచ్‌పై రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
17 August 2022, 21:19 IST
- Asia Cup 2022: ఆసియాకప్‌లో పాకిస్థాన్‌తో జరగబోయే మ్యాచ్‌పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. గత టీ20 వరల్డ్‌కప్‌లో ఓటమిపై స్పందిస్తూ.. అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయిందని అన్నాడు.
ముంబైలో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్ లో మాట్లాడుతున్న రోహిత్ శర్మ
న్యూఢిల్లీ: చాలా రోజుల తర్వాత ఆసియా కప్‌లో భాగంగా ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్‌పై ఎంతో బజ్ క్రియేట్ కాగా.. ఇప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా స్పందించాడు. గతేడాది వరల్డ్‌కప్‌లో చివరిసారి పాకిస్థాన్‌తో తలపడినప్పుడు ఇండియా ఓడిపోయింది. వరల్డ్‌కప్‌లలో పాక్ చేతిలో ఇండియా ఓడటం అదే తొలిసారి. అయితే అప్పటికి ఇప్పటికి ఎంతో మారిపోయిందని, ఇండియా ఇప్పుడు పూర్తి భిన్నమైన క్రికెట్ ఆడుతోందని రోహిత్ అన్నాడు.
"చాలా రోజుల తర్వాత ఆసియా కప్ జరుగుతోంది. కానీ పాకిస్థాన్‌తో గతేడాదే దుబాయ్‌లో ఆడాము. అందులో ఫలితం మాకు అనుకూలంగా రాలేదు. కానీ ఇప్పుడు ఆసియా కప్ భిన్నమైనది. ఇప్పుడు టీమ్ భిన్నంగా ఆడుతోంది. భిన్నంగా సిద్ధమైంది. చాలా మార్పులు జరిగాయి" అని రోహిత్ అన్నాడు. బుధవారం (ఆగస్ట్ 17) ముంబైలో జరిగిన ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో మాట్లాడిన రోహిత్ ఈ కామెంట్స్ చేశాడు.
అయితే దుబాయ్‌లో 40 డిగ్రీల వేడిలో తాము ఆడబోతున్నామని, అక్కడి కండిషన్స్‌ను సరిగ్గా అంచనా వేయడం ముఖ్యమని రోహిత్ చెప్పాడు. గతేడాది పాకిస్థాన్, న్యూజిలాండ్‌ల చేతుల్లో ఓటములతో ఇండియా వరల్డ్ కప్ తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. అయితే ఆ తర్వాత రోహిత్ చెప్పినట్లు ఇండియన్ క్రికెట్‌లో చాలా మార్పులు వచ్చాయి. రోహిత్ కెప్టెన్సీలో ఇండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది.
వరల్డ్‌కప్ తర్వాత ఇండియా వరుసగా 7 సిరీస్‌లు గెలిచింది. కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే ఓడిపోయింది. ఇక ఆసియాకప్‌లో తాము ప్రత్యర్థి ఎవరనేది కాకుండా తమ ప్లాన్స్‌ను సరిగ్గా అమలు చేయడంపైనే దృష్టి సారిస్తామని రోహిత్ చెప్పాడు. పాకిస్థాన్ అయినా, శ్రీలంక లేదా బంగ్లాదేశ్ అయినా ప్రత్యర్థి గురించి ఆలోచించకుండా తమ ఆట తాము ఆడతామని స్పష్టం చేశాడు.