Trent Boult | ఆర్సీబీ ఫ్యాన్‌కు రాజస్థాన్ ప్లేయర్ జెర్సీ గిఫ్ట్.. వీడియో వైరల్
28 May 2022, 16:31 IST
- ఓ చిన్నారి అభిమానికి రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు ట్రెంట్ బౌల్ట్ తన జెర్సీని బహుకరించాడు. అయితే ఆ బాలుడు ఆర్సీబీ ఫ్యాన్ కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ట్రెంట్ బౌల్ట్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన క్వాలిపయర్-2 మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ గెలిచి ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ అనంతరం రాజస్థాన్ ప్లేయర్ ట్రెంట్ బౌల్ట్ ఓ చిన్నారి ఫ్యాన్‌కు తను ధరించిన జెర్సీని బహుమతిగా ఇచ్చాడు. ఆ చిన్నారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్ కావడం ఇక్కడ విశేషం. మ్యాచ్‌లో బెంగళూరుకు మద్దతు తెలిపేందుకు వచ్చిన ఆ బాలుడు.. ఆర్సీబీ జెర్సీని ధరించాడు.
మ్యాచ్ అనంతరం స్టేడియంలో ఓ బాలుడు.. బౌల్ట్‌ను పలుకరించాడు. డ్రెస్సింగ్ రూంకు వెళ్తున్న బౌల్ట్.. సదరు చిన్నారిని చూసి తను ధరించిన రాజస్థాన్ రాయల్స్ జెర్సీని బహుకరించాడు. వెంటనే బాలుడు బౌల్ట్ ఇచ్చిన జెర్సీని తీసుకున్నాడు. అంతేకాకుండా తను ధరించిన జెర్సీని విప్పేసి.. బౌల్ట్ ఇచ్చిన రాజస్థాన్ జెర్సీని ధరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఈ సీజన్‌లో బౌల్ట్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. 15 మ్యాచ్‌ల్లో 8.24 ఎకానమీ రేటుతో 15 వికెట్లు తీశాడు.
ఈ మ్యాచ్‌లో బెంగళూరుపై రాజస్థాన్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో మే 29న గుజరాత్ టైటాన్స్‌తో జరగనున్న ఫైనల్‌లో తలపడనుంది రాజస్థాన్. ఈ జట్టు ఐపీఎల్ ఫైనల్‌కు చేరడం ఇదే రెండో సారే. ఐపీఎల్ ఆరంభ సీజన్(2008)లో టైటిల్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్.. ఆ తర్వాత ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ఐపీఎల్2022 తుదిపోరు జరగనుంది.
టాపిక్