Kylian Mbappe: కనీవినీ ఎరగని రికార్డ్.. కైలియన్ ఎంబాప్పె కోసం సౌదీ క్లబ్ కళ్లు చెదిరే బిడ్
Kylian Mbappe: కనీవినీ ఎరగని రికార్డ్ ఇది. ఫ్రాన్స్ స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ కైలియన్ ఎంబాప్పె కోసం సౌదీ క్లబ్ భారీ బిడ్ దాఖలు చేసింది. ఇది వరల్డ్ రికార్డు బిడ్ కావడం విశేషం.
Kylian Mbappe: ఫ్రాన్స్ సూపర్ స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ కైలియన్ ఎంబాప్పె కోసం సౌదీ ప్రొ లీగ్ క్లబ్ అల్ హిలాల్ భారీ బిడ్ దాఖలు చేసింది. ఈ విలువ 33.2 కోట్ల డాలర్లు (సుమారు రూ.2700 కోట్లు) కావడం విశేషం. ప్రస్తుతం పారిస్ సెయింట్-జెర్మేన్ తో ఉన్న ఎంబాప్పె కాంట్రాక్ట్ చివరి ఏడాదికి చేరింది. అతడు ఆ క్లబ్ వదలడం ఖాయమన్న వార్తల నేపథ్యంలో సౌదీ క్లబ్ ఈ వరల్డ్ రికార్డు బిడ్ వేయడం విశేషం.
గత కొన్ని నెలలుగా ఎంబాప్పె ట్రాన్స్‌ఫర్ పై వార్తలు వస్తున్నాయి. 2018 వరల్డ్ కప్ ఫ్రాన్స్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన ఈ 24 ఏళ్ల ప్లేయర్ కు 9.48 కోట్ల యూరోల నుంచి 15.7 కోట్ల యూరోలు పలుకుతాడన్న అంచనాలు ఉన్నాయి. అంటే మన కరెన్సీలో గరిష్ఠంగా సుమారు రూ.1400 కోట్లు. కానీ సౌదీ క్లబ్ మాత్రం దాదాపు అంతకు రెట్టింపు ధర ఆఫర్ చేస్తుండటం విశేషం.
ఈ భారీ బిడ్ తో ఎంబాప్పెను సౌదీ క్లబ్ అట్రాక్ట్ చేస్తోంది. అయితే ఈ క్లబ్ తోపాటు రియల్ మాడ్రిడ్, చెల్సీ, న్యూకాజిల్ లాంటి క్లబ్స్ కూడా అతని కోసం ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతానికైతే అల్ హిలాల్, ఎంబాప్పె ప్రతినిధుల మధ్య ఎలాంటి చర్చలూ జరగలేదు. అటు పీఎస్‌జీ కూడా వచ్చే ఏడాది ఎంబాప్పె ఫ్రీ ట్రాన్స్‌ఫర్ వరకూ వేచి చూడకుండా.. ఇప్పుడే అతన్ని అమ్మేసుకోవాలని చూస్తోంది.
ఆ క్లబ్ చెబుతున్నదాని ప్రకారం ఎంబాప్పె ఇప్పటికే రియల్ మాడ్రిడ్ తో డీల్ కుదుర్చుకున్నాడని, 2024లో అతడు స్పెయిన్ కు వెళ్తాడని తెలిసింది. ఎంబాప్పెకు ఉన్న హై డిమాండ్ మేరకు అతన్ని అమ్మాకానికి పెట్టి క్యాష్ చేసుకోవాలని పీఎస్‌జీ భావిస్తోంది. ఇప్పుడు అల్ హిలాల్ బిడ్ కు ఓకే చెబితే ఎంబాప్పెపై పీఎస్‌జీ కనీసం 10 కోట్ల యూరోల లాభం ఆర్జిస్తుంది.
2018లో అతన్ని 16.2 కోట్ల యూరోలకు పీఎస్‌జీ కొనుగోలు చేసింది. అయితే కైలియన్ ఎంబాప్పె భవిష్యత్తుపై ఇంకా స్పష్టత రాలేదు. అతడు సౌదీ క్లబ్ ఆఫర్ అంగీకరిస్తాడా లేక రియల్ మాడ్రిడ్ కు వెళ్తాడా అన్నది చూడాలి.
టాపిక్