Kylian Mbappe: రూ.2700 కోట్లు వద్దనుకున్నాడు.. సౌదీ క్లబ్‌కు నో చెప్పిన స్టార్ ఫుట్‌బాలర్
27 July 2023, 11:42 IST
- Kylian Mbappe: రూ.2700 కోట్లు వద్దనుకున్నాడు స్టార్ ఫుట్‌బాలర్ కైలియన్ ఎంబాపె. సౌదీ క్లబ్‌కు నో చెప్పాడతడు. పీఎస్‌జీ క్లబ్ లో చివరి ఏడాదిలోకి అడుగుపెట్టిన అతడు.. తర్వాత ఏ క్లబ్ లోకి వెళ్తాడన్నది ఇంట్రెస్టింగా మారింది.
ఫ్రాన్స్ స్టార్ ఫుట్‌బాలర్ కైలియన్ ఎంబాపె
Kylian Mbappe: ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన బిడ్ ను ఎవరైనా వద్దనుకుంటారా? కానీ ఫ్రెంచ్ స్టార్ కైలియన్ ఎంబాపె మాత్రం సౌదీ క్లబ్ అల్ హిలాల్ ఇచ్చిన వరల్డ్ రికార్డు ఆఫర్ ను వదులుకున్నాడు. అతనికి ఏకంగా 33.2 కోట్ల డాలర్లు (సుమారు రూ.2700 కోట్లు) చెల్లించడానికి ఈ క్లబ్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
ఈ డీల్ ఫైనల్ చేయడానికి అల్ హిలాల్ అధికారులు పారిస్ కు వెళ్లారు. అయితే ఎంబాపె మాత్రం సంతకం కాదు కదా.. కనీసం వాళ్లను కలవనే లేదు. తనకు ఈ క్లబ్ లో చేరే ఆసక్తి లేదని అతడు తేల్చేశాడు. సీజన్ ముగిసిన తర్వాత ప్రస్తుతం తాను ఉన్న పారిస్ సెయింట్-జెర్మేన్ (పీఎస్‌జీ)తో ఒప్పందం ముగుస్తుంది. ఆ తర్వాత ఫ్రీ ఏజెంట్ గా మారాలని ఎంబాపె భావిస్తున్నాడు.
రియల్ మాడ్రిడ్ టీమ్ లో చేరాలన్నది ఎంబాపె టార్గెట్. ఒకవేళ ఫ్రీ ట్రాన్స్‌ఫర్ లో అతడు రియల్ మాడ్రిడ్ టీమ్ లోకి వెళ్తే 10 కోట్ల యూరోలు (సుమారు రూ.900 కోట్లు) సైనింగ్ ఆన్ ఫీగా లభిస్తాయి. ఒకవేళ పీఎస్‌జీతోనే కొనసాగాలని భావిస్తే సెప్టెంబర్ లో అతనికి బోనస్ గా 8 కోట్ల యూరోలు (సుమారు రూ.727 కోట్లు) వస్తాయి.
మరోవైపు పీఎస్‌జీ టీమ్ మాత్రం ఎంబాపెను ఇప్పుడే వదిలేసుకొని అతనిపై కాస్త డబ్బు సంపాదించాలని చూస్తోంది. ఏడాది కాలంలో కాంట్రాక్ట్ ముగిసన తర్వాత ఫ్రీగా వదిలేయడం కంటే.. ఇదే బెటరని ఆ క్లబ్ భావిస్తోంది. ట్రాన్స్‌ఫర్ ఫీజుపై ప్రస్తుతానికి పీఎస్‌జీ, అల్ హిలాల్ మధ్య ఎలాంటి ఒప్పందం కుదరలేదు.
నిజానికి అల్ హిలాల్ టీమ్ గతంలో లియోనెల్ మెస్సీ కోసం కూడా గట్టిగానే ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అతడు ఇంటర్ మియామీ క్లబ్ తరఫున ఆడుతున్నాడు. ఇప్పుడు పీఎస్‌జీ నుంచి ఎంబాపెను అయినా దక్కించుకోవాలని ఆరాటపడుతోంది.
టాపిక్