RR vs RCB | తల్లి అనారోగ్యంగా ఉన్నా.. అద్భుతంగా ఆడాడు.. అతడిపై సంగాక్కర ప్రశంసలు
28 May 2022, 17:39 IST
- రాజస్థాన్ రాయల్స్ బౌలర్ ఓబెడ్ మెకాయ్‌పై ఆ జట్టు హెడ్ కోచ్ సంగాక్కర ప్రశంసల వర్షం కురిపించాడు. అతడి తల్లికి ఆరోగ్యం బాగోలేకపోయినా.. అద్భుతంగా బౌలింగ్ చేశాడని కితాబిచ్చాడు. ఈ మ్యాచ్‌లో బెంగళూరుపై రాజస్థాన్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
సంగాక్కర
ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు షాకిస్తూ రాజస్థాన్ రాయల్స్ ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బట్లర్ అద్భుత శతకంతో విజృంభించిన వేళ రాజస్థాన్ తుదిపోరులో గుజరాత్‌తో తలపడనుంది. అయితే బెంగళూరుతో జరిగిన ఈ మ్యాచ్‌లో మరో ప్లేయర్ కూడా అద్భఉత ప్రదర్శన చేశాడు. అతడే ఓబెడ్ మెకాయ్. కేవలం 23 పరుగులిచ్చి 3 కీలక వికెట్లను పడగొట్టిన అతడు ఆర్సీబీని తక్కువ స్కోరుకే పరిమితం చేయడం సఫలీకృతుడయ్యాడు. దీంతో అతడిపై రాజస్థాన్ హెడ్ కోచ్ కుమార సంగాక్కర ప్రశంసల వర్షం కురిపించాడు. అతడి తల్లి అనారోగ్యంగా ఉన్నా.. నిబద్ధతతో(Commitment) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడని కితాబిచ్చాడు.
"వెస్టిండీస్‌లో ఓబెడ్ మెకాయ్ తల్లి అనారోగ్యంతో ఉంది. తల్లికి ఆరోగ్యం బాగా లేకపోయినా.. అతడు తన దృష్టంతా గేమ్‌పైనే పెట్టాడు. అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతడి నిబద్ధతకు సెల్యూట్ చెబుతున్నాను" అని కుమార సంగాక్కర ప్రశంసించాడు.
బెంగళూరుతో జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 157 పరుగులే చేయగలిగింది. ఓబెడ్ మెకాయ్ కేవలం 23 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో మెకాయ్‌తో పాటు ప్రసిధ్ కృష్ణ కూడా 3 వికెట్లు తీయగా.. బౌల్ట్, అశ్విన్ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నారు. అనంతరం లక్ష్యాన్ని రాజస్థాన్ సునాయసంగా ఛేదించింది. బట్లర్ అద్భుతమైన శతకంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ సీజన్‌లో అతడికి ఇది నాలుగో సెంచరీ.
జోస్ బట్లర్ 60 బంతుల్లో 106 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఫలితంగా రాజస్థాన్ మరో 11 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. 2008 తర్వాత రాజస్థాన్ ఐపీఎల్ ఫైనల్‌కు చేరడం ఇదే మొదటి సారి. ఐపీఎల్ ఆరంభం సీజన్‌లో టైటిల్ నెగ్గిన ఈ జట్టుకు ఇన్నాళ్లకు మళ్లీ తుదిపోరులో తలపడేందుకు సమాయత్తమవుతోంది.
టాపిక్